తెలంగాణ కోటాలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ప్రతిపాదించిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రి రవిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందించారు.
తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన బండ ప్రకాశ్… ఇటీవలే తెలంగాణ శాసన మండలి సభ్యుడి (ఎమ్మెల్సీ)గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బండ ప్రకాశ్ తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేయగా… ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉన్న ఆ స్థానానికి తాజాగా ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గాయత్రి రవి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో బలం ఆధారంగా
ఇతర పార్టీలు నామినేషన్లు వేసినా ఈ స్థానం నుంచి గాయత్రి రవి ఎన్నిక కావడం ఖాయం. ఇదే విషయాన్ని గమనించిన ఇతర పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. దీంతో ఈ స్థానానికి గాయత్రి రవి ఒక్కరి నుంచే నామినేషన్ అందడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.