– తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో 5గురు బీసీలు..
– రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
– రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై ఉద్యమిస్తాం
– సామాజిక న్యాయం అమలులో జగన్ గారు దేశంలోనే నంబర్ వన్
రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు అభ్యర్థులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య లు నామినేషన్లను దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసిన అనంతరం వి. విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…
మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశం వల్ల, మేము నలుగురం కూడా రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నాం. దీనికి సంబంధించి, ఈరోజు నామినేషన్లు వేయడం జరిగింది. మా అధ్యక్షుడి ఆశయాల మేరకు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం సమస్యలను పార్లమెంట్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని మేమందరం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం.
ఇది రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకువెళ్ళి, వాటికి పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ ఇతర పార్టీ అయినా మా అందరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఉద్యమం చేస్తుంది. అది ప్రత్యేక హోదా అయినా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతికేకం కావచ్చు, మరేవిషయంలో అయినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇతర పార్టీలు వ్యవహరించినా మేము వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం.
తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో 5గురు బీసీలు
రాజ్యసభలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య తొమ్మిదికి పెరుగుతుంది. ఈ తొమ్మిది మందిలో అయిదుగురు బీసీ సామాజిక వర్గాల వారుకాగా, మిగతావాళ్లు నాన్ బీసీలు ఉంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మా ముఖ్యమంత్రిగారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను మిగతా సామాజికవర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చేసేలా , ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం, ప్రతి కార్యక్రమం ఆవైపే ఉంటుంది.
కేంద్రంపై పోరాటంలో మా విధానం మాకు ఉంది
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ.. ఏ సమస్య మీద అయితే పోరాడాలో దానిమీదే కేంద్రంతో పోరాడాలి, ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రతిదానిపై కేంద్రంపై పోరాడాలన్నది సరైన విధానం కాదు. రాష్ట్ర ప్రయోజనాలకు ఏది విరుద్ధమో వాటిమీదే కేంద్రంపై పోరాడాలి. మిగతా విషయాల్లో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి. ఇది మా యొక్క విధానం. ఆవిధంగానే మేము పనిచేస్తామని సవినయంగా తెలియచేస్తున్నాం.రాష్ట్రపతి ఎన్నికల్లో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు.
రాజ్య సభ అభ్యర్థి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..
పార్లమెంటులో బీసీ బిల్లు ద్వారా బీసీలంతా జగన్ కి సెల్యూట్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నంబర్ వన్ సామాజిక న్యాయం పాటిస్తున్న నాయకుడు. గతంలో పరిపాలించినవాళ్లను అధిగమిస్తూ, సామాజిక న్యాయం అమలులో దేశంలోనే తొలిస్థానంలో నిలిచారు. ముఖ్యంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టించడం అన్నది చరిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇందుకు, దేశంలోని 75కోట్లమంది బీసీలు జగన్‌గారికి సెల్యూట్ చేశారు. ఇది సామాజిక న్యాయానికి సంకేతం.
నామినేటెడ్ పదవుల్లో 50శాతం బడుగు, బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టాన్ని చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా, ఈ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా పేదవర్గాలను శాశ్వతంగా సమగ్ర అభివృద్ధి చేయాలన్న విజన్‌తో ఆయన పనిచేస్తున్నారు. విద్య ద్వారానే సమాజంలో సమూలమైన మార్పు వస్తుందని, ప్రతి ఒక్కరు చదువుకోవడం ద్వారానే నవ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో జగన్ గారు అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారు. గొప్ప విజనరీగా ఈ పథకం ప్రవేశపెట్టడంతో మిగతా రాష్ట్రాలు కూడా ఈ పథకం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం మాటల చెప్పడం కాకుండా.. ప్రతిది ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఉన్నా, తనకు ఉన్న సర్వ శక్తులు ఒడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ ని ఈరోజు దేశమంతా ప్రశంసిస్తోంది. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయకుండా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి జగన్ప నిచేస్తున్నారు.
రాజ్యసభ అభ్యర్థులు బీదా మస్తాన్ రావు, ఎస్ నిరంజన్ రెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో తమవంతు పోరాటం చేసి, ముఖ్యమంత్రి జగన్ గారు తమపై ఉంచిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు.