న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా సామర్థ్యంపై భారత మాజీ జి20 షెర్పా, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ప్రశంసలు కురిపించారు. వైజాగ్‌లో (విశాఖపట్నం) భారతదేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ల డాలర్లు (దాదాపు ₹1,25,000 కోట్లు) చారిత్రక పెట్టుబడిని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
“గ్లోబల్ దిగ్గజాలను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. వైజాగ్‌లో గూగుల్ భారీ పెట్టుబడి ఈ విషయాన్ని నిరూపించింది,” అని అమితాబ్ కాంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
గ్లోబల్ హైపర్స్కేలర్లకు గేట్‌వే
ఈ ప్రాజెక్టును కాంత్ ఒక ‘న్యూ వేవ్’గా అభివర్ణించారు. “ఈ పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు అపారమైన కంప్యూటింగ్ శక్తిని, స్టోరేజ్ సామర్థ్యాన్ని అందించే గ్లోబల్ హైపర్స్కేలర్లను, డేటా సెంటర్లను ఆకర్షించే కొత్త శకానికి ఆరంభం కానుంది” అని ఆయన అన్నారు.
భారతదేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు.. అత్యాధునిక సాంకేతికతలు, హై-పెర్ఫార్మింగ్ కంప్ల్యూట్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ కనెక్టివిటీ వంటి వాటిని ఆకర్షించే సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయడాన్ని ఆయన కొనియాడారు. చివరిగా, ఐటీ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి “బ్రిలియంట్ వర్క్! అద్భుతమైన కృషి” అంటూ అమితాబ్ కాంత్ అభినందించారు. గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడితో విశాఖపట్నం ప్రపంచ టెక్ హబ్‌గా మారడానికి గట్టి పునాది పడినట్లయింది.