– ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి
– అది కాంట్రాక్టర్లు, నేతలకూ కాసులపంట మాత్రమే
– పాత, కొత్త ప్రభుత్వాలను అనుసంధానించే ఏకైక శక్తి మెగా ఇంజనీరింగ్ సంస్థ
– ఏపీకి ఆ ప్రాజెక్టు ఒక గుదిబండ
• కృష్ణా – గోదావరి నదీ జలాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కుల కోసం పోరాటం
• పోలవరం(గోదావరి) – సోమశిల (పెన్నా) అనుసంధానం చేయండి
– రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రజలే రక్షించుకోవాలి
– ఆలోచనాపరుల వేదిక లో గళం విప్పిన ఏ. బి. వెంకటేశ్వరరావు, కంభంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి. లక్ష్మీనారాయణ
విజయవాడ: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ విజయవాడ వేదికగా మేధావులు రంగంలోకి దిగారు. దీనికోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని, దీనిని ప్రజల్లోకి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా మెగా కృష్ణారెడ్డి కంపెనీ ప్రయోజనాల కోసం చేపట్టే ప్రాజెక్టేనని వెల్లడించారు. ఆలోచనాపరుల వేదిక పేరుతో ఏర్పాటయిన ఈ సంస్థ.. బనకచర్ల ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయనాయకుల కడుపునింపేందుకు తప్ప, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని గుదిబండ ప్రాజెక్టుగా కుండబద్దలు కొట్టింది.
ముఖ్యమంత్రుల వద్ద పలుకుబడి ఉండి.. పాత-కొత్త ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా ఉన్న మెగా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి కంపెనీ కోసమే, బనకచర్ల ప్రాజెక్టు అన్న అనుమానం తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టుపై మెగా కృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుకు తాజాగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసిందని వక్తలు వెల్లడించారు.
ప్రధాన ప్రతిపక్షం కాంట్రాక్టు కంపెనీతో కుమ్మక్కయినందున, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలేదనని పిలుపునిచ్చింది. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు,కంభంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి. లక్ష్మీనారాయణ తో కలసి ఏర్పడిన ఈ ఆలోచనాపరుల వేదిక, విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఆ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే.. పోలవరం – బనకచర్ల అనే ప్రాజెక్టు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆలోచనగా (వాస్తవానికి కేసీఆర్ – జగన్ – మెగా కృష్ణారెడ్డి బుర్రల్లో పుట్టినప్పటికీ) ముందుకు వచ్చి, దాన్ని అత్యంత వేగంగా కేంద్ర జల సంఘంతో ఆమోదింపజేసుకోవాలని, కేంద్ర ఆర్ధిక సాయంతో నిర్మించాలని అంటూ పరుగులెత్తుతున్న నేపథ్యంలో, ఇది తెలంగాణాలో రాజకీయ పార్టీల మధ్య ఒక ఫుట్ బాల్ గా మారింది. దీని మీద ఈ మధ్యన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలనూ విన్నాం.
ఈ పరిస్థితుల్లో, అసలీ బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ అవసరాలకు, ప్రయోజనాలకు, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పరిరక్షణకు అనుగుణంగా ఉన్నదా! లేదా! అని ప్రశ్నించుకోవాలి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ది చేకూరుస్తూ, రాష్ట్రానికి ఒక గుదిబండలా మారనున్నది అని మా అభిప్రాయం.
ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్, ఆ తర్వాత వచ్చిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, రెండూ కూడా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 800 టీఎంసి ల (పునరుత్పత్తి జలాలతో కలిపి 811) కృష్ణా నికర జలాలని కేటాయించాయి. రాష్ట్రం విడిపోక ముందు ఇందులో 512 టీఎంసి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు, 299 టీఎంసి తెలంగాణాలో ఉన్న ప్రాజెక్టులకు వినియోగంలో ఉండేవి.
విభజన తర్వాత, ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు ఉన్న ఆ జాబితాను మొదటి అపెక్స్ కౌన్సిల్ (కేంద్ర జలశక్తి మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల) సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. నాటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు మరియు కేసీఆర్ మినిట్స్ పై సంతకాలు చేశారు. కానీ, తర్వాత కాలంలో దాన్ని తాత్కాలిక ఒప్పందమని కేసీఆర్ వక్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
రాజకీయ కారణాలతో, తెలంగాణా ఎన్నికలకు కాస్త ముందు, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ లేవనెత్తిన నీటి వివాదంపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువు పొడిగించి ఆ పని అప్పగించింది. ప్రాజెక్టుల వారిగా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందా, లేదా, తేల్చి, రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి పరిష్కారం చూపెట్టాలని ఆదేశించింది. అది నడుస్తూ ఉంది.
గోదావరి జలాలపై ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి 1480 టీఎంసి వచ్చాయి. వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదు. ఆంధ్ర, తెలంగాణల మధ్య తలెత్తిన ఈ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సి ఉంది.
కృష్ణా నదీ జలాలపై ఆధారపడి ఇప్పటికే నిర్మించిన మరియు నిర్మాణంలో ఉన్నరాయలసీమ ప్రాజెక్టులు శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (19), తెలుగు గంగ (29), గాలేరు – నగరి (38), కె. సి. కెనాల్ (10), త్రాగునీటి (3)కి మరియు చెన్నయ్ నగరం (15) త్రాగునీటికి కలిపి 114 టీఎంసీ నీటిని శ్రీశైలం నుంచి తీసుకెళ్లడానికి పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల వద్ద ఒక క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణమై, వినియోగంలో ఉన్నాయి.
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గుండా బనకచర్ల వరకు గ్రావిటీ ద్వారా, పైసా ఖర్చు లేకుండా నీళ్లు పారుతున్నాయి. వరదలు వచ్చినప్పుడు గరిష్ట స్థాయిలో నీటిని రాయలసీమకు తరలించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. బనకచర్ల నుంచి నీళ్లు వెళ్లే ఎస్సార్బీసీ, తెలుగు గంగ, గాలేరు-నగరి, కె. సి. కెనాల్ పథకాలకు గ్రావిటీ ద్వారానే నీరందుతుంది.
ఒక్క హంద్రీ – నీవాకు మాత్రం శ్రీశైలం జలాశయం నుంచి మల్యాల / ముచ్చుమర్రి వద్ద నిర్మించిన పెద్ద పెద్ద లిఫ్టులతోనే రాయలసీమ ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు నీటిని అందజేయాలి. ఇప్పటికీ, గాలేరు – నగరి ప్రాజెక్టు నిర్మాణం పాక్షికంగానే జరిగింది. తెలుగు గంగ కింద పంట కాలువల వ్యవస్థను నిర్మించలేదు. ఇలా రాయలసీమ ప్రాజెక్టుల కింద నీరు పొలాల దాకా పారించే ప్రాజెక్టుల నిర్మాణ పనులు, బ్రాంచి కాల్వలు, పంట కాల్వలు పూర్తి చేయలేదు. దాంతో వరదల కాలంలో కూడా రాయలసీమ ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నిర్మించిన రిజర్వాయర్లకు నీటిని తరలించినా కానీ పొలాలు తడవడం లేదు.
గోదావరి నుంచి వరద జలాలని రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకు తరలించాలనేది ఎప్పట్నుంచో అందరం కోరుకుంటున్నదే. దానికోసం గోదావరి నీళ్లను కోస్తాలోని మెట్ట ప్రాంతాల గుండా లిఫ్టుల సాయంతో తరలించి చివరికి పెన్నా నదిలో కలపాలన్నది ఆంధ్రుల చిరకాల వాంఛ.
ఆ గోదావరి జలాలని, దారిలో ఉండే పూర్వపు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు (పల్నాడు ప్రాంతాలతో సహా), ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలన్నీ వాడుకోవచ్చు. దీనికోసం గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద ఒక పెద్ద రిజర్వాయరుని ఎఫ్.ఆర్.ఎల్. +226 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. అక్కడి నుంచి పెన్నా నది వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు పారతాయి.
నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద రిజర్వాయరులుగా ఉన్న సోమశిల, కండలేరు నింపడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయర్ నల్లమల సాగర్ ని కూడా నింపొచ్చు. నీళ్లు రాని నాగార్జున సాగర్ కుడి కాలవ రైతులకు కూడా ఏటా సమయానికి నీళ్లివ్వచ్చు. గోదావరి నీటిని కృష్ణా నదిలో పడవేయకుండా కృష్ణా నదిని దాటించి తీసుకెళ్ళాలి. దానివల్ల కృష్ణా జలాల్లో నీటి హక్కు నిలబెట్టుకోవడమే కాక, విజయవాడకు వరద ముప్పు కూడా తప్పుతుంది.
ఇలా చేద్దామని 2014-19 మధ్య ఒక ఆలోచన చేశారు. వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజీకి శంఖుస్థాపన కూడా చేసారు. కానీ అదిప్పుడు అటకెక్కింది. ఇవన్నీ ఇలా ఉండగా, 2019 ఎన్నికల తర్వాత కెసిఆర్ – జగన్ లు భాయి భాయి అనుకుంటూ ఉన్నప్పుడు కెసిఆర్ ఒక ప్రతిపాదన చేశారు.
అదేమంటే ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలని ఎత్తి, తెలంగాణ గుండా పారించి, నాగార్జున సాగర్లో కలపాలని, సాగర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలంలోకి ఎత్తి పోయాలని, అలా పోసి రాయలసీమకు వాడుకోవాలని, ఖర్చు చెరి సగం భరించాలని, అప్పుడు కృష్ణ నీళ్లు తెలంగాణకు ఇచ్చేయాలనేది ఆ ప్రతిపాదన. దాన్ని ఆనాడే వ్యతిరేకించాం. అది అమల్లోకి రాలేదు. కానీ అటువంటి ప్రమాదం ఇంకో రూపంలో ముంచుకొచ్చింది.
2022-23 ప్రాంతంలో మెగా కృష్ణా రెడ్డి సలహాతో పోలవరం నీటిని బనకచర్లకు తరలించడానికి వెంటనే ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఆదేశించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తమ వల్ల కాక, హైద్రాబాదులో ఉన్న WAPCOS కి అప్పజెప్పారు.
WAPCOS తన దగ్గరున్న విస్తృతమైన డేటాతో మూడు నెలల్లో ఒక చిత్తు (draft) రిపోర్ట్ ఇచ్చింది. అదే ఇప్పుడు మనం చూస్తున్నది.
ఎన్నికల హడావుడిలో ఆ పథకాన్ని జగన్ మోహన్ రెడ్డిగారు తలకెత్తుకోలేదు. తిరిగి గెలిస్తే చూద్దామనుకుని ఉంటారు. కూటమి ప్రభుత్వం గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5-6 నెలలకి, మెగా కృష్ణా రెడ్డి బృందం మళ్ళీ ఒకసారి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఇంకో సుదీర్ఘమైన ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు వినికిడి.
వారి ప్రతిపాదన ప్రకారం, తమ కంపెనీ 10-15 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని, కేంద్రం నుంచి లోన్ ఇప్పించడానికి, అనుమతులు ఇప్పించేందుకు తాము సహాయం చేస్తామని, కాబట్టి ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చెయ్యమన్నారట. ముఖ్యమంత్రి అనౌన్స్ చేసేసారని ప్రచారం జరుగుతున్నది.
జగన్ మోహన్ రెడ్డి కేవలం 1350 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో చేసిన యాగీ అంతా ఇంతా కాదు. కానీ 82,000 కోట్ల పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు విషయంలో నోరు విప్పకపోవడం, ఈ ప్రాజెక్టు ఆయన మానస పుత్రికేనని చెప్పకనే చెపుతున్నది. పాత, కొత్త ప్రభుత్వాలను అనుసంధానించే ఏకైక శక్తి మెగా ఇంజనీరింగ్ సంస్థకే ఉన్నదని బోధపడుతున్నది. ఇంతకూ వరుస ముఖ్యమంత్రులు, కాంట్రాక్టర్లు అంతగా ఇష్టపడుతున్న పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ కు అవసరమా, లాభదాయకమా, నష్ట దాయకమా అనే విషయానికొద్దాం.
1. ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నది నుంచి 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోతుంది.
2. రాయలసీమ ప్రాజెక్టులకు ఇప్పుడు కృష్ణా జలాల్లో ఉన్న హక్కులు కోల్పోతాము.
3. ఇప్పుడున్న పట్టిసీమ కాల్వను పెద్దది చేసి అందులో 38,000 క్యూసెక్కుల నీరు పంపినా, లేక ఇంకో సమాంతర కాల్వను నిర్మించి 23,000 క్యూసెక్కులు పంపినా, కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ దగ్గరి నిండుగా ప్రవహించినప్పుడల్లా, విజయవాడకు ప్రమాదాపు గంటలు మోగుతాయి.
4. పోలవరం-బనకచర్ల పథకం వల్ల రాయలసీమలో కొత్తగా సాగయ్యే ఆయకట్టు ఏదీ లేదు.
5. ఇప్పుడు చెప్పే చిత్తు లెక్కల ప్రకారమే, నిర్వహణ వ్యయమే సంవత్సరానికి ఎకరాకు 50,000 రూపాయలు. దీనికి ప్రాజెక్టు కట్టే వ్యయం, దానిమీద వడ్డీలు కలిపితే లక్ష దాటిపోతుంది.
6. ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలు ఎప్పట్లాగే కరువులోనే ఉండిపోతాయి.
7. 18.5 కిమీ వెలిగొండ సొరంగం ముఫై ఏళ్ళ నుంచి సాగుతూ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పుడు నల్లమల కొండల్లోంచి 26 కిమీ సొరంగం తవ్వి మూడేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తారట.
8. ప్రభుత్వం ఇచ్చిన పటాల ప్రకారం 371 మీటర్లు అంటే సుమారు 1225 అడుగుల ఎత్తుకు 23,000 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోయాలి.
9. పోలవరం-పెన్నా అనుసంధానానికి పరిమితమైతే, బొల్లాపల్లి నుంచి సోమశిలకు (పెన్నాకు) నీరు గ్రావిటీ ద్వారా పారుతుంది. దారిలో సాగర్ కుడి కాల్వ ఆయకట్టుని తడపడమే కాక, ఎప్పట్నుంచో అనుకుంటున్న మరో 5 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తరణ కూడా సాధ్యం చేస్తుంది.
10. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి, తిరిగి దాన్ని వాగులు, పెన్నా ద్వారా సోమశిలకు వదిలెయ్యడం కరంటు దండగ, ఖర్చు దండగ.
కాబట్టి ఈ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ కు అవసరం లేనిది, అంతే కాక నష్టదాయకమైనది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతున్నాము.
తెలంగాణా రాజకీయ పార్టీలు, ప్రభుత్వము, విశ్రాంత ఇంజినీర్ల సంఘమూ చేస్తున్న హడావుడి అంతా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, దీన్ని బూచిగా చూపించి కృష్ణ జలాల్లో ఆంధ్ర ప్రదేశ్ వాటా తగ్గించి తెలంగాణాకు మళ్ళించుకోవాలనే దురాశ తప్ప మరేమీ కాదు.
తెలంగాణలో అనుమతులు లేకుండా ఉమ్మడి జలాలపై కడుతున్న ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డుకోవాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, ఏ పార్టీల ప్రయోజనాలకూ ప్రజలు బాధ్యులు కారని గుర్తించాలి. ట్రిబునళ్ల అవార్డులు, విభజన చట్టాన్ని పట్టించుకోకుండా కృష్ణ గోదావరి నదులలో తెలంగాణ నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులను మనం తప్పకుండా ఆపించి మన రాష్ట్ర హక్కులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తక్షణమే గుర్తించాలి. ఆ ప్రాజెక్టులను నివారించే చర్యలను వెంటనే చేపట్టాలి.
పోలవరం దగ్గర నదీగర్భం నుంచి దాదాపు 1000 కోట్లతో ఇదే మెగా సంస్థ జగన్ మోహన్ రెడ్డి జమానాలో చేపట్టిన లిఫ్ట్ పూర్తిగా నిరుపయోగమైనది. దాన్ని పునరుద్దరించే ప్రయత్నాలను విరమించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాన్ని గురించి, ఉత్తరాంధ్ర ప్రోజెక్టుల జాప్యం, సమస్యల గురించి మరోసారి వివరిస్తాము.
ప్రజలపై తరాల తరబడి పెను భారాలు కాబోతున్న ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయాలలో అధికార పక్షం, ప్రతిపక్షం ఒకటిగా నడుస్తున్నాయన్న భావన ప్రజల్లో బలపడుతున్నది. ప్రజలు అధికారం ఇచ్చిన సమయాన్ని దాటి ఎన్నో దశాబ్దాల పాటు ప్రభావం చూపే, ప్రజలపై, భవిష్యత్ తరాలపై భారం మోపే నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారు. వాటి గురించిన వివరాలు బహు గోప్యంగా ఉంచుతున్నారు.
ప్రధాన ప్రతిపక్షం వహిస్తున్న మౌనం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కును సూచిస్తోంది. అటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు, ప్రజా సంఘాలే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. ఆ చొరవలో భాగమే ప్రజలకు, మేధావులకు ఈ వివరాల వెల్లడి. దీనిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలని ఆశిస్తున్నాము. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రజలే రక్షించుకోవాలి.