– కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకోగానే కేసులు బండి సంజయ్ నీరుగారుస్తున్నారు
– కృష్ణ మాదిగకు ముద్దు పెట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పార్లమెంట్ లో చట్టం చేయరు?
– మమ్మల్ని ఓడించమంటే బీజేపీ వాళ్ళను గెలిపించమనేగా అర్థం
– మంచిర్యాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మంచిర్యాల: మీరు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సేవకులుగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ లభించారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టలేదు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్, కవిత కాంగ్రెస్ ను ఓడించమంటున్నారు. ఎవరికి ఓటు వేయమని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎవరికి ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తారో తెలపాలి.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతే 8 చోట్ల బీజేపీ గెలిచింది. ఇందులో ఉన్న మతలబు ఏమిటి? బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణకు ఏం సాధించింది? తెలంగాణ నుంచి బీజేపీ కి ఎంపీలు కావాలి. మా ఓట్లతో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కావాలి కానీ తెలంగాణకు మీరు ఏం చేశారు? ప్రాణహిత చేవెళ్లను చేపడితే ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. మహారాష్ట్ర అనుమతులు ఇవ్వలేదన్నారు.
అనుమతులు బీజేపీ ఎందుకు ఇప్పించలేదు? మేము ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలు 55 వేలు ఇచ్చాం. మేము ఉద్యోగాలు ఇవ్వడం నిజం కాకపోతే మీరు మాకు ఓటు వేయవద్దు. మేము 55 వేల ఉద్యోగాలు ఇస్తే నరేంద్ర మోదీ తెలంగాణకు 2 ఉద్యోగాలు ఇచ్చారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి మాత్రమే 2 ఉద్యోగాలు నరేంద్ర మోదీ ఇచ్చారు. నైపుణ్యాల పెంపునకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాం. రాబోయే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.
దక్షిణ కొరియా లోని ఒక్క యూనివర్సిటీ నుంచి పాల్గొన్న ఒక్క మహిళ 3 గోల్డ్ మోడల్స్ సాధిస్తే 100 కోట్ల పైన జనాభా ఉన్న మనదేశం ఎన్ని గెలిచింది. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల సాధనకు దావోస్ సదస్సులో పాల్గొని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ రోజు కూడా ఒక సాఫ్ట్వేర్ సంస్థ ప్రారంభించి వచ్చా. మా ప్రభుత్వం 25 లక్షల కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. రుణమాఫీ అయిన కుటుంబాల వారు నరేంద్ర రెడ్డికి ఓటు వేయాలి.
3 ఎకరాల వరకు రైతు భరోసా వేశాం. మార్చి 31 వరకు రైతు భరోసా పూర్తి చేస్తాం. అక్కాచెల్లెళ్లు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 200 లోపు యూనిట్ల విద్యుత్ ఇళ్లకు ఉచితంగా వచ్చే వారు నరేందర్ రెడ్డి కి ఓటు వేయండి. పదేళ్ల కాలంలో కేసీఆర్ ఏం వెలగబెట్టారు?
మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించి కేసీఆర్ ఫాం హౌస్ లో చల్లగా పడుకున్నాడు. మమ్మల్ని ఓడించమంటే బీజేపీ వాళ్ళను గెలిపించమనేగా అర్థం.
రాష్ట్ర అభివృద్ధికి నేను కొట్లాడుతుంటే నా కాలు పట్టుకొని, నా అంగీ పట్టుకొని కేసీఆర్ అడ్డుకుంటున్నారు. మోదీ, కేసీఆర్ కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పెద్ద బీసీని చెప్పుకునే మోదీ 12 ఏళ్లుగా చేయని బీసీ కుల గణనను 12 నెలల కాలంలో నేను చేశా. 1931 తర్వాత చేయని కుల గణనను నేను చేశా. ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని మేము అసెంబ్లీలో ఆమోదించాం.
మంద కృష్ణ మాదిగకు ముద్దు పెట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పార్లమెంట్ లో చట్టం చేయరు? మేము కేసులు పెడితే అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాకుండా చేస్తుంది. ఎవరో బండి సంజయ్ చెప్పాలి. మేము ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్ కాగితాలను ఈడి పట్టుకుపోయింది. కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకోగానే కేసులు బండి సంజయ్ నీరుగారుస్తున్నారు. మెట్రో రైల్ రాకుండా కిషన్ రెడ్డి, మూసీ పునరుజ్జీవం కాకుండా ఈటల రాజేందర్ అడ్డుకుంటున్నారు.
రాష్ట్రానికి సంబంధించి ప్రతి పనిని కేంద్రంలో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. నిజంగా కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ పునరుజ్జీవం, పాలమూరు రంగారెడ్డికి అనుమతులు, నిధులు, మెట్రో రైలు కు అనుమతులు, నిధులు సాధించాలి. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు. మీకు తెలియజేయడానికి ఇవన్నీ చెప్పా. పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏం చేయలేని వాళ్లు పది నెలల మా పాలనపై పడుతున్నారు. ఎన్నికల కోడ్ తో మేము పది నెలలు కూడా పూర్తిగా పాలించలేదు. నేను మీలో ఒకడిని… సామాన్యుడిని.