మహనీయుల త్యాగఫలితమే స్వాతంత్య్రం

-స్వతంత్ర ఛానల్‌ ఎండీ కృష్ణప్రసాద్‌ 
-సెయింట్‌ ఆన్స్‌ మహిళా కళాశాల్లో ఘనంగా ‘స్వతంత్ర స్ఫూర్తి’ కార్యక్రమం

హైదరాబాద్‌:’ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే.. మనమంతా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నాం’ అని స్వతంత్ర న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.కృష్ణప్రసాద్‌ అన్నారు. మెహిదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ మహిళా కళాశాల్లో శనివారం జరిగిన స్వతంత్రస్ఫూర్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమే స్వతంత్ర ఛానల్‌ చేపట్టిన ‘స్వతంత్ర స్ఫూర్తి’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

అన్నింటా స్వేచ్ఛ, సమానత్వం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఫలితంగానే మనకు నచ్చిన విధంగా ఆహారం తీసుకోలుగుతున్నామని, వస్త్రాలను ధరించగలుగుతున్నామని కృష్ణప్రసాద్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 37 దేశాల్లో మహిళల వస్త్రధారణ, ఇతర విషయాల్లో ఆంక్షలు ఉన్నాయని, వందేళ్ల క్రితమైతే 4,5దేశాల్లో మాత్రమే మహిళలకు ఓటు హక్కు ఉందని చెప్పారు. ఇప్పుడిప్పుడే మహిళలు ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని, అన్ని విషయాల్లో స్వేచ్ఛ, సమానత్వాన్ని పొందుతున్నారని, వారికి నచ్చిన విధంగా జీవించగలుగుతున్నారని కృష్ణప్రసాద్‌ వివరించారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి
సెయింట్‌ ఆన్స్‌ కళాశాల అంటేనే.. క్రమశిక్షణకు, ఆచరణాత్మక విద్యకు మారుపేరని కృష్ణప్రసాద్‌ చెప్పారు. ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న విద్యార్థులంతా మంచి విద్య, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌తో పాటు,swat మంచి కెరీర్‌ కోసం అందుబాట్లో ఉన్న వనరులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు చదువుతో పాటు స్పోర్ట్స్‌, కంప్యూటర్‌ కోర్సులను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థగా సెయింట్‌ ఆన్స్‌కు మంచి పేరుందన్నారు. సెయింట్‌ ఆన్స్‌ కళాశాలను ఎంచుకున్న విద్యార్థులందరికీ కృష్ణప్రసాద్‌ అభినందనలు తెలిపారు.

ఐక్యంగా ఉంటేనే నిలబడతాం: పుష్ఫలీల, ప్రిన్సిపాల్‌
ఐక్యంగా ఉంటేనే నిలబడతామని, విడిపోతే పడిపోతామని సెయింట్‌ ఆన్స్‌ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ పుష్ఫలీల విద్యార్థులకు పిలుపునిచ్చారు. అహింస, సహాయనిరాకరణే ఆయుధాలుగా జాతిపిత మహత్మాగాంధీ.. ఇతర నాయకులతో కలిసి ఐక్యంగా చేసిన పోరాటం వలనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసిన సమరయోధులకు ఘనంగా నివాళి అర్పించడం మన విధి అని పుష్పలీల పేర్కొన్నారు.

భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటడంలో సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థినులు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, మేఘన, కృష్ణప్రియ తమవంతు పాత్ర పోషించారని చెప్పారు. స్వాతంత్య్రం పట్ల, సమమరయోధుల త్యాగాల పట్ల యువతలో స్ఫూర్తిని రగిల్చేందుకు స్వతంత్ర న్యూస్‌ ఛానల్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ప్రిన్సిపాల్‌ పుష్పలీల. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు ఆలపించిన దేశభక్తి గీతాలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

Leave a Reply