– అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎక్సైజ్ కమీషనర్ శ్రీధర్
విజయవాడ :మద్యం కొనుగోలు చేసే వినియోగదారులు నకిలీ మద్యం బారిన పడకుండా ఉండేందుకు, ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధం, ఎక్సైజ్ శాఖ “మీరు తాగే మద్యం నిజమైనదేనా తెలుసుకోండి” అనే రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని బుధవారం శాఖ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రారంభించారు.
వినియోగదారులలో అవగాహన పెంపు లక్ష్యం
ఈ కార్యక్రమం లో భాగంగా, విజయవాడ (ఎన్టీఆర్ జిల్లా) వెటర్నరీ కాలనీలో ఉన్న ఒక రిటైల్ మద్యం దుకాణంలో అవగాహన పోస్టర్‌ను శ్రీధర్ ఆవిష్కరించి స్వయంగా విక్రయ కేంద్రానికి అంటించారు.ఈ కరపత్రంలో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ నిజమైనదేనా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలో, నాలుగు సులభమైన దశల్లో వివరించారు.
ఈ యాప్ ద్వారా బాటిల్ క్యాప్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే ఆ బాటిల్ అసలైనదేనా కాదా అనే సమాచారాన్ని చూపిస్తుంది. అలాగే ఆ బాటిల్ బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గరిష్ఠ చిల్లర ధర వంటి వివరాలు కూడా అందిస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఉత్పత్తులకే వర్తిస్తుందని, బీర్‌కు ఇది వర్తించదని డైరెక్టర్ స్పష్టం చేశారు.
నిడమానూరు డిపోలో పర్యటన
తరువాత శ్రీధర్ విజయవాడ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిడమానూరు డిపోను సందర్శించారు. అక్కడ నిల్వల నిర్వహణ, సరఫరా విధానాలపై సమీక్ష నిర్వహించారు. సరఫరా, ఇన్వెంటరీ వ్యవస్థలపై డిపో మేనేజర్ వివరాలు అందించగా, డైరెక్టర్ సరఫరాదారులతో సమావేశమై వారి సమస్యలు విని తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు ప్రదర్శన
రాష్ట్రంలోని అన్ని లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలలో “మీరు తాగే మద్యం నిజమైనదేనా తెలుసుకోండి” పోస్టర్లను స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు మద్యం కొనుగోలు సమయంలో జాగ్రత్తగా, అవగాహనతో వ్యవహరించ గలుగుతారు.