– ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి
– రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులకు ఆదేశించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే అంశంపై నిర్దిష్ట ప్రణాళికతో అధికారులు సమావేశానికి రావాలని సూచించారు. గతంలో నిర్దేశించుకున్న ప్రణాళికలు వాటి ప్రగతిని నివేదించాలని సూచించారు. లీకేజీలను అరికడుతూ ఆదాయం పెంచేందుకు కమర్షియల్ టాక్స్ కమిషనర్, జాయింట్ కమిషనర్, విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
మద్యం దుకాణాల్లో MRP క న్నా అధికంగా రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి కమర్షియల్ టాక్స్, రోడ్లు, భవనాలు, ఇతర అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తిచేసి పెండింగ్లో ఉన్న రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్లను విక్రయించే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇసుక రీచ్ ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూర్చేందుకు ఏ చర్యలు తీసుకోవాలో సీనియర్ అధికారులు సమావేశమై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, మైనింగ్ సెక్రటరీ సురేంద్రమోహన్, cerp సీఈవో దివ్య దేవరాజన్, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.