( వెంకటాచారి)
మహిళలకు సాధికారితను కల్పించడంతో పాటు దేశ భద్రతలో వారి పాత్రను పెంచాలన్న ధ్యేయంతో హోం మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ఏ) ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్రీయ పారిశ్రామిక భద్రత దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్- ‘సీఐఎస్ఎఫ్’) లో అందరూ మహిళలే ఉండే ఒక బెటాలియన్ ను ఏర్పాటు చేయడానికి హోం శాఖ ఆమోదం తెలిపింది.
కేంద్రీయ సాయుధ పోలీసు దళంలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకొనే మహిళలకు సీఐఎస్ఎఫ్ ఒక అభిమాన పాత్రమైన ఎంపికగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ లో మహిళల పాత్ర 7 శాతానికి పైనే ఉంది. ఇప్పుడు మహిళా బెటాలియన్ ను కూడా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం సీఐఎస్ఎఫ్ లో చేరి మాతృ దేశానికి సేవ చేయాలని ఉవ్విళ్లూరుతున్న మన దేశ యువతులు మరింత మందికి ప్రోత్సాహాన్ని అందించనుంది. ఈ నిర్ణయం సీఐఎస్ఎఫ్ లో మహిళలకో కొత్త గుర్తింపును ఇవ్వనుంది.
కొత్త బెటాలియన్ కు సత్వరం నియామకాలు జరపడం, ఆ సేనా దళానికి అవసరమైన శిక్షణను ఇవ్వడం, బెటాలియన్ కు ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన చోటును ఎంపిక చేయడం వంటి సన్నాహాలను సీఐఎస్ఎఫ్ ప్రధాన కేంద్రం ఇప్పటికే మొదలు పెట్టింది. కమెండో లుగా ఉంటూ వీఐపీల భద్రతకు సంబంధించిన విధుల నిర్వహణకు, అంతే కాకుండా, విమానాశ్రయాలలోనూ, ఢిల్లీ మెట్రో రైల్ కు సంబంధించి.. ఇలా బహుముఖ భూమిక లను నిర్వర్తించడానికి సమర్ధత కలిగిన ఒక విశిష్ట బెటాలియన్ ను ఏర్పాటు చేయడానికంటూ ప్రత్యేకంగా ఓ శిక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.
సీఐఎస్ఎఫ్ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సీఐఎస్ఎఫ్ లో అందరూ మహిళలే సభ్యులుగా ఉండే సేనా దళాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కార్య రూపాన్ని ఇవ్వడం మొదలు పెట్టారు..