-ఎపి వైద్య ఆరోగ్య శాఖ
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్ ) సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగంలో భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ యాక్షన్ ప్లాన్ ఫర్ కంటైన్ మెంట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (APAPCAR) పై మంగళగిరి ఎపిఐఐసి బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. “సరైన లేబరేటరీలు, అవసరమైన పరికరాలు, ఇన్ఫెక్షన్ల నియంత్రణా చర్యలు తీసుకోవటం వంటి చర్యలు చేపడుతున్నాం. ఇందుకు సుశిక్షితులైన సిబ్బందిని నియమిస్తున్నాం. అనుభవం గల వ్యక్తుల బృందాలు వివిధ సంస్థలను సందర్శించి ఆస్పత్రులు, లేబరేటరీలకు సలహా సూచనలిస్తారు. ఈరకమైన బాధ్యతలను స్వీకరించేందుకు ముందుకొచ్చేవారికి అవసరమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుంది.
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్ ) పై అవగాహన పెంచే కార్యక్రమాల అమలు కీలకమని చాలా మంది ఈ సందర్భంగా వివరించారు. ఇందుకోసం సమర్ధవంతంగా పనిచేసే వ్యవస్థ ఒకటి వుండాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిని ప్రాధాన్యతాంశంగా తీసుకుని కార్యకలాపాలను సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించాలి. ఇందుకు అంగీకరించే భాగస్వామ్య సంస్థలు వాస్తవిక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం కావాలి. ఈ సమస్యపై ప్రస్తుతం క్రిష్ణా జిల్లాలో ఇప్పటికే ఇండో డచ్ పైలట్ ప్రాజెక్టు కింద అధ్యయనం పూర్తయింది. సామాజిక సమస్యల పరిష్కారానికి కొన్ని సూచనలతో మార్గనిర్దేశనం చేసింది.
ముఖ్యంగా ఎఎంఆర్ కు సంబంధించి విషయ పరిజ్ఞానం కోసం పాఠ్యాంశాలలో పొందుపర్చాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా సూచించడం ఆహ్వానించదగ్గ విషయం. తద్వారా దీనిపై అందరినీ చైతన్యవంతం చేయవచ్చు. ఈ సమస్య అందరిపైనా సమాన ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో యాంటీ బయొటిక్స్ రాసేవారు, వాటిని తీసుకునే వారు కూడా సమానంగా ప్రభావితమవుతున్నారు. శరీరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగితే వ్యాధినిరోధకత తగ్గిపోయి వ్యాధులను అదుపు చేయటం సాధ్యం కాదు. ఈ అంశం మన అందరిపైనా ప్రభావం చూపుతోంది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. దీనిని ఎదుర్కొనేందుకు సమగ్రమైన శిక్షణ అవసరం. ఇందుకు కొన్ని సంస్థలు ముందుకు రావడం ముదావహం. ఇందులో నియంత్రణా విభాగాల పాత్ర కీలకమని చాలా మంది ఈ సందర్భంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో దీనిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పిస్తున్నప్పటికీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, తదితర భాగస్వామ్య విభాగాలన్నీ ఈ బాధ్యతలను సీరియస్ గా నిర్వహించాల్సిన అవసరం వుంది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ భవిష్యత్ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల రైతులు, ఈ రంగాలపై ఆధారపడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
యాంటిబయొటిక్ మందుల ఉత్పాదన, పంపిణీ, రిటైల్ అమ్మకాల వంటి వాటిని పర్యవేక్షించేందుకు ఐటి ఉత్పత్తులను ఆయా సంస్థలు ఉపయోగిస్తున్నప్పటికీ, వారు పర్యవేక్షిస్తున్న అంశాలపై హమీక్షించాల్సి వుంది. నేను వైజాగ్ పోర్టట్రస్ట్ ఛైర్మన్ గా పనిచేసిన రోజుల్లో ఐరోపా కూటమికి చెందిన ఒక బృందం మన దేశంలో కొన్ని సంస్థలను సందర్శించినపుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీ బయొటిక్స్ విక్రయిస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసింది.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మానవ వినియోగానికి యాంటీ బయొటిక్స్ విచ్చల విడిగా విక్రయిస్తుంటే ఆక్వా, వ్యవసాయం వంటి రంగాలపై ఈ ప్రభావం ఎలా వుంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. యాంటీ బయొటిక్స్ విచ్చలవిడి వినియోగం ద్వారా కలుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిపై అనుభవం గల నిపుణులు తరచూ పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాల్సి వుంది. సంబంధిత శాఖల సమన్వయం తో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. దేశంలో ఎఎంఆర్ ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో మనది నాలుగోది” అని కృష్ణ బాబు అన్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ మరియు ఎపిశాక్స్ పీడీ జిఎస్. నవీన్ కుమార్ , డ్రగ్స్ డీజీ రవిశంకర్ నారాయణ్ , ఐఎంఎ ఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాసరాజు , ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన శర్మ, వెటర్నరీ మైక్రోబయాలజీ శాఖ హెడ్ ప్రొఫెసర్ పి. ఆనందకుమార్ , ఐఎస్ డిపి జెడి డాక్టర్ డి.మోహన క్రిష్ణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ సైంటిస్ట్ కె.శ్రీనివాస్ , యానిమల్ హస్బెండరీ డీడీ (ఎపిడమాలజీ) డాక్టర్ వై.క్రిష్ణ జ్యోతి , ఆయా రంగాలకు చెందిన నిపుణులు వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు