బహుజన ఐకాస బాలకోటయ్య విజ్ఞప్తి
రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు శాంతి భద్రతలకు తలనొప్పిగా మారాయని, వీటి నిరోధానికి రాజ్యాంగ పరమైన ఎస్సీ, ఎస్టీ కులాల కమీషన్ చైర్మన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు ప్రభుత్వ అభివృద్ధి కోణాన్ని, సంక్షేమ పథకాల అమలును మసకబారేలా చేస్తున్నాయని, చందమామను చీకటి మేఘాలు క్రమ్మినట్లు, చంద్రబాబు అభివృద్ధి శ్రమను కమ్మేస్తున్నాయని చెప్పారు. కమీషన్ల నియామకాలతో వీటి నియంత్రణకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దశాబ్దాల కాలంగా గత ప్రభుత్వాలు నియమించిన కమీషన్ నియామకాల్లో జాప్యం ఉండకూడదని చెప్పారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, నిరక్షరాస్యత తదితర కారణాలతో పసి పిల్లలపై, మైనర్ బాలికలపై దాష్టీకాలు జరగటం బాధాకరం అన్నారు.
గత ఐదేళ్ళ వైకాపా ప్రభుత్వం ఇలాంటి సంఘటనల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, మళ్ళీ అలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొందని తెలిపారు. కమీషన్ల నియామకం లేకపోవడంతో ప్రతి సంఘటనకు హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి భాధ్యత పడాల్సి వస్తోందని, ప్రతి పక్షం విమర్శలకు సమాధానం చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఎస్సీ ,ఎస్టీ కమీషన్ పోస్టులను భర్తీ చేయాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని కోరారు.