బాపట్ల జిల్లాలో.. మానవత్వపు విలువలకు అద్దం పట్టే సంఘటన ఇది. తుఫానులో కేవలం మనుషులనే కాదు, మూగజీవాల ప్రాణాలను సైతం కాపాడిన ఘటన.
కొల్లూరు మండలం, చింతలంక గ్రామానికి చెందిన పౌల్ అనే నిరుపేద గొర్రెల కాపరి, ఎప్పటిలాగే తన 90 గొర్రెల మందతో మేత కోసం కృష్ణానది తీరం వెంబడి వెళ్తున్నాడు. ఆ గొర్రెలే తన బతుకు, తన సంపాదన, తన సర్వస్వం.
కానీ… విధి వక్రీకరించింది. అకస్మాత్తుగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది! నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి, పౌల్ను, అతని ప్రాణం కంటే ఎక్కువైన 90 గొర్రెలను చుట్టుముట్టింది. ఆ భయంకరమైన క్షణంలో, ఆ నిస్సహాయుడైన కాపరి ప్రాణభయంతో, తన గొర్రెలను కాపాడుకోవాలన్న తపనతో గుండె పగిలేలా కేకలు వేశాడు.
ఆ కేకలు గ్రామంలోని మనుషుల చెవిన పడటమే ఆలస్యం… కదిలారు! మానవత్వం నిండిన ఆ గ్రామస్తులు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, వెంటనే మండలంలో ఏర్పాటు చేసిన తుఫాను సహాయ బృందానికి సమాచారం అందించారు.
ఆ బృందం ఎంత చురుకుగా స్పందించిందో! ప్రత్యేక అధికారి నాగిరెడ్డి, ఎస్.ఐ. అమరవర్ధన్, ఎస్.డీ.ఆర్.ఎఫ్. సత్యనారాయణ, తహశీల్దార్ కె. వెంకటేశ్వర్లు గారితో సహా వారి బృందం మొత్తం… గంటలోపే నదీ తీరానికి చేరుకున్నారు.
నిస్సహాయతకు, నిర్భయతకు మధ్య జరిగిన పోరాటమది! ఆ వీరులు ఆలస్యం చేయకుండా, కృష్ణమ్మ ఉద్ధృతిని లెక్కచేయకుండా… ఆ గొర్రెల కాపరి పౌల్ను, అతని బతుకుదెరువు అయిన 90 గొర్రెలను సురక్షితంగా రక్షించారు!
తన గొర్రెలు ప్రాణాలతో బయటపడగానే, ఆ కాపరి పౌల్ కళ్లల్లో ఆనంద భాష్పాలు… రక్షించిన అధికారులకు కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కిన తీరు… నిజంగా హృదయాన్ని కదిలిస్తుంది!
పౌల్ ప్రాణం నిలబడింది. అతని కుటుంబం నిలబడింది. గొర్రెల కాపరి పౌల్ క్షేమం వెనుక, అధికారుల మానవత్వం, సకాలంలో స్పందించిన గ్రామస్తుల దయ దాగి ఉన్నాయి. ఆపదలో తోడుగా నిలిచిన టీమ్ ఆంధ్రా బృందానికి, ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మంచి మనసుకు హ్యాట్సాఫ్!
“నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.” (యోహాను 10:11)
అంకితభావం గల పేద కాపరిని మతాలకతీతంగా.. మానవత్వం గెలిపించి కాపాడుకున్న కథ ఇది. ఈ ఘటనను మన సమాజం ఎప్పటికీ మరిచిపోకూడదు.