Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి చంద్రబాబుతో నాస్కామ్ ప్రతినిధుల భేటీ

ఐటీ, సేవల రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి

అమరావతి : ఐటీ, సేవల రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకునేలా… పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాస్కామ్ (National Association of Software and Service Companies) ప్రతినిధులను ఆహ్వానించారు.

ఐటీ, సేవల రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన నాస్కామ్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్) రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, నూతన సాంకేతికతను అందించేందుకు నాస్కామ్ ప్రతినిధులు ఆసక్తి చూపించారు.

రాష్ట్రంలో ప్రజలకు సాంకేతిక ఆధారిత సేవలు అందించేలా కృషి చేస్తున్నామని… ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా డేటా లేక్ రూపొందించామని, దీని ఆధారంగా సేవలు విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు నాస్కామ్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. గత తన పాలనలో ఐటీని ప్రమోట్ చేసినట్టే ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సంకల్పించామని… అందరి స్కిల్ అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పెట్టుబడిదారులకు కావాల్సిన మానవ వనరులు రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు, చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పురోగమిస్తోందని నాస్కామ్ ప్రతినిధులు ఈ సందర్భంగా కొనియాడారు.

LEAVE A RESPONSE