విచ్చేశారు అందరూ
బానపొట్టలు
బట్టతలలతో
నెరసిన జుత్తుతో
పురుష పుంగవులు !
బారెడుజడలూ
మూరెడుకాగా
సోడాబుడ్డి
కళ్ళద్దాలతో
మహిళా మణులు !!
వాడు వీడేనా ?
వీడు వాడేనా?
ఆమె ఈమేనా ?
ఈమె ఆమేనా ?
గుర్తింపుల గుబాళింపు !
పలకరింపులూ
నమస్కారాలూ
షేక్ హ్యాండులూ
కౌగిలింతలూ
పరామర్శలూ
తాతలుగా మారిన
అలనాటి అబ్బాయిలు
అమ్మమ్మలూనానమ్మలుగామారిన
ఆరోజుల అమ్మాయిలు
మరోవైపు
కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు
చెంగు చెంగున అలనాటి
గెంతులస్ధానంలో
జాగ్రత్తగా అడుగులు వేస్తూ
చేరారంతా ఒకచోటికి
అలనాటి
అల్లరులూ
కొట్లాటలు
ఆటలు
పాటలు
సరదా సన్నివేశాలు
క్లాస్ రూమ్ లన్నీ
కలయ తిరుగుతూ
నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ
తమకలల రాణి కోసం
గుంపులో వెతుకులాడుతూ
దొంగ చూపులు చూస్తూ
గుర్తించలేని మార్పు
కోల్పోయిన వ్యధ
ఎన్నెన్నో జ్ఞాపకాలలో
మరెన్నో మార్పుల వాస్తవాలు
బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే
పోగొట్టుకున్న వారు మరికొందరు
అందరి మోములోనూ
చెరగని చిరునవ్వు
నాటిమేటి విద్యార్ధి
ఏదో సాధిస్తాడనుకున్నవాడు
బడుగు జీవిలా
సంసార సాగరాన్ని
ఈదుతూ అలసిపోగా
ఎందుకూపనికిరాడనుకున్నవాడు
గొప్పవాడై కనుల ముందు
అరేయ్ ఒరేయ్
మావ బావ నాటి పిలుపుల
ఆప్యాయతల స్థానాల్లో
సార్, గారు మర్యాదల మార్పులు !!!
కాలగర్భంలో జారిపోయి
కరిగిపోయిన కొందరు
నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు
ఏదైతేనేం
సుఖదుఃఖాల కలబోత
జ్ఞాపకాల దొంతరల వెదుకులాట
చేరుకున్నావా ? జాగ్రత్త !
చరవాణి హెచ్చరికల మోత !
తెలియకుండానే కరిగి పోయిన కాలం !
బాధాతప్త హృదయాలతో
అడ్డుపడే కన్నీటిపొరల
మసకచూపుల తడిలో
వీడ్కోలు తీసుకునే సమయం !
మరలా కలిసే మరోరోజుకు
అందరూ కలవాలనే ఆశతో !
కాలగమనంలో ఎందరో
చదువులు ముగించి
వెళ్ళేవారికి వీడ్కోలు
వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ
ఏమార్పూలేని కాలేజీ
చిద్విలాసంగా నవ్వుకుంటూ
వెళ్ళి రండని ఆప్యాయంగా
ఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం ఎదురు చూస్తూ
-ఆస్ట్రోకొతారు