అమరావతికి అనుకూల తీర్పు వచ్చినా…

– రైతులూ.. కింకర్తవ్యం?

కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చింది. రాజధాని ఎక్కడకు కలదని నిర్ణయం అయిపోయింది. ఇక అంతా ఆనందమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే.హై కోర్టు తీర్పు ఇస్తూ, ఒక నెలలో చేయాల్సిన పనులు, మూడునెలల్లో చేయాల్సిన పనులు, ఆరు నెలల్లో చేయాల్సిన పనులు అంటూ కండిషన్లు పెట్టినారు.మొదటి నెల గడువు లోపల చేయాల్సిన పనులకు 60నెలల సమయం కోరినారు. మూడు నెలల్లో రైతులకు అప్పగించ వలసిన డెవలప్డుప్లాట్లకు నిన్ననే ఐదు సంవత్సరాల గడువు కోరినారు. తదుపరి దానికి ఎన్నాళ్లు గడువు కోరతారో తెలియదు.చేయాలని ఉండేవాడైతే కొంత నమ్మకం పెట్టుకుని కాలం గడపవచ్చు. కానీ వినాశనాన్ని కోరుకునే వాడిని నమ్ముకొని చేతులు ముడుచుకుని కూర్చోవడం ఎంత అనర్థదాయకమో మీకు ఎవరికీ అర్థం అవుతున్నట్లు లేదు.

రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్న పై వారి రిటైర్మెంట్ కోసం, అతను పొంచి ఉన్నాడు.వారు రిటైర్మెంట్ అయిన మరుక్షణం మరలా గజినీ లాగా దండయాత్ర మొదలు పెడతాడు.ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు.ఈ సంవత్సర కాలంలో నక్కజిత్తుల వేషాలు ఎన్నైనా వేయవచ్చు, మరలా అధికారంలోకి రావడానికి అన్ని వనరులు వాడబోవుచున్నారు.పరిస్థితులు అనుకూలించి, అమరావతికి అనుకూలమైన ప్రభుత్వం వస్తే మంచిదే.

కానీ పరిస్థితులు ఎదురు వస్తే ఏంటి మనముందున్న కర్తవ్యం. ఎవరైనా ఆలోచిస్తున్నారా?గత సంవత్సర కాలం నుంచి, మొత్తుకుంటూనే ఉన్నాను. టైం లోపల ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వనందుకు గాను, నష్టపరిహారం కోరుతూ ప్రతి రైతు కోర్టును ఆశ్రయించాల్సి ఉంది. గవర్నమెంటు వారు వేసిన అడుగులకు, ప్రతి స్పందించడమే కానీ, మనం ముందడుగు వేసి గవర్నమెంటుని ఫిక్స్ చేసే ప్రయత్నాలు ఆలోచనలు ఎందుకు చేయడం లేదు?

దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లు, అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉన్నా, చేవ చచ్చిన వారివలే చూస్తూ కూర్చున్నారు ఎందుకు. లీగల్ కమిటీ వారు రైతులను డ్రైవ్ చేయవలసిన అవసరం ఉందా లేదా? పోయినసారి 60 నెలలు అడిగినప్పుడే ఉదృతంగా చేసి ఉండాల్సింది కదా? ఇప్పుడు నెలరోజులు కోర్టు సెలవులు వృధాగా పోయాయి. ఇంకొక రెండు నెలల్లో మనకున్న అనుకూల సమయం గతించి పోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి?

రైతులారా, ఇంకొక రెండు సంవత్సరాలలో కవుళ్ళ టైం కూడా ముగిసిపోతుంది. అప్పుడు రైతులు ఎలా బతకాలి ? ప్రభుత్వం వారు మళ్లీ మూడు రాజధానులు అనే మాటలు అన్నా, లేదు డెవలప్ చేయకపోయినా, వాటికీ కోర్టు ద్వారా మనం నష్ట పరిహారం పొంది ఉండటమే మార్గం.
కోర్టు వారి తీర్పు నందే మనకు నష్టపరిహారం పొందే హక్కును కల్పించి ఉన్నారు. అటువంటి దానిని ఉపయోగ పెట్టుకోకుండా, చేష్టలుడిగి చూస్తున్నాం.

అడగందే అమ్మ అయినా పెట్టదు అనే సామెత మరచి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూపులు చూస్తున్నాం. మీ ఆస్తులకు మీరే బాధ్యులు. మీ పిల్లలకు మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది.
amara2 అందువలన చేయవలసిన కార్యక్రమం గురించి మీరే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. తీర్పులోని మర్మం గ్రహించి, తదనుగుణంగా కార్యాచరణ లేకపోతే, అంతటి గొప్ప తీర్పు వచ్చినా ప్రయోజనం ఏంటి?

– మద్దినేని శ్రీనివాస్

Leave a Reply