– కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు
– రెమోకు జుట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదు అంతే.. మిగదంతా సేమ్ టు సేమ్
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోసం ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి, నాలుగు కోట్ల ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గద్వాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే విధానాలుగా మార్చుకుని బీఆర్ఎస్ పదేళ్లపాటు ఓ మహాయజ్ఞంలా పనిచేస్తే, రేవంత్ రెడ్డి గత పదెన్నిమిది నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై పనికిరాని నిందలు.. బిల్డర్లు – కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు పంపడమే విధానంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి ఉత్త మాటల మనిషి మాత్రమే కాదన్న కేటీఆర్, ఆయన ఢిల్లీకి మూటలు మోసే మనిషిగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు చంద్రబాబు కోసం మూటలు మోసి అడ్డంగా దొరికిపోయారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఎవరిని బెదిరించాలి, ఎవరిని దోచుకోవాలి, ఎట్లా ఢిల్లీకి దోచుకున్న సొమ్ము పంపాలనే ఆలోచన తప్ప, తెలంగాణపై పట్టింపు లేదని దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు వేశారని, 49 వేల 500 కోట్ల రుణమాఫీ చివరకు పావుశాతం కూడా కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భయంకరమైన మానసిక వ్యాధితో రేవంత్ రెడ్డి బాధపడుతున్నట్టు కనిపిస్తోందని కేటీఆర్ స్పష్టంచేశారు. గతంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కట్టిన కట్టడాలనే అందరికీ చూపించుకుంటూ తిరుగుతున్నారని, కాంగ్రెస్ సర్కారుకు ఇప్పుడు అవే దిక్కయ్యాయని తెలిపారు.
రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా ? అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసాన్ని, బీజెపి నయవంచనను ఊరూరా తీసుకపోవాల్సిన బాధ్యత గులాబీ సైనికులందరి మీద ఉందన్నారు.
వలస ప్రాంతంగా ముద్రపడ్డ పాలమూరు ముఖచిత్రాన్ని కేసిఆర్ సమూలంగా మార్చివేశారన్న కేటీఆర్, ఆంధ్ర, కర్ణాటక నుంచి పదేళ్ల పాలనలో రివర్స్ మైగ్రేషన్ సాగిందని గుర్తుచేశారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా అలంపూర్, గద్వాలలో ఉద్యమ స్ఫూర్తిని చాటి గులాబీ జెండాను ఎగరవేసిన నడిగడ్డ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
గులాబీ జెండా కింద గెలిచిన ఎమ్మెల్యే మోసం చేసి వెళ్లినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ తోనే ఉన్నారని స్పష్టంచేశారు. త్వరలో గద్వాలకు కూడా ఉపఎన్నిక రావడం ఖాయమని, వచ్చే ఉప ఎన్నికల్లో సామాన్య కార్యకర్తను పెట్టినా అక్కడ గులాబీ జెండాను ఎగరవేస్తామని కుండబద్దలు కొట్టారు.
ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ బడా నేతలు ఝూటామాటలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి వంచించారని దుయ్యబట్టారు. 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కనీసం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిన చేతకాని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దరిద్రపు పాలనను ఇంకెన్ని రోజులు భరించాలని ప్రజలు బహిరంగంగానే మమ్మల్ని అడుగుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన సన్నాసులకు వచ్చే ఉపఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమన్నారు. కేసిఆర్ హయాంలో గద్వాలను జిల్లా చేసి పరిపాలనను ప్రతి గడపకు చేరువ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. రాజోలి బండ డైవర్షన్ స్కీం కోసం ఆలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ వరకు పార్టీ పెట్టిన కొత్తలో కేసీఆర్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు.
తెలంగాణకు గులాబీ జెండానే గుండె ధైర్యం
ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే నిండా మోసపోతామని, తెలంగాణకు ఎప్పటికీ గులాబీ జెండా మాత్రమే గుండెధైర్యమనే విషయం నాలుగు కోట్ల ప్రజలకు తెలుసని కేటీఆర్ చెప్పారు. జూన్ నెలలో పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ మొదలవుతుందని కేటీఆర్ వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుని ముందుకు సాగుదామని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలైనా.. ఉప ఎన్నికలు వచ్చినా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.