– గెలుస్తామని బీరాలు పలుకుతున్నవాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు?
– వరి వేసుకుంటే ఊరే అని చెప్పిన చరిత్ర వాళ్లది
– బీసీ అయిన బండిసంజయ్ ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి తీసుకుండు
– ఓట్లు అడిగే అర్హత సంజయ్, కిషన్ రెడ్డికి లేదు
– కరీంనగర్ లో ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కరీంనగర్: కరీంనగర్ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆనాడు సోనియమ్మ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు. పీవీ నరసింహరావు లాంటి ఎంతోమందిని అందించిన ఘనత ఈ గడ్డకు ఉంది. ఈ గడ్డ రాజకీయ చైతన్యానికి మారుపేరు.
కరీంనగర్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత జీవన్ రెడ్డి ది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆరెస్ నేతలు కేసీఆర్, హరీష్, కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ఎవరైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీ అభ్యర్థులను ఓడించాలని ప్రచారం చేస్తారు. కానీ… ఏ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ ను ఓడించాలని కెసిఆర్, హరీష్, కేటీఆర్ చెబుతున్నారు? మీ అభ్యర్థి ఎవరు అని మేం ప్రశ్నిస్తున్నాం.
కేసీఆర్ ను ఈ వేదికగా సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు ఓట్లు ఎవరికి వేయాలని మీరు ప్రచారం చేస్తున్నారు. బీఅరెస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో సాగిలపడుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని బీరాలు పలుకుతున్నవాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? ప్రజాస్వామికవాదులు ఆలోచన చేయండి.
35 వేల మంది టీచర్ల బదిలీలు, 22 వేల మంది టీచర్ల ప్రమోషన్లు ఏడాదిలో చేసింది నిజమైతే కాంగ్రెస్ కు ఓటు వేయండి. మీ గుండెలపై చేయి వేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయండి. టెట్ నిర్వహించి 11 వేల మంది నియామకపత్రాలు ఇచ్చింది నిజమైతే కాంగ్రెస్ కు ఓటు వేయండి. గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయండి. ప్రతీ నెల ఒకటో తారీఖున మీ జీతాలు మీ ఖాతాలో పడితేనే ఓటు వేయండి.
గతంలో మీ జీతాలను కూడా మీరు అడుక్కునే పరిస్థితి కల్పించింది కెసిఆర్ కాదా?ఐటీఐలను ఎటీసీలుగా అప్ గ్రేడ్ చేసింది నిజమైతే మాకు ఓటు వేయండి. రాబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించేందుకు వారికి ఉద్యోగం ఇచ్చింది నిజం కాదా? పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం, నగదు ప్రోత్సాహం అందించింది నిజం కాదా?
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశంలోనే మొదటిసారిగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఇదొక విప్లవం. ఇది ఒక మార్పు. బీఆర్ఎస్ కు అసూయ, ద్వేషం, కోపం, అక్కసు ఉండటం సహజం. ఎందుకంటే వాళ్లు కూర్చోవాల్సిన కుర్చీల్లో మేం కూర్చున్నాం. బీఅరెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఢిల్లీకి పోయేది లేదన్నారు. అధికారంలో పోయాక చీకట్లో కాళ్లు పట్టుకుని వెలుగులో ముచ్చట్లు చెబుతుండ్రు.
తొలి ఏడాదిలోనే 21 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ది. వరి వేసుకుంటే ఊరే అని చెప్పిన చరిత్ర వాళ్లది.. కానీ వరికి బోనస్ అందిస్తున్న ఘనత మాది. కాళేశ్వరం కూలిపోయినా పంటలకు నీళ్లు ఇచ్చి, గిట్టుబాటు ధర ఇచ్చి వడ్లు కొనుగోలు చేశాం. ఏం పాపం చేసిందని కాంగ్రెస్ ను ఓడించాలని అంటున్నారు? దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేం ఓట్లు అడగం అని మోదీకి సవాల్ విసురుతున్నా.
రెండుసార్లు బండి సంజయ్ ను గెలిపిస్తే ఏం తీసుకొచ్చిండు? పెద్ద బీసీ మోదీ, చిన్నబీసీ సంజయ్ కలిసి కనీసం బీసీల లెక్కలు కూడా తేల్చలేదు. బలహీన వర్గాల లెక్కలు తీసిన ఘనత మాది… అందుకు కాంగ్రెస్ ను ఓడించాలని చెబుతున్నారా? జనగణనలో కులగణన చేర్చాలని మేం డిమాండ్ చేస్తున్నాం. సంజయ్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా… మీ అధికారులను అడుగు బీసీలలో ముస్లింలను చేర్చింది ఎవరో? గుజరాత్ లో 39 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నది నిజం కాదా?
మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నది నిజం కాదా?నాపై విమర్శలు చేసి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలని అనుకుంటున్నావా? బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇష్టం లేకనే బీజేపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. వచ్చే అసెంబ్లీలో పాలకు పాలు నీళ్లకు నీళ్లు చూపిస్తాం.దమ్ముంటే చర్చకు రండి. సికింద్రాబాద్ లో బండారు దత్తాత్రేయ ఉన్న బీసీ సీటును కిషన్ రెడ్డి తీసుకుండు. బీసీ అయిన బండిసంజయ్ ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి తీసుకుండు. కానీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఒక బీసీ మహేష్ గౌడ్ కు ఇచ్చింది.
బీసీల సీట్లు గుంజుకున్న కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడుతుండు. మందకృష్ణను కౌగిలించుకున్న మోదీ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయలేదు. కానీ మీ రేవంతన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేసేందుకు చర్యలు తీసుకుండు. బీజేపీకి ఎనిమిది ఎంపీలను ఇచ్చినా తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు. ఓట్లు అడిగే అర్హత సంజయ్, కిషన్ రెడ్డికి లేదు. బీజేపీని బొందపెడితేనే తెలంగాణకు నిధులు వస్తాయ్. బీజేపీని బొందపెట్టి తెలంగాణకు నిధులు సాధించుకుందాం.