Suryaa.co.in

National

ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించండి

* రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు.. తయారీ రంగంపై తీవ్ర ప్రభావం
* కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన మంత్రి శ్రీధర్ బాబు

ఢిల్లీ: రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు తెలంగాణలోని తయారీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఆ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ తో ప్రత్యేకంగా సమావేశమై వినతి పత్రం సమర్పించారు.

“ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి అవసరమైన రేర్ ఎర్త్ మాగ్నెట్లు, కీలక ముడి పదార్థాలు, రసాయనాలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ తరహా పదార్థాల ఎగుమతులపై ఆ దేశం తాజాగా ఆంక్షలు విధించింది. ఆ ప్రభావం ఎలక్ట్రానిక్స్, ఈవీలు తయారు చేసే పరిశ్రమలపై పడింది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా తెలంగాణలో తయారీ రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది’ అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

ఎలక్ట్రానిక్స్, ఈవీ తయారీ పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా వాస్తవ పరిస్థితిని సమీక్షించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

LEAVE A RESPONSE