• ఇదేనా జగన్ రెడ్డి పదేపదే చెప్పే రైతు పక్షపాతం?
• కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 2018-19లో కట్టిన ప్రీమియం కంటే అధికంగా 172.8 శాతం బీమాసొమ్ము రైతులకు నష్టపరిహారంగా చెల్లించి, దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్
• నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి తాను రైతులకు చెల్లించిన పంటలబీమా నష్టపరిహారం సొమ్ము ఎంతో తక్షణమే బయటపెట్టాలి
• జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల వల్ల సుమారు 60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని.. రైతులు రూ.30వేల కోట్లు నష్టపోయారు
• 2019 నుంచి 2023 వరకు ఎంతమంది రైతులకు ఎంత బీమా ప్రీమియం చెల్లించాడో.. పంటలు నష్టపోయిన రైతులకు ఎంత సొమ్ము చెల్లించాడో పూర్తి వాస్తవాలతో జగన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి
• రైతులపై తనకున్న చిత్తశుద్ధి ఏమిటో జగన్ రెడ్డి అన్నదాతల సాక్షిగా నిరూపించుకోవాలి
• రైతుల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకున్న జగన్ రెడ్డి సిగ్గులేకుండా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటున్నాడు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎప్పటిలానే మొద్దు నిద్ర పోయిన జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రజల్ని అప్రమత్తం చేయనందున.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోనందునే రాష్ట్రవ్యాప్తంగా భారీనష్టం జరిగిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ తుఫాన్లు.. ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల్ని కాపాడటంలో చంద్రబాబునాయుడిని మించిన నాయకుడు మరొకరు లేరనిచెప్పక తప్పదు. తుఫాన్ల రాకను ముందే పసిగట్టి… రైతుల్ని కాపాడేందుకు సరైన చర్యలు తీసుకోవడం… పంటనష్టం జరక్కుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం… ప్రజల్ని రక్షించడం.. ఆస్తి-ప్రాణ నష్టాన్ని నివారించడం వంటి చర్యల్లో ఎంతో ముందుచూపుతో వ్యవహరించేవారు. గతంలో ఆయన పనితీరు ఎలా ఉంటుందో హుద్ హుద్ .. తిత్లీ తుఫాన్ల సమయంలోకళ్లారా చూశాం. అటువంటి ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా జగన్ రెడ్డి అతని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నేడు రాష్ట్రం మొత్తం తుఫాన్ దెబ్బకు నామరూపా ల్లేకుండా పోయింది. ఈ ముఖ్యమంత్రికి ఎంతసేపూ ఎంత మింగుదాం.. ఏ మార్గంలో తనకు ఎంతొస్తుంది అనే ఆలోచనలు తప్ప, ప్రజల యోగక్షేమాలు ఆయనకు పట్టవు.
మిగ్ జాం తుఫాన్ గురించి కేంద్ర వాతావరణ సంస్థ (ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్) ఏపీ ప్రభుత్వాన్ని ఎన్నిరోజులు ముందు హెచ్చరించింది? తీరం వెంబడి ఉన్న ఫలానా జిల్లాలు మిడ్ జాం ప్రభావంతో తీవ్రంగా నష్టపోనున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం.. యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఏపీప్రభుత్వానికి కేంద్ర వాతావరణ సంస్థ నుంచి ముందే రెడ్ నోటీసులు వచ్చింది నిజం కాదా? నోటీసులు వచ్చినా జరగబోయే నష్టాన్ని నివారించడంలో జగన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీళ్లపాలై ఎందుకు పనికిరాకుండా పోతే రైతుపడే బాధ, వేదన ఎలా ఉంటాయో జగన్ రెడ్డికి తెలుసా? రైతు పక్షపాతిని అని చెప్పుకోవడం తప్ప ఈ ముఖ్య మంత్రికి రైతుల కష్టం ఏం తెలుసు? తుఫాన్లు.. ప్రకృతి విపత్తుల సమయంలో రైతుల్ని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోగా పంటల బీమా సాయం చెల్లింపులో కూడా జగన్ రెడ్డి అతని చేతగాని ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం చేస్తున్న రైతులు కేవలం 16 మందేనా జగన్ రెడ్డి?
రైతులు పంటను నష్టపోయినప్పుడు వారిని ఆదుకోవడం కోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద చెల్లించే ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం సొమ్ముకడితే… కేంద్రప్రభుత్వం 50శాతం సొమ్ము చెల్లిస్తుంది. రైతుల పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన విధివిధానాలఅమల్లో రాష్ట్రం పరిస్థితి చూస్తే రైతులతో పాటు ప్రజలంతా నివ్వెరపోవాల్సిందే.
2023 ఖరీఫ్ సీజన్ కి ఏపీ ప్రభుత్వం కేవలం 16 మంది రైతులకే, రూ.1.42లక్షల ప్రీమియం సొమ్ము కట్టి.. మొత్తం పంటలకు 19.50లక్షలకు ఇన్సూరెన్స్ చేసింది. అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 16 మంది రైతులే ఉన్నారా జగన్ రెడ్డి? నిజంగా రైతులకు ఇన్సూరెన్స్ చేశావా..లేక ఇడుపులపాయలో నీ కింద పనిచేసే వారికి ఇన్సూరెన్స్ చేశావా? దీనికేం సమాధానం చెబుతావు జగన్ రెడ్డి?
జగన్ రెడ్డి 2023 ఖరీఫ్ సీజన్లో కేవలం 16 మంది రైతులకే పంటలబీమా సొమ్ము ప్రీమియం కట్టే దుస్థితికి దిగజారాడు
గతంలో చంద్రబాబునాయుడి హాయాంలో రాష్ట్రంలో అమలైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఎంతగా రైతుల్ని ఆదుకోవడానికి కృషిచేసిందో చూద్దాం. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇచ్చిన సమాచారంలోని వివరాలు పరిశీలిద్దాం.
2016-17లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రూ.943.08 కోట్ల బీమాసొమ్ముని ప్రకృతి విపత్తుల వల్ల పంటనష్టపోయిన దాదా పు 9 లక్షల మంది రైతులకు చెల్లించడం జరిగింది. నాడు చంద్రబాబు ప్రభుత్వం కట్టిన ప్రీమియం సొమ్ముతో పోలిస్తే.. రైతులకు చెల్లించిన బీమా సొమ్ము 100 శాతం కంటే ఎక్కువగా 117.05 శాతం సొమ్ము చెల్లించడం జరిగింది.
2017-18 లో మరో రూ.740.02కోట్లను 7.1లక్షల మంది రైతులకు చెల్లించడం జరిగింది. 2018-19 లో అత్యధికంగా రూ.1885.01కోట్లను 16.02 లక్షలమంది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. 2018-19లో చెల్లించిన ప్రీమియం కంటే ఎక్కువగా దేశంలోనే అత్యధికంగా 172.8శాతం ఇన్సూరెన్స్ సొమ్ముని రైతులకు నష్టపరిహారంగా చెల్లించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. ఈ వివరాలు అన్నీ కేంద్ర వ్యవసాయ శాఖ వార్షిక నివేదిక (2022-23) లోనే ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చెల్లించిన ప్రీమియం కంటే అదనంగా 172..8 శాతం సొమ్ము 16లక్షల మంది ఏపీ రైతాంగం పొందిందని కేంద్రప్రభుత్వ నివేదికలో ఉంది.
2016 లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభమైనప్పటినుంచీ 2019 వరకు చంద్రబాబునాయుడు రైతులకు రూ.3569 కోట్ల బీమాసొమ్ము చెల్లించారు. చంద్రబాబు హయాంలో చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే, దేశంలోనే అత్యధికశాతం క్లెయిమ్ సొమ్ము పొందిన రాష్ట్రం.. నేడు జగన్ రెడ్డి జమానాలో 2023 ఖరీఫ్ సీజన్లో కేవలం 16 మంది రైతులకే ప్రీమియం కట్టే దుస్థితికి దిగజారింది. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి. నిజంగా రైతులపక్షాన నిలిచి.. వారికి అన్ని విధాలా అండగా నిలిచింది చంద్రబాబేనని కేంద్రప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.
నాలుగున్నరేళ్లలో 60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతులు రూ.30వేల కోట్లు నష్టపోతే, జగన్ రెడ్డి వారికి చెల్లించిన పంటలబీమా సాయం సున్నా
జగన్ రెడ్డి పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో పదిసార్లు వివిధ రకాల ప్రకృతి విపత్తులు (తుఫాన్లు.. వరదలు. భారీ వర్షాలు) రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఈ పది సార్లలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతింటే.. దాదాపుగా రూ.30 వేల కోట్ల పంటనష్టం వాటిల్లింది. 2020లో వచ్చిన నివర్ తుఫాన్ వల్ల 17.3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 2020 ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో వచ్చిన వరదలవల్ల 19.8లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 2020లో రాష్ట్రంలో దాదాపుగా రూ.15వేలకోట్ల పంటనష్టం జరిగింది. 2021లో గులాబ్ తుఫాన్ వల్ల, ఇతర వర్షాలతో 3లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే రైతులకు దాదాపు రూ.2వేలకోట్ల నష్టం వాటిల్లింది.
2021 నవంబర్లో కురిసిన భారీ వర్షాలతో దాదాపు 13.2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు రూ.3,300కోట్ల వరకు నష్టపోయారు. మిగ్ జాం తుఫాన్ వల్ల రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. సుమారు రూ.7వేలకోట్ల నష్టం జరిగింది. ఈ విధంగా జగన్ రెడ్డి పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో 60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, రైతులు రూ.30వేలకోట్లు నష్టపోయారు. అంత మొత్తం నష్టపోయి న రైతులకు జగన్ రెడ్డి చెల్లించింది ఎంతయ్యా అంటే కేవలం సున్నా.
చంద్రబాబు హయాంలో 2018-19లో దేశంలోనే అత్యధికంగా 16లక్షల మంది రైతులు కట్టిన ప్రీమియం కంటే అత్యధికంగా 172.8 శాతం, రూ.1885కోట్ల నష్టపరిహారం సొమ్ము పొందితే .. నేడు జగన్ రెడ్డి జమానాలో 2023 ఖరీఫ్ సీజన్లో కేవలం 16 మంది రైతులకే ప్రీమియం కట్టే దుస్థితి ఏర్పడింది. ఇదేనా జగన్ రెడ్డి పదేపదే చెప్పే రైతు పక్షపాతం. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి తాను రైతులకు చెల్లించిన పంటలబీమా సొమ్ము ఎంతో తక్షణమే బయటపెట్టాలి. 2019 నుంచి 2023 వరకు ఎంతమంది రైతులకు ఎంత బీమా ప్రీమియం చెల్లించాడో.. పంటలు నష్టపోయిన రైతులకు ఎంత సొమ్ము చెల్లించాడో పూర్తి వాస్తవాలతో జగన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి. రైతులపై తనకున్న చిత్తశుద్ధి ఏమిటో జగన్ రెడ్డి అన్నదాతల సాక్షిగా నిరూపించుకోవాలి.
రైతులకు పంటలబీమా సొమ్ముకోసం నువ్వు ఏర్పాటు చేస్తానన్న ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏమైంది జగన్ రెడ్డి?
2016లో మొదలైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని … 2019 వరకు చంద్రబాబునాయుడి హయాంలో ఏపీలో అద్భుతంగా అమలైంది. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన పథకం తమకు వద్దని, దానినుంచి బయటకు వచ్చి తానే స్వయంగా రైతుల్ని ఆదుకుంటానం టూ.. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరుతో ఒక కంపెనీ పెడతా నని ప్రగల్భాలు పలికాడు. కానీ ఐ.ఆర్.డీ.ఏ.ఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) వెబ్ సైట్లో చూస్తే.. వారి తాజా రిపోర్ట్ లో మన దేశంలో పబ్లిక్.. ప్రైవేట్ సెక్టార్లలో లైసెన్స్ పొందిన ఇన్సూరెన్స్ కంపెనీలు మొత్తం 34 ఉన్నట్టుగా పేర్కొన్నారు.
ఆ 34 కంపెనీల జాబితాలో జగన్ రెడ్డి చెప్పిన ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ ఎక్కడా లేదు. ఇదేనా ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టడం.. రైతుల్ని ఆదుకోవడం జగన్ రెడ్డి? అటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి.. ఇటు తాను పెడతానన్న ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో గానీ నమోదుకాకుండా ఏపీ రైతాంగం రెండువిధాలా జగన్ రెడ్డిని నమ్మి దారుణంగా మోసపోయింది. జగన్ రెడ్డి ప్రజల్ని నిత్యం ఎలా మోసగిస్తాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
రైతుల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకున్న జగన్ రెడ్డి.. సిగ్గులేకుండా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటున్నాడు
జగన్ రెడ్డి మోసాలు.. అబద్ధాల వల్లే రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలో ముందుంది. రైతుల్ని ఆదుకోలేని చేతగాని ముఖ్యమంత్రి.. తాను మరలా రైతుల పక్షమని.. రైతుల ఉద్ధారకుడిని అని కల్లబొల్లి మాటలతో రైతుల్ని మోసగిస్తు న్నాడు. తొలుత ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వద్దని.. తానే సొంతంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పెట్టి రైతుల్ని ఆదుకుంటానన్న జగన్ రెడ్డి మరలా కేంద్రప్రభుత్వ పథకంలోకి ఎందుకు చేరాడు. తాను ఎలాంటి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని రైతులకు తెలిస్తే…తనను ఛీ కొడతారన్న భయంతోనే జగన్ రెడ్డి మరలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరాడు. దానిలో చేరి చివరకు సాధించిన ఘనకార్యం ఏమిటయ్యా అంటే కేవలం 16 మంది రైతులకు ప్రీమియం కట్టడమా?
రాష్ట్రంలో వ్యవసాయం చేస్తోంది కేవలం 16 మందేనా జగన్ రెడ్డి. రైతుల జీవితాలతో ఆడుకుంటూ సిగ్గులేకుండా ఇంకా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటున్నావా జగన్ రెడ్డి? ఇప్పటికే ప్రజల జీవితాలతో.. మరీ ముఖ్యంగా రైతుల జీవితాలతో జగన్ రెడ్డి ఫుట్ బాల్ ఆడుకున్నాడు.” అని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.