– పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి
– ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్ లో చర్చించి, వెంటనే ప్రకటించాలని డిమాండ్
– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3 శాతం కరువు భత్యం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ఆనాటికి పెండింగ్ లో ఉన్న3డీఏలను అధికారంలోకి రాగానే తక్షణమే చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పింఛనర్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి, బకాయిలను నేరుగా ఉద్యోగస్థులకు నేరుగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంసీహెచ్ఆర్డీలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమై మరుసటి రోజే క్యాబినెట్ లో చర్చించి డీఏలు వెనువెంటనే విడుదల చేస్తామని మరోసారి హామి ఇచ్చి మాట తప్పారు.
మీరు అధికారంలోకి వచ్చి 10నెలలు అయింది. ఈ నాటికి 5డీఏలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు ప్రభుత్వం బకాయి పడింది. డీఏలు విడుదల చేయకపోవడం వల్ల ఒక్కో ఉద్యోగి నెలకు సుమారు రూ.5000 నుంచి రూ.20,000 వరకు నష్టపోవాల్సి వస్తుంది.
బకాయి పడ్డ 5డీఏల మొత్తం 17.29 శాతం గురించి ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి, దీపావళి కానుకగా బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు. ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సప్లిమెంటరీ బిల్లులను 15 పనిదినాల్లో చెల్లిస్తామని చెప్పిన మీరు ఇప్పటికీ జీపీఎఫ్, సరెండర్ లీవ్ తదితర సప్లిమెంటరీ బిల్స్ నెలల తరబడి పెండింగ్ లో పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం, వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తెస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దీనిపై కూడా ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.
ఈ ఏడాది మార్చి 31 తర్వాత రిటైర్డ్ అయిన సుమారు 5వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్ మెంట్ బెన్ఫిట్స్ నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. వారికి రావాల్సిన జీపీఎఫ్, ఇల్ ఎన్ క్యాష్మెంట్, గ్రాట్యుయిటీ, ఇన్సురెన్స్, కమ్యూటెడ్ బకాయిల కోసం సచివాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు తిరగలేకపోతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఈహెచ్ఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.