Suryaa.co.in

Telangana

వృత్తికులాల ఐక్యతకు గండ దీపం కవిత్వం ప్రతీక

– తెలంగాణ ఆస్తిత్వ, సాంస్కృతిక సంపద గండ దీపం : డా. అంబటి సురేంద్ర రాజు
– గండదీపం కవిత్వం సబ్బండ కులాల గుండె దీపం
– తరతరాల వారసత్వ జీవన తాత్వికత గండ దీపం కవిత్వం
– గండ దీపం ఆవిష్కరణ సభలో ప్రముఖ కవి, పాత్రికేయులు రమేష్ హజారి ఆప్తవాక్యం

హైదరాబాద్: పల్లె చుట్టూ అల్లుకున్న మానవ శ్రమ జీవన సౌందర్యాత్మక వృత్తి కళలు, ప్రకృతి వస్తు ప్రపంచ నేపథ్యాన్ని అల్లుకొని రాసిన గండదీపం పుస్తకావిష్కరణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో జరిగింది.

ఈ పుస్తకాన్ని అంబటి సురేంద్ర రాజు ఆవిష్కరించారు. కవి జర్నలిస్టు రమేశ్ హజారి ప్రారంభోపన్యాసం చేశారు. తొలికాపిని ప్రముఖ సైంటిస్ట్ రాపాక సుభాష్ చంద్రబోస్ అందుకున్నారు.

ఈ సందర్భంగా.. ప్రఖ్యాత విమర్శకులు, కవి, రచయిత గండ దీపం పుస్తక ఆవిష్కర్త, డా. అంబటి సురేంద్ర రాజు మాట్లాడుతూ.. సమాజానికి నాగరికత నేర్పింది విశ్వకర్మలేనని, వారి జీవిత అనుభవాలను కవి కవిత్వంగా రాసారని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆధునికంగా వినిపిస్తున్న గొప్ప కవిత్వం సరసన పుష్పగిరి కవిత్వం నిలుస్తుందని, అబ్బురపరిచే పద చిత్రాలతో వినూత్న కవిత్వాన్ని పుష్పగిరి రాస్తున్నాడని సురేంద్రరాజు తెలిపాడు.

తెలంగాణ ఆస్తిత్వాన్ని సాంస్కృతిక సంపదను సామాజిక తాత్వికతను గండ దీపం’ లో కవి పలికించాడని అన్నారు. ప్రస్తుత సామాజిక రాజకీయ వర్తమాన సందర్భంలో పుష్పగిరి కవిత్వానిది కీలక పాత్ర అని అన్నారు. వృత్తికులాల ఐక్యతకు ఈ కవిత్వం ప్రతీకగా నిలుస్తోందని, ప్రతి లైబ్రరీ లో, ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండాలని ఈ కవిత్వం పై విస్తృ తంగా చర్చ జరగాలని అసుర అన్నారు.

కవి రచయిత, పాత్రికేయులు రమేష్ హజారి ఈ సందర్భంగా ఆప్తవాక్యం పలుకుతూ… సామాజిక పద చిత్రాలతో పుష్పగిరి గండ దీపాన్ని వెలిగించాడని, తన కవిత్వం సబ్బండ కులాల గుండె దీపమని అన్నారు. తెలంగాణ ప్రతి పల్లె కుల బంధాలు, రక్తసంబంధాల కంటే మానవ జీవన ఉత్పత్తి సంబంధాలకు నిలయమని రమేష్ హజారీ పేర్కొన్నారు.

గండ దీపం కవిత్వం పల్లె, ప్రజల చుట్టూ అల్లుకున్న కవిత్వమని, ఉత్పత్తి లో భాగస్వామ్య మైన ప్రజల జీవన విధానం సంస్కృతి కవిత్వంగా వెలువడిందని అన్నారు. తరతరాల వారసత్వంగా వస్తున్న జీవన తాత్వికత ఈ కవిత్వంలో ఇమిడి ఉందన్నారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ మలి దశ ఉద్యమ పోరాటంలో సబ్బండ కులాలు సకలజనులు చైతన్యమై పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని, పదేండ్ల అనతికాలంలో సబ్బండ వృత్తి కులాల జీవితాల్లో గుణాత్మక ప్రగతి సాధించుకున్నామని, అదే స్ఫూర్తి నీ కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకోసం పాటు పడాలని రమేష్ హజారీ తెలిపారు.

అనంతరం రచయిత విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ… గండదీపం కవిత్వం నిండా ఊరు, అమ్మ, ప్రకృతి, కుల వృత్తుల సౌందర్యం, పల్లె జనాల ఆత్మీయత ఉన్నాయని, ఎదుగుతున్న క్రమంలో పల్లె చిద్రమైన దుఃఖమే తన గండదీపం.. కవిత్వమని అన్నారు.

ఈ కవిత్వానికి ముందు మాట రాసిన ప్రముఖ కవి వాగ్గేయకారులు గోరేటి వెంకన్న కు, ఆప్తవాక్యంగా కవిత్వాన్ని సమీక్షించి దానికో సైద్ధాంతికత దృక్పథాన్ని అద్దిన రమేష్ హజారి, పుస్తక అంకితాన్ని స్వీకరించి ఆవిష్కరణ చేసిన డా. అంబటి సురేంద్ర రాజుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి రూపశిల్పి బివిఆర్ చారి, ఏ సి పి కిరణ్ కుమార్, డా. హరికాంత్, అనుముల ప్రభాకరాచారి, డా. నరసింహా చారి, రాజబాపు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE