– ఇంకా నడుస్తున్న మాజీ సీఎస్ హవా?
– విశాఖలో ఇప్పటికీ రెడ్డిగారు చెప్పిందే వేదమట
– అధికారం లేకపోయినా విశాఖలో ‘రెడ్డి’కార్పెట్?
– సీఎంఓలో ఆయనకు దన్నుగా నిలుస్తుందెవరు?
– బీసీవాదం పేరుతో సొంత కులానికి సేవ ఏమిటి?
– ఒక కులానికి కొమ్ముకాస్తున్నా కళ్లప్పగించి చూస్తున్న సర్కారు
– ఆయన కింద పనిచేసిన వారందరికీ కీలక పోస్టింగులిచ్చారంటూ ఆరోపణలు
– గతంలో మాజీ సీఎస్, ఆయన కొడుకు విశాఖ భూముల కొనుగోళ్లపై టీడీపీ ఆరోపణాస్త్రాలు
– కూటమి అధికారంలోకి వచ్చినా వాటిపై విచారణ కరవు
– విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ బదిలీ వెనక సీఎంఓ అధికారి?
– రెడ్డిగారి కోసమే ఆమెను బ(ది)లీ చేశారా?
– సోషల్‌మీడియాలో కమ్మ సంఘాల కన్నెర్ర
– తప్పు ఒకరిది? శిక్ష ఇంకొకరికా?
– ఇతర కులాలకు భయపడి తమను బలిచేస్తున్నారంటూ కమ్మ సంఘాల ఫైర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన సీఎంఓలో ఓ కీలక అధికారి. చూడ్డానికి సాత్వికంగానే కనిపిస్తారు. సుతిమెత్తగా మాట్లాడతారు. అదంతా ఒకవైపే. ఇది ఎవరికీ ఇబ్బంది లేని వ్యవహారమే. కానీ కథంతా రెండోవైపే! ఆయనో కనిపించని కులవాది అని.. తనకింద పనిచేసిన వారికి కీలక పోస్టింగులు కట్టబెట్టారని..
ఉత్తరాంధ్రలోని తన కులమన్నా.. ఆ కులానికి చెందిన అధికారులు, నాయకులన్నా మహా ప్రేమ కురిపిస్తారన్నది బయట వినిపించే ముచ్చట.
టీడీపీకి, అధినేత చంద్రబాబునాయుడుకూ ‘అనధికార రాజగురువు’ అన్న ప్రచారంతోపాటు.. ప్రతివారం సర్కారు-కూటమికి తన వ్యాసరాజాలతో హితోపదేశం చేసే ఓ మీడియా మొఘల్కు చెందిన మీడియాలోనే, ఆయన ‘ఫ్యామిలీ వసూళ్ల’పై నిలువెత్తు పేజీలో కథనం రాసినా.. సదరు సీఎంఓ అధికారిపై చర్యలు శూన్యం.
ఇప్పుడు అలాంటి అధికారిపై ఏపీలోని కమ్మసామాజికవర్గం- కమ్మ సంఘాలు సోషల్‌మీడియా వేదికగా జమిలిగా విరుచుకుపడుతున్నాయి. దానికి కారణం.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి శక్తివంతుడిని ఢీకొన్న ముక్కుసూటి అధికారి, కమ్మ వర్గానికి చెందిన విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై వేటు వేయడమే. వసూల్రాజాగా ఆరోపణలెదుర్కొంటున్న ఓ ఉన్నతాధికారి చర్యలు-వేధింపులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడమే ఆమె చేసిన నేరం.
మరి సదరు మహిళా అధికారి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించి, ఆ లేఖలోని నిజాలు నిగ్గుతేల్చి చర్యలు తీసుకోవడమే ధర్మం కదా? కానీ ఇక్కడేం జరిగింది? విచిత్రంగా.. విస్మయకరంగా.. విభ్రాంతికరంగా.. ఫిర్యాదు చేసిన సదరు మహిళా అధికారి శ్రీలేఖపైనే వేటేశారు. మళ్లీ బాగుండదనుకున్నారో ఏమో.. ఆ వసూల్రాజాపైనా బదిలీ వేటేశారు. దీన్ని సమ న్యాయం అంటారా? అసలు ఈ నిర్ణయం తీసుకున్న వారి మెడపై తల ఉందా? అందులో గుజ్జుందా?
పాలనానుభవం లేని పిచ్చివాళ్లు సైతం ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకోరు కదా? ఇంత అనుభవం ఉన్న పాలకులు, అన్నీ తెలిసి ఈ పిచ్చి నిర్ణయం ఎలా తీసుకున్నారు? అంటే కమ్మ అధికారిణిపై వేటు వేశారు కాబట్టి.. ఆమె ఆరోపణలు చేసిన అధికారిపైనా వేటు వేస్తే అది సమన్యాయం అవుతుందా? ఇద్దరినీ శిక్షించారని లోకం అనుకోవాలన్న వెర్రి వ్యూహమా? అంటే కులాలను తూకం వేసి న్యాయం అమలు చేస్తున్నారా?.. ఇదీ ఇప్పుడు కమ్మ సామాజికవర్గం సోషల్‌మీడియాలో శరపరంపరగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.
అసలు ఈ మతిలేని నిర్ణయం వెనుక ఉన్న ఆ సీఎంఓ అధికారి.. ఎవరి కళ్లలో మెరుపులు చూసేందుకు ఇదంతా చేశారు? పదవిలో లేకపోయినా మాజీ సీఎస్ రెడ్డిగారి హవా ఇంకా విశాఖలో విజయవంతంగా ఎలా నడుస్తుంది? ఆ ‘కాకినాడ’ కథలేంటి? పూర్వాశ్రమంలో ఆయన దగ్గర పనిచేసిన అధికారులకు.. ఉత్తరాంధ్రలో తన కులానికి చెందిన అధికారులకు కీలక పోస్టింగులు ఎలా దక్కుతున్నాయి?.. ఇదీ ఇప్పుడు ఇంటా బయట జరుగుతున్న రచ్చబండ హాట్‌టాపిక్.
కమ్మ సామాజికవర్గానికి చెందిన విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై వేటు వెనుక మాజీ సీఎస్ రెడ్డిగారి హస్తం ఉందని.. సీఎంఓలో ఓ కీలక అధికారి ద్వారా, సదరు రెడ్డిగారే ఆమెను బలి చేశారన్న కథనాలు సోషల్‌మీడియాలో గుప్పుమంటున్నాయి. తాను సీఎస్‌గా ఉన్నప్పుడు విశాఖలో తన పుత్రరత్నం కారుచౌకగా కొన్ని, కొట్టేసిన భూములు మరికొన్నిటిపై ఆర్డీఓ శ్రీలేఖ రాజముద్ర వేయకపోవడమే, ఆమె బ(ది)లీకి కారణమన్నది ఇప్పుడు రాజకీయ-అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ.
విశాఖ ఆర్డీఓగా పనిచే స్తున్న శ్రీలేఖ.. అక్కడి ఓ రెవిన్యూ ఉన్నతాధికారి తనను ఎలా వేధించింది? వీఐపీలకు స్వాగతం పేరుతో అర్ధరాత్రి వేళ తనను ఎలా వేధించింది? సదరు రెవిన్యూ అధికారి శ్రీకాకుళంలో ఉన్న తన కుటుంబానికి కిరాణా సరుకుల కోసం కింది స్థాయి అధికారులను ఎలా వేధిస్తున్నారన్న విషయాన్ని ఆమె, కలెక్టర్‌కు లేఖ రూపంలో రాశారు. తర్వాత అది కాస్తా మీడియాలో హల్చల్ చేసి, సదరు విశాఖ ఉన్నతాధికారి అసలు కథను బట్టబయలు చేసింది.
దానితో రంగంలోకి దిగిన ఓ సీఎంఓ ఉన్నతాధికారి.. అసలు శ్రీలేఖ రాసిన లేఖపై ప్రాథమిక విచారణ కూడా జరిపించకుండా, ఆమెపై వేటు వేశారు. పనిలోపనిగా మిగిలిన కులాలు ఏమన్నా అనుకుంటాయోనన్న ముందుచూపుతో, తన కులానికి సంబంధించిన సదరు రెవిన్యూ అధికారిపైనా వేటు వేసి.. సమన్యాయం చేసినట్లు చూపించడమే, ఇప్పుడు ఈ గత్తరకు కారణమయింది. ఈ నిర్ణయంపై యావత్ కమ్మ సామాజికవర్గం భగ్గుమంది.
ఇప్పటికే కమ్మ అధికారులకు కీలక పోస్టింగులివ్వాలంటే, మిగిలిన కులాలు ఏమనుకుంటాయోనని భయపడుతున్న కూటమిపై పీకల్లోతు కోపంతో ఉన్న కమ్మవర్గం.. శ్రీలేఖపై వేటు వ్యవహారంలో ‘పార్టీ మొహమాటాలకు‘ తెరిదించి, తిరుగుబాటుకు తెరలేపింది. తమ వర్గ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తూ, చక్రం తిప్పుతున్న ఓ సీఎంఓ అధికారి-ఆయన వెనుక ఉన్న ఓ మాజీ సీఎస్ అయిన రెడ్డిగారి కథను అరటిపండు వలిచినట్లు సోషల్‌మీడియా వేదికపై వదిలింది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ సాయిప్రసాద్‌కు సీఎస్ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న కమ్మ వర్గానికి, తాజా శ్రీలేఖపై వేటు వ్యవహారం పుండుమీద కారంలా పరిణమించింది.
అందులో భాగంగా కమ్మ సామాజికవర్గం.. ఆర్డీఓ శ్రీలేఖపై వేటు వెనక అసలు కథను బయటపెట్టడంతో, నోరెళ్లబెట్టడం అధికార-రాజకీయ వర్గాల వంతయింది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ సర్కారులో కీలకపాత్ర పోషించిన ఓ మాజీ సీఎస్ అయిన సీమ రెడ్డిగారు తెరవెనక ఉండి, సీఎంఓలోని కీలక అధికారి ద్వారా కథ నడి పించారన్నది కమ్మ వర్గం సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం.
ముక్కుసూటి అధికారిణి అయినప్పటికీ, లౌక్యం లేకపోవడం.. మాట కటువుగా ఉండటం.. అప్పటికే కొందరు తమిళ ఐఏఎస్‌లు, ఆమెపై వేసిన ‘యారగెన్సీ’ ముద్ర.. మాజీ సీఎస్ కుటుంబ భూములపై అధికార ముద్ర వేసేందుకు నిరాకరించడం.. కలసి వెరసి శ్రీలేఖపై వేటుకు కారణమన్నది, కమ్మ వర్గం చేస్తున్న వాదన.
నిజానికి జగన్ జమానాలో వెలిగిన ఓ మాజీ సీఎస్ కుమారుడు ఎన్నికలకు ముందు విశాఖలో అడ్డగోలుగా భూములు కొన్నారని, కొన్ని అసైన్డ్ భూములు ఆక్రమించారని, నిషేధం ఉన్న భూములను కారుచౌకగా కొని, తర్వాత వాటిపై నిషేధం తొలగించారంటూ టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు రోడ్డెక్కింది. ఆ సందర్భంలో సీఎస్-ఆయన పుత్రరత్నంపై లెక్కలేనన్ని ఆరోపణలు చేస్తూ, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెట్టింది.
విచిత్రంగా.. సదరు రెడ్డిగారిపై అన్నేసి ఆరోపణలు చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చి 17 నెలలయినా.. ఇప్పటివరకూ వాటిపై ఒక్క విచారణ కూడా జరిపించకపోవడమే వింత. అసలు ఆ భూములు ఇప్పుడు రెడ్డిగారి చేతిలోనే ఉన్నాయా? లేక ఎవరికయినా బదిలీ అయ్యాయా? బదిలీ చేయించుకున్నారా? అన్నదే ఎవరికీ తెలియని రాజకోట రహస్యం.
ఆ 60 ఎకరాల ఫ్రీహోల్డింగ్ భూముల కోసమేనట!
ఇక కమ్మ వర్గం సోల్‌మీడియాలో బయటపెట్టిన గుట్టు ఏమిటో చూద్దాం. విశాఖలో 350 కోట్ల విలువైన 60 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూమిపై ఆ సీఎంఓ అధికారి మనసుపారేసుకున్నారట. అయితే ఆ భూమిని మాజీ సీఎస్ ఆయన పుత్రరత్నం గతంలోనే కొనుగోలు చేశారట. ఇక ఇప్పుడు తన పప్పులు ఉడకవని గ్రహించిన సదరు మాజీ సీఎస్.. ఆ సీఎంఓ అధికారితో మాట-ముచ్చట పూర్తి చేసుకున్నారట. అక్కడి నుంచి కథ నడిపిన ఆ సీఎంఓ అధికారి.. తొలి అడుగుగా తన కులానికే చెందిన ఓ రెవిన్యూ అధికారికి విశాఖకు పోస్టింగు వేయించారట. మాజీ సీఎస్ గారి భూముల ఫ్రీ హోల్డ్ పనికి ఆర్డీఓ శ్రీలేఖ అంగీకరించరు కాబట్టి.. ఆమెను వేధించడం ద్వారా తనంతట తానే వెళ్లేలా చేయడమే సదరు ఐఏఎస్‌ల అసలు వ్యూహమట. వారు ఊహించినట్లే జరిగి.. శ్రీలేఖ ఆవేశపడి లేఖ రాయడం, అదే అదునుగా తీసుకుని ఆమెపై వేటు వేటు వేయడం చకచకా జరిగిపోయిందట. అన్నట్లు ఆర్డీఓ శ్రీలేఖను వేధించిన సదరు విశాఖ రెవిన్యూ అధికారి ఆ మాజీ సీఎస్‌కు బాగా దగ్గరవారన్న ప్రచారం లేకపోలేదు. ఇదీ.. ఆర్డీఓ శ్రీలేఖపై వేటు తెరవెనక కారణాలంటూ కమ్మవర్గం సోషల్‌మీడియాలో వెల్లడించిన అసలు నిజాలు!
కాగా అనంతపురం టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్‌చౌదరికి, ఆర్డీఓ శ్రీలేఖ సమీప బంధువున్న ప్రచారం జరుగుతోంది. ఆవేశం తప్ప ఏమాత్రం లౌక్యం లేని ఓ మహిళా అధికారి కెరీర్ ఇలా కష్టాల్లో పడిందన్నమాట.
సిసోడియాపై స్కెచ్ వేసిందెవరు?
పనిమంతుడిగా పేరున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా శంకరగిరి మాన్యాల వెనక సైతం.. ఆ సీఎంఓ అధికారి హస్తం ఉందన్న ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో అప్పట్లోనే జరిగింది. ఒక ఫాం హౌస్‌లో జరిగిన ఓ ఘటనను ఫిర్యాదుగా మార్పించి, దానిని సీఎం వద్ద బూచిగా చూపించి, కీలకశాఖలు నిర్వహించిన సిసోడియాను అప్రాధాన్య శాఖకు బదిలీ చేయించడంలో.. సీఎంఓలోని ఆ అధికారి తెరవెనుక చక్రం తిప్పారన్న ప్రచారం జరిగింది. దానికి కారణంపై ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యం కలిగించకమానదు.
ప్రస్తుత సీఎస్ విజయానంద్ తర్వాత సాయిప్రసాద్ సీఎస్ కానున్నారు. ఆయన తర్వాత ఇప్పటికే స్పెషల్ సెక్రటరీగా ఉన్న సిసోడియాకు సీఎస్ అయేందుకు సహజంగా అవకాశాలెక్కువ. అయితే ప్రస్తుతం స్పెషల్ సెక్రటరీకాని ఆ సీఎంఓ అధికారి.. సాయిప్రసాద్ రిటైరయ్యేనాటికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అవుతారట. ఆ సమయంలో సిసోడియా తనకు అవరోధం కాకుండా.. ముందు జాగ్రత్తగా ఆయనపై ఆరోపణలు చేయించి, అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయించారన్నది ఐఏఎస్ వర్గాల్లో ఇప్పటికీ జరుగుతున్న ఓ చర్చ. మరి అప్పుడు కూడా సీనియర్ కాని ఆ సీఎంఓ అధికారి, ఏకంగా సీఎస్ ఎలా అవుతారన్న సందేహం రావడం సహజమే. అయితే ఇప్పుడు సీనియారిటీ ప్రకారం ఎవరికీ సీఎస్ ఇవ్వనందున.. ‘ఇప్పటిమాదిరిగానే’ కులం కార్డుతో, సీఎస్ కావచ్చన్నది ఆయన వ్యూహమట. నిజం నారాయణుడికెరుక?
ఉత్తరాంధ్రలో ఉడుకుతున్న కాపులు?
కాగా కొద్దినెలల నుంచి ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన కాపు-తూర్పు కాపులు సైతం, సదరు సీఎంఓ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియలో అన్ని కీలక శాఖల జిల్లా స్థాయి అధికారులుగా, ఒక మంత్రి ప్రోత్సాహంతో తన కులానికి చెందిన వారినే నియమించుకున్నారన్న ఆగ్రహం, కాపు-తూర్పు వర్గాల్లో పెల్లుబికింది.
ముఖ్యంగా టీడీపీకి అనుకూలమైన ఓ ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఉద్యోగ సంఘం నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన విభజన సమయంలో సమైక్యవాద ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయనపై టీడీపీ సానుభూతిపరుడన్న బలమైన ముద్ర ఉంది. మూడేళ్ల నిబంధన అప్పటికి అమలుకాకపోయినా ఆయనను బదిలీ చేసి, తన కులానికి చెందిన అధికారిని అక్కడ నియమించేలా సదరు సీఎంఓ అధికారి చక్రం తిప్పారంటూ కాపు అధికారులు తమ వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద చర్చ పెట్టారు.
చివరకు వారంతా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వద్దకు వెళ్లి, ఇదంతా మీకు తెలియకుండా ఎలా జరుగుతుందని నిలదీస్తే.. ఆయనకు ఉత్తరాంధ్ర మంత్రి ఒకరు సిఫార్సు చేశారని, ఈ విషయంలో తానేమీ చేయలేనని గంటా నిస్సహాయత వ్యక్తం చేశారని కాపు అధికారులు వెల్లడించారు. దానితో ఉత్తరాంధ్రలో సీఎంఓ అధికారి కులానికి చెందిన అధికారులు ఏయే కీలకస్థానాల్లో ఉన్నారో వారి వివరాలను సోషల్‌మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
బీసీలకు అనుకూలంగా వ్యవహరించడం మంచిదేనని, అది అవసరం కూడా అని బీసీ ఉద్యోగ సంఘ నేతలు అంగీకరిస్తున్నారు. అయితే ఆ పేరుతో తన కులం వారిని ప్రోత్సహించడం సరైనది కాదని, తూర్పు కాపు ఉద్యోగ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా దీనివల్ల ఉత్తరాంధ్రలో.. ప్రధానంగా శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల్లో టీడీపీకి దన్నుగా ఉన్న కాపులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని, తూర్పు కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా పార్టీ నాయకత్వం దీనిని సరిచేసి దిద్దుబాటకు దిగకపోతే, తూర్పు కాపులు పార్టీకి దూరం కావడం ఖాయమంటున్నారు.