జమిలి ఎన్నికలు. దేశవ్యాప్తం గా ఇప్పుడు మారుమోగి పోతున్న ఓ రాజకీయ చిట్కా ఇది. ఇది కొత్తదీ కాదు, ప్రపంచం లో ఎక్కడా లేనిదీ కాదు.
కాకపోతే, దీనిని ప్రచారం లోకి తీసుకు రావడానికి నరేంద్ర మోడీ ఎంచుకున్న విధానం, టైమింగ్, హడావుడి తో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఏమైనా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనే సందేహాలు, అనుమానాలు దేశావ్యాప్తం గా వ్యక్తమవుతున్నాయి.
2014, 2019 లో నరేంద్ర మోడీ సునాయసం గా కేంద్ర ప్రభుత్వ సారధ్యం సాధించ గలిగారు. దేశం లో ఉన్న యాభై కి పైగా రాజకీయ పక్షాలు ఉమ్మడిగా బీజేపీ ని సవాలు చేసే పరిస్థితి లేక పోవడం తో, నరేంద్ర మోడీ పని….’ మూడు డ్రెస్సులు – ఆరు రోడ్ షోలు ‘ గా సాగిపోయింది.
భీకరమైన రెండు ఎదురు దెబ్బలు తిన్న తరువాత, ప్రతిపక్షాలకు ఇప్పుడు ఎంతో కొంత జ్ఞానోదయం అయినట్టు కనబడుతున్నది. మోడీ అనే ఓ చిత్ర విచిత్ర టక్కు, టమారా రాజకీయ వేష దారిని ఎదుర్కోవడం విడి విడి గా ఎన్నికల్లో ఎదుర్కోవడం తమకు సాధ్యం కాదనే విషయం దేశంలోని ప్రతిపక్షాలకు అనుభవ పూర్వకం గా తెలిసి వచ్చింది.
ప్రతిపక్ష పార్టీలలో పెద్ద… చిన్న, చిల్లర పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చే ప్రయత్నం – కొంత సీరియస్ గా చేయడం మొదలుపెట్టారు.
బీజేపీ పెద్దలు ఇది ఊహించలేదు . కొంచెం అప్రమత్తమయ్యారు.
గత నాలుగేళ్ళల్లో పొరపాటున కూడా ప్రస్తావించని ఎన్. డి. ఏ. అనే అక్షరాలను వెదికి పట్టుకుని, వాటికి పట్టిన దుమ్ము, బూజు దులిపి…. వారు ఎక్కడెక్కడ ఉన్నారో భూతద్దం వేసి వెదికి పట్టుకుని, ఢిల్లీ పట్టుకొచ్చారు. బెంగళూరు లో 26 ప్రతిపక్షాలు కలుస్తుంటే, ‘ మా ఎన్ డీ ఏ 28 పార్టీలహో….’ అంటూ టముకు వేశారు. అందులో సగం పార్టీలకు ఒక్క ఎం. పీ సీటు కూడా లేదని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. సీట్లతో పనేముంది, భావ సారూప్యత ముఖ్యం గానీ అంటూ నరేంద్ర మోడీ వాక్రుచ్చారు. మాకు గర్వం లేదు…. అహంభావం లేదు…. పెద్ద, చిన్న అనే భేదం కూడా లేదు పొమ్మన్నారు.
ముంబై లో ఈ ప్రతిపక్ష పార్టీలు సమావేశమవుతున్న రోజే…. వంట గ్యాస్ ఖరీదు పై ఓ రెండొందలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ కంగారు అంతా ఎందుకు అంటే…. ‘మోడీజాలం ‘ ప్రతి పక్షాలకు అర్ధమై పోయిందనే విషయం బీజేపీ కి కూడా అర్ధమై పోయింది.
పినరయి విజయన్ (కేరళ ), స్టాలిన్ (తమిళనాడు ), మమతా బెనర్జీ (బెంగాల్ ), లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్ ), అఖిలేష్ యాదవ్ ( యూ పీ ), ఫరూక్ అబ్దుల్లా (కశ్మీర్), సోనియా గాంధీ (కాంగ్రెస్ ), ఉద్ధవ్ థాక్రే ( ముంబై /మహారాష్ట్ర ), శరద్ పవార్ వంటి రాజకీయ మల్లయోధులు చేతులు కలపడం అనేది… గతం లో అయితే ఊహకు అందని విషయం. దీనికి తోడు గోడ మీద గండు పిల్లులు ఓ మూడు, నాలుగు ఉన్నాయి…. ఎటు బలం కనపడితే, అటు దూకడానికి.
‘మోడీ రాజకీయం ‘ ప్రతిపక్షాలను దగ్గరకు తీసుకొచ్చింది.
రాజకీయం గా బతికుంటే… తరువాత తీరిగ్గా పోట్లాడుకోవచ్చు, ముందు ఈ మోడీ సంగతి చూద్దాం అంటూ ఈ ప్రతిపక్షాలు ఒక చోటికి రావడం తో, బీజేపీ కలవరానికి గురైందనడం లో సందేహం లేదు. ముచ్చటగా మూడో సారి కూడా ప్రధాని పదవిని అధిష్టించాలనే మోడీ అభిలాషకు ఈ ఇం.డి.య కూటమి అడ్డు తగులుతుందా అనే ఆలోచన బీజేపీ కి మొదటి సారిగా వచ్చింది.
దాని పర్యవసానమే – జమిలి ఎన్నికల హడావుడి.
ఈ’ జమిలి ఎన్నికలు ‘ అనే ఆలోచన కొత్తదేమీ కాదు. బీజేపీ పుట్టకముందే – దేశం లో 1952 నుంచి మూడు నాలుగు సార్లు… రాష్ట్రాల శాసన సభలకు, పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఒక్కటే దేశం లో ప్రధాన రాజకీయ పార్టీ.
తరువాత్తరువాత…. రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడం, రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు రద్దు చేయడం వగైరా కారణాలతో…. ఈ రెండు ఎన్నికలు విడి పోయాయి. ఏ రాష్ట్ర రాజకీయ అవసరాలను బట్టి ఆ రాష్ట్ర అసెంబ్లీ కి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి.
ఇప్పుడు, మొత్తం 29 రాష్ట్రాల శాసనసభలకు, లోకసభకు ఒకేసారి ఎన్నికలు జరపాలనేది… మోడీ ఆలోచన.
ఈ ఆలోచనను అమలు చేయడం లో గల సాధక బాధకాలను వివరించాలంటూ కేంద్రం ఒక కమిటీ ని వేసింది. దేశం లో ఇంక ఎవరూ అర్హులైన వారు లేరన్నట్టుగా – ఈ కమిటీ కి అధ్యక్షుడుగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను నియమించారు. ఒక మాజీ రాష్ట్రపతి ని పార్టీ పనులకు వాడుకోవడం అనేది గతం లో ఎప్పుడూ జరగలేదు. ఆ పేరు వినగానే,వళ్ళు ఒక్కసారిగా జలదరించింది….., మాజీ రాష్ట్రపతి కి ఏమిటీ దుస్థితి అని.
ఆ కమిటీ లో – హోమ్ మంత్రి అమిత్ షా కూడా సభ్యుడు. ఇక, చెప్పేదేముంది?
అదేదో తెలుగు సినిమాలో- హీరోయిన్ ను బలవంతపు పెళ్లి చేసుకోవాలనుకున్న విలన్; పురోహితుడిని పిలిచి, ” పంతులూ! రేపు ఉదయం పదింటికి మంచి ముహూర్తం పెట్టవయ్యా నా పెళ్లి కి ‘ అని హుంకరించినట్టుగా జమిలి ఎన్నికలు తాము కోరుకున్న రీతిలో సిఫారసు చేసే పనిని రాంనాథ్ కోవింద్ కు మోడీ అప్పచెప్పారు. పోనీ, మోడీ ఆలోచనలకు జై కొట్టే మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరికి ఈ పని అప్పగించి ఉండాల్సింది.
అయినప్పటికీ, ఈ కాన్సెప్ట్ ను ఉనికి లోకి తీసుకు రావడం అంత సులభమైన విషయం కాదు.
స్వతంత్రం వచ్చిన మొదటి మూడు, నాలుగు సార్లు జమిలి ఎన్నికలు సజావుగా జరిగినప్పుడు…. ఇప్పుడెందుకు జరిపించుకోలేము అనే సందేహం రావడం సహజం.
అప్పుడు – కేంద్రం లోను, రాష్ట్రాల లోను కాంగ్రెస్ పార్టీ దే పెత్తనం. రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో కూలిపోవడాలు…. లేదా… వాటిని అర్ధంతరంగా రద్దు చేయడాలు అనేవి ఉండేవి కావు.
ఇప్పుడు….ఒక్కో రాష్ట్రం లో ఒక్కో పార్టీ అన్నట్టుగా రాజకీయం చిలవలు, పలవలు గా విస్తరించింది. రాజకీయ స్వార్ధం ఊహకు అందనంతగా పెరిగిపోయింది. ‘రాజకీయం ‘ అనేది, పొలిటికల్ బిజినెస్ గా మారిపోయింది.ఈ నేపథ్యం లో… రాష్ట్రాల శాసన సభలకు – లోకసభకు ఎన్నికలు ఏక కాలం లో జరపడం సాధ్యమా అనే తర్జన భర్జనలు దేశ వ్యాప్తం గా ఊపందుకున్నాయి.
దీనికోసం రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి అనే వాదన కూడా బలం గా ఉంది. రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేసుకోవాలనుకుంటే… అన్ని చేసుకోండి గానీ, దాని మౌలిక స్వరూపం మార్చే సవరణ(ల ) ను మాత్రం అంగీకరించం అని సుప్రీమ్ కోర్టు గతం లో తెగేసి చెప్పింది. మరి, ఇప్పుడు కేంద్రం తలపెట్టనున్న రాజ్యాంగ సవరణలు…. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయా అనే విషయం సుప్రీం కోర్టు పరిశీలన తరువాతే తేలుతుంది. బహుశా ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రంగం లోకి దిగవచ్చు. ఇందులో…. ఎంతమంది – పదవీ విరమణ తరువాత గవర్నర్లు, రాజ్యసభ సభ్యులు అవుతారో తెలియదు.
ఈ మొత్తం ‘కసరత్తు’ ను – ‘జమిలి కోసం మోడీ – మోడీ కోసం జమిలి గా అభివర్ణించ వచ్చు. ఈ ప్రత్తిపాదన వెనుక నిర్థిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి.
* మూడవ సారి మోడీ ప్రధాని కావాలి.
*అది కూడా, బీజేపీ కి పూర్తి మెజారిటీ రావాలి. వాజపేయి లాగా, సంకీర్ణ ప్రభుత్వాన్ని మోడీ నడపలేరు.
*ప్రతి పక్షాలు సంఘటితం అయితే, లక్ష్యానికి ప్రతిబంధకం కలగవచ్చు.
* బీజేపీ కి మోడీ ఒక్కరే మగ దిక్కు. ఆయన ఒక్కరే జాతీయ స్థాయి నేత. ప్రతిపక్షాలలో పాతికమంది జాతీయ స్థాయిలో జనానికి తెలిసిన నేతలు ఉన్నారు.
* వారందరినీ…. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రచారానికి కట్టి పడేయడానికి – జమిలి ఎన్నికలు ఓ మార్గం.
* జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రచారానికి ప్రతి పక్షాలకు అంతగా వీలు పడదు.
* మోడీ మూడో సారి పూర్తి మెజారిటీ తో ప్రధాని పదవి చేపడితే ; ఇండియా కాస్తా భారత్ అవుతుంది.
* 80: 20 గా దేశం మానసికంగా విడిపోతుంది. పాలనా పద్ధతులు సైతం 80:20 కి అనుగుణం గా మారిపోవచ్చు.
అయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, రాజకీయ గమనం లో – జమిలి ఎన్నికల ప్రభావం ఏమీ ఉండదు అనిపిస్తున్నది . జమిలి ఎన్నికలు లేకపోయినా ఫలితాలు ఎలా ఉంటాయో… జమిలి ఎన్నికలు ఉన్నా అలాగే ఉంటాయి. మన ఓటర్లకు ‘జమిలి ‘ పట్టదు. పట్టేదల్లా… ‘వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏమైంది? ఏమవుతుంది? దొరుకుతారా…. దొరకరా….?’