– సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
అమరావతి : పాలీసెట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అమరావతిలోని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ కార్యాలయంలో బుధవారం ఈ ఫలితాలను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలీసెట్ 2024 ప్రవేశ పరీక్షలో 87.61 శాతం మంది విద్యార్దులు అర్హత సాధించినట్లు తెలిపారు.
మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 1,24,430 మంది అర్హత పొందారని తెలిపారు. బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16శాతం అర్హత సాధించారని తెలిపారు. ఆరుగురు అభ్యర్ధులు 120 కి 120 సాధించి అగ్రశ్రేణిలో నిలిచారని వారందరికీ మొదటి ర్యాంకును కేటాయించామని నాగరాణి పేర్కొన్నారు.