Suryaa.co.in

Political News

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాకుల లెక్కలే!

– ఆంధ్ర జాతకం ఎలా ఉందో చూడడానికి మరో మూడు రోజులు ఆగాలి.

“ఎగ్జిట్ పోల్“ అంటే …. ఒక వ్యక్తి పోలింగ్ బూత్ లోకి వెళ్లి , ఓటు వేసి బయటకు వచ్చేటప్పుడు …. ఆ వ్యక్తిని కలిసి , ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ప్రక్రియ -”ఎగ్జిట్ పోల్ “

తెలంగాణ లో గల 119 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఉన్న పోలింగ్ బూత్ లు ఎన్ని ? ఎన్ని బూత్ ల ముందు ఇప్పుడు అంకెలు చెప్పిన సంస్థల ప్రతినిధులుఉన్నారు ? ఎంత మంది అభిప్రాయాలను వారు సేకరించారు ? అంత బలగం ఈ “సర్వే” చేశామని చెప్పే వారికి ఉందా?

ఒక పక్కన ఇంకా పోలింగ్ పూర్తిగా పూర్తి కాకముందే. … , ఈ సంస్థలు అంకెలు చెప్పేయడం ….; మన చానెల్స్ ఇరగ దీసెయడం చేసేశాయి. కామారెడ్డి లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ సర్వే సంస్థలు ఓడించేశాయి. టీవీ ఛానళ్ళు డిబేట్లు నిర్వహించేశాయి. ప్రఖ్యాత ఆంగ్ల టీవీ ఛానల్ ఎన్ డీ టీ వీఈ సర్వే ఫలితాలు ప్రకటిస్తూనే,. మరో ముక్క కూడా ప్రముఖం గా చెబుతుంది .

ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఓ సూచిక మాత్రమేనని, ఈ అంచనాలు పూర్తిగా తప్పు కూడా కావచ్చునని ఎన్ డీ టీ వీ న్యూస్ వెబ్సైటు లో “ డిస్ క్లెయిమర్ ” కూడా పబ్లిష్ చేస్తుంది.

ఇక , తెలంగాణ ఎన్నికలకు సంబంధించి …. పోస్టల్ బాలట్ ను ఈ “సర్వే ” సంస్థ కూడా పరిగణన లోకి తీసుకోలేదు. ఎన్నికల కమిషన్ కొత్తగా ప్రవేశపెట్టిన “హోమ్ ఓటింగ్ ” లో ఓటేసిన వారి ని పరిగణన లోకి తీసుకోలేదు.

ఏ ఎన్నికల్లో అయినా. … వందలు , ఒకటి -రెండు వేల లోపు మెజారిటీ తో గెలిచేవారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జరిగిన పోలింగ్ లో ఎన్ని నియోజక వర్గాలలో ఏ పార్టీ వారు ఎంతమంది ఇలా అతి తక్కువ మెజారిటీ తో బయట పడతారో ఏ ఒక్క ఛానలూ చెప్పలేదు. వారి దగ్గర ఆ డేటా లేదా ? డేటా లేకపోతే , ఏ పార్టీ వారు ఎంతమంది గెలుస్తున్నారో ఎలా చెప్పగలుగుతున్నారు ?

అంటే ….“ ఎగ్జిట్ పోల్ ” ఫలితాలు చెప్పడం అనేది ఒక ఫ్యాషనబుల్ వ్యాపకం అయిపోయింది. ఒకటి మాత్రం నిజమని అనిపించుతున్నది. కేసీఆర్ పదేళ్ల నుంచి అధికారం లో ఉండడం వల్ల, ఆయన వ్యవహార శైలి పై తీవ్ర అసంతృప్తి తెలంగాణ ప్రాంతం లో ఉన్నది . సోషల్ మీడియా లో ఆయన వ్యవహార శైలి కి వ్యతిరేకం గా భారీ ప్రచారం జరిగింది. గాలికి నిప్పు తోడైనట్టుగా. …. రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ కు తోడైంది .

ఇలా అనేక కారణాల వల్ల, ఈ సారి కాంగ్రెస్సే అన్న రాజకీయ వాతావరణం తెలంగాణ లో కనిపించింది. తెలుగు దేశం పోటీ చేయక పోవడం అన్నది కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయం బాగా షికార్లు చేసింది . చంద్రబాబు అరెస్ట్ పై హైదరాబాద్ లో నిరసనలు , ర్యాలీ లు , లేదా ధర్నాలు చేపడదాము అనుకున్న వారి పట్ల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు “గుడ్ టేస్ట్ ”లో లేవు. ఈ కారణాలు అన్నీ కలిపి , ఈ సారి బీ ఆర్ ఎస్ ఓటమి తథ్యం అనే మైండ్ సెట్ తో ఏవో కాకుల లెక్కలు టీవీ స్టేషన్ లకు అందించారు.

టీవీ లలో ఈ “సర్వే ” అంకెలు ప్రదర్శించే సమయానికి పోలింగ్ ఇంకా పూర్తి కాలేదు . సాయంత్రం 5గంటలకు పోలింగ్ బూత్ ఆవరణలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

కాంగ్రెస్ గెలవ వచ్చు , గెలవక పోవచ్చు . అలాగే బీ ఆర్ ఎస్. కూడా. అయితే , ఒక్కటి మాత్రం నిజం . తెలంగాణ ఎన్నికల ఫలితం ప్రభావం ఏపీ రాజకీయాల పై తీవ్రం గా ఉంటుంది. కే సీ ఆర్ గెలిస్తే,. …, జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఆయన అన్ని రకాలుగా దన్ను గా ఉంటారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది . కాంగ్రెస్ గెలిస్తే ; ప్రతిపక్షాలకు పెద్ద ఊపు వస్తుంది .

మరి , ఆంధ్ర జాతకం ఎలా ఉందో చూడడానికి మరో మూడు రోజులు ఆగాలి.

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

 

LEAVE A RESPONSE