మన దేశం వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు.వ్యవసాయం వృత్తిగానే కాదు, జీవనాధారంగా వృద్ధి చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది. ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుంచే శ్రమ పుట్టింది. శ్రమ నుంచి విలువలు పుట్టాయి. విలువల నుంచి జీవితాలు నిలబడ్డాయి. తరాలకు అవి అనువంశికంగా వస్తున్నాయి. క్రమంగా ఈ రంగంలో ఉండే అవస్థలు, ఈ రంగం మీద పెట్టే దృష్టి ఎట్లయితే తగ్గుతూ వచ్చిందో, అదే క్రమంలో సమాజంలో విలువలు మరో రూపం సంతరించుకుంటున్నాయి.
వ్యవసాయరంగం మీద అమెరికాలో ఒక నాడు 33 శాతం మంది ఆధారపడి ఉంటే నేడు 2 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఇతర రంగాల్లో అమెరికా బలంగా ఉన్నందున అది బయటికి గొప్పగా కనిపిస్తుండవచ్చు. అమెరికాలో ఉన్న ఆర్థిక వనరులు కూడా అది కనిపించకపోవడానికి కారణం కావచ్చు. పేద దేశాల్లో ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడం మూలంగా అమెరికాకు మేలు జరగవచ్చు.
ప్రపంచంలో అమెరికా తర్వాత వ్యవసాయభూమి విస్తీర్ణంలో రెండో స్థానం, పంటల ఉత్పత్తిలో మూడో స్థానంలో భారతదేశం ఉన్నది. ఇప్పుడు దాదాపు 60 శాతం జనాభా ఆధారపడిన భారత్ లాంటి వ్యవసాయ ప్రాధాన్యం కలిగిన దేశంలో ఈ రంగాన్ని నిర్ల క్ష్యం చేయడం తగదు. కొత్త సమాజం శ్రమకు దూరమవ టం ద్వారా విలువలకు దూరమై, శ్రమను గౌరవించని పరిస్థితిలో మానవ విలువలు తరిగిపోతున్నాయి. సుఖమైనదే జీవితం అనుకునే ఒక భ్రమలో ప్రపంచం ముందుకుసాగుతున్నది. దేశంలో ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కలిసిన తర్వాత పడ్డ అవస్థలు అందరికీ తెలిసినవే.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల మూలంగా రైతులు బోర్ల మీద ఆధారపడి, కరంటు లేక తిప్పలు పడవలసి వచ్చింది. కొందరు రైతులు వలసలుపోయి మరణిస్తే, మరికొందరు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొందరు చెట్లకు ఉరి వేసుకున్నారు. కరెంటు షాక్ తగిలి, రాత్రి వేళ పాములు కరిచి ప్రాణాలు కోల్పోయేవారు. అనేకవిధాలుగా రైతుల జీవితం సంక్షుభితమైంది. ఆ సమస్యల నుంచి బలపడిందే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఉద్యమం. పలురకాల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి పద్నాలుగేండ్లు ఉద్యమించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. దాని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం. వ్యవసాయాన్ని, తదనుగుణమైన విలువలను పునఃప్రతిష్ఠించడం, శ్రమను, చెమటచుక్కను గౌరవించడం ద్వారా నేడు తెలంగాణ మరొక్కసారి భారతదేశానికి పరిచయమవుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ 60 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయరంగం మీద దృష్టిసారించారు. సంక్షోభ ఊబి నుంచి రైతులను బయటకు తీసుకువచ్చారు. సాగునీటి సదుపాయాలను పెంచుతూనే ఒకప్పుడు వ్యవసాయానికి దూరమైన వారిని తిరిగి ఈ రంగం వైపునకు ఆకర్షించేందుకు చర్యలు చేపట్టారు. రుణమాఫీ, సాగుకు ఉచితంగా 24 గంటల కరంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు సకాలంలో మద్దతు ధరకు కొనుగోళ్లు కూడా చేయడం ద్వారా రైతాంగంలో విశ్వాసం పెరగడంతో వ్యవసాయం పట్ల భరోసా కలిగింది.
తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన భూమి కోటి 31 లక్షల ఎకరాలే. కానీ, తెలంగాణ ప్రభుత్వ రైతు అనుకూల విధానం ఫలితంగా నేడు (2020-21 నాటికి ఉద్యానశాఖతో కలిపి) 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే 84 లక్షల ఎకరాల నూతన సేద్యాన్ని మనం సాధించాం. ఏడేండ్లలో సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. 2014-15లో పంటల దిగుబడి 154.16 లక్షల టన్నులు ఉండగా, 2020-21 నాటికి (120.55 శాతం వృద్ధి) 185.84 పెరిగి 340.00 లక్షల టన్నులకు చేరుకున్నది. రైతులను సంఘటితం చేయడం కోసం లక్షా 61 వేల మంది రైతులతో రైతుబంధు సమన్వయ సమితులను ఏర్పాటుచేసి, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున 2,601 రైతు వేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
వ్యవసాయం ద్వారా వృత్తులు, ఉపాధులు మాత్రమే కాదు, గ్రామాలు బాగుపడ్డాయి. ఆర్థికవ్యవస్థ బలోపేతమైంది. ప్రకృతిపరంగా కూడా ఈ రోజు మానవాళి ఎదుర్కొంటున్న రెండు పెనుముప్పులలో ఒకటి టెర్రరిజం, రెం డవది పర్యావరణ విధ్వంసం. టెర్రరిజం రాజకీయంగా, ఆర్థికంగా ఎదుర్కోవాల్సిన అంశమైతే, పర్యావరణ పరిరక్షణ అనేది దేశదేశాల్లో పాలకులు నిబద్ధతతో, దూరదృష్టితో వివిధ రంగాల్లో
అమలుచేసే కార్యక్రమాల వల్ల సాధ్యపడుతుంది. హరితహారం చెట్లు నాటినా, వ్యవసాయం చేసినా, ఉపరితలం మీద ఉండే ప్రాజెక్టులు, కాలువల నీళ్లతో భూగర్భజలం పెరగడం మూలంగా భూమి మీద పచ్చదనం పెరుగుతుంది. ఈ విధమైన చర్యల వల్ల ఈ ఏడేండ్లలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల మేర తగ్గిపోయాయి. తెలంగాణ వచ్చేనాటికి అటవీ శాతం 20.38 శాతం ఉండగా హరితహారం మూలంగా 24.05 శాతానికి చేరుకున్నది. ఈ ఏడేళ్లలో 3.67 శాతం అటవీ ప్రాంతం పెరిగింది. ఇది జాతీ య సగటుకన్నా ఎక్కువ. జాతీయ సగ టు 21.34 శాతం మాత్రమే. తెలంగాణలో 66.65 లక్షల ఎకరాల్లో ప్రస్తు తం అటవీ ప్రాంతం ఉన్నది.
వ్యవసాయాన్ని బలోపేతం చేయడం మూలంగా ప్రజలు ఖాళీగా ఉండకుండా వృత్తులు, ఉపాధుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయం ప్రత్యక్ష ఉపాధి మాత్రమే కాకుండా పలురకాల పరోక్ష ఉపాధులకు తావిచ్చింది. గత ఏడేండ్లలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి, కొత్త ప్రాజెక్టులను కూడా నిర్మిస్తూనే, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించి, ఉచిత చేపపిల్లలను పంపిణీ చేయడం మూలంగా మత్స్యసంపద అనూహ్యంగా పెరిగింది. 2016-17లో 1,93,732 మెట్రిక్ టన్నులున్న చేపల ఉత్పత్తి 2020-21 నాటికి 3,49,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. రూ.1356.12 కోట్ల విలువ ఉన్న మత్స్య సంపద రూ.3,141 కోట్లకు చేరుకోవడం గమనించదగిన విషయం. ఇక సబ్సిడీ మీద రాష్ట్ర ప్రభుత్వం 79.16 లక్షల గొర్రె పిల్లల్ని పంపిణీ చేయగా, వాటికి 1.30 కోట్ల పిల్లలు పుట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటి విలువ ప్రస్తుతం రూ.7,800 కోట్లు అని అంచనా.
సాగునీటి రాకతో పట్టణాలకు వలసలు బాగా తగ్గిపోయాయి. ఇంతకుముందు వ్యవసాయరంగాన్ని వదిలి ఇతర ఉపాధులు వెతుక్కున్నవారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు.వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగి, ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణ గ్రామాలకు కూలీలు వలస వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపద అవకాశాలు పెరిగిన నేపథ్యంలో ఆటోమొబైల్, ద్విచక్ర, కార్ల షోరూంలు, ఆహార రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో 2014-15లో 94,537 వ్యవసాయ ట్రాక్టర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 2.14 లక్షలకు చేరాయి. 2014-15లో 6,318 హార్వెస్టర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 14,483లకు చేరాయి.
మరో అధునాతన కంప్యూటర్ కనుక్కొని విజయాలు సాధించినా, ఒక రాకెట్‌ను కనుక్కొని చంద్ర మండలానికి వెళ్లినా, రేపు మరింత సాంకేతికతను సంతరించుకొని సూర్యగ్రహానికి వెళ్లినా- ఇలా ఏది జరిగినా భూ ఉపరితలం మీద ఉన్న మానవాళి మాత్రమే కాదు సకల జీవరాశులన్నీ ఏదో రకమైన ఆహారాన్ని పొందాల్సిందే. జీవకోటికి 90 శాతం ఆహారం వ్యవసాయరంగం నుంచి ఉత్పత్తి అవుతుంది.
ఇంత ఉత్కృష్టమైన వ్యవసాయ వృత్తిని పెంపొందించడం పాలకుల బాధ్యత. ఏ పనీ రానివాళ్లే వ్యవసాయం చేయాలన్న దురవస్థ పోవాలి. సగటు గ్రామీణుడి నుంచి దేశ అత్యున్నత వ్యక్తి వరకు ప్రత్యక్ష్యంగా వ్యవసాయరంగం పట్ల మక్కువ కలిగి అందులో ఏదో రకంగా లీనం కావాలి. భూసారాన్ని పెంచుకుంటూ సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలి. నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారం అందరికీ లభించేట్లు కృషిచేయాలి.
సర్వ ఉపాధులు, వృత్తులలో ఉన్న వారు కూడా పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచాలి. సొంత జాగలో, ఇంటి పెరడులో, మిద్దె మీద- ఎక్కడైనా కావచ్చు- ఏదో రకంగా సాగు చేపట్టాలి. భవిష్యత్ తరాలకు ఇతర రంగాల మీద ఆకర్షణ పెరిగి, వ్యవసాయం మీద మక్కువ తగ్గి అవగాహన కోల్పోతే మొత్తం మానవాళికే అరిష్టం. వ్యవసాయం చేసే వాళ్లు తక్కువై, తినేవాళ్లు ఎక్కువై సమతుల్యత లోపిస్తుంది. వ్యవసాయ రంగం వైపు కొత్త తరం దృష్టి సారించనట్టయితే భవిష్యత్‌లో రైతులు అనే వారిని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది.