– అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి
విజయవాడ : తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటుందని అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా వరదల కారణంగా విపత్తులు సంభవించి, డాక్టర్ల అవసరం ఉన్నచోట ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ డాక్టర్లందరూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. డాక్టర్ల అవసరం ఏర్పడితే వెంటనే మా అప్నా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు కానీ మా అప్నా రాష్ట్ర కార్యవర్గానికి గాని సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఎక్కడ అవసరమైతే అక్కడ ఏ స్పెషాలిటీ డాక్టర్ల అవసరమైతే ఆ స్పెషాలిటీ డాక్టర్లను పంపి వైద్యం చేయించడానికి సిద్ధంగా ఉన్నామని సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో డాక్టర్లు తమకు రావలసిన బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధిలేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ల లో సేవలు నిలిపివేసిన సందర్భంగా, వారి న్యాయమైన డిమాండ్ల సాధనలో వారికి మద్దతు తెలియజేస్తూనే,
తుపాను సందర్భంలో సేవ సిద్ధంగా ఉన్నామన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడితే అప్నాను సంప్రదిస్తే, అటు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్లకు తోడుగా గాని లేదా ప్రత్యేక బృందాలుగా గాని ఏర్పడి అప్నా డాక్టర్లు ప్రజలకు ప్రభుత్వానికి అండగా ఉంటారని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ప్రకటించారు.