-
పందిరి పద్దతిలో సాగే టమోటా రైతులకు ప్రధాన పరిష్కారం
-
రేషన్ షాపుల్లో బఫర్ ని జీరో చేయండి.. పరిటాల సునీత
-
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కి ఎమ్మెల్యే సునీత వినతి
-
జిల్లా ఎస్సీతో భేటి.. లా అండ్ ఆర్డర్ కి సహకరిస్తామన్న సునీత
అనంతపురం: టమోటా రైతులను ఆదుకోవాలంటే.. పందిరి పద్ధతిలో సాగుచేయడమే ప్రధాన పరిష్కారమని… ఇందు కోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇవ్వాలని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ్ శర్మను కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పరిటాల సునీత కలిశారు.
నియోజకవర్గంలోని పలు సమస్యలను సునీత వారికి వివరించారు. ఇందులో ముఖ్యంగా టమోటా రైతులు ఎదుర్కొంటున్న అంశాల గురించి.. ప్రస్తావించారు.
టమోటా ధరలు హెచ్చు తగ్గులు ఉండటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఇందుకు పరిష్కారంగా నిపుణులు మూడు ప్రధానమైన సూచనలు చేస్తున్నట్టు చెప్పారు. మొదటిది సాహో వంటి రకాల విత్తనాన్ని సబ్సిడీపై అందించాలని.. అలాగే స్టేకింగ్ పద్దతిలో టమోటా సాగు చేసేందుకు రాయితీలు ఇవ్వాలన్నారు. మరోవైపు మల్చింగ్ షీట్ పై కూడారాయితీలు పెంచాలన్నారు. సాహో వంటి రకాలకు ఢిల్లీ, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉందన్నారు.
కర్రల పద్దతిలో టమోటా సాగు చేస్తే.. ఆరు నెలల పాటు పంట కాలం ఉంటుందని.. ధరలు హెచ్చు తగ్గులు ఉన్నా..రైతులు తట్టుకుంటారన్నారు. కర్రలు, దారం సబ్సడీపై ఇస్తే.. టమోటా రైతులకు చాలా వరకు పరిష్కారం చూపినట్టువుతుందన్నారు. మరోవైపు గత వైసీపీ పాలనలో రేషన్ డీలర్లు బఫర్ ని ఎక్కువగా చూపడం వలన.. ప్రస్తుతం తక్కువ రేషన్ డీలర్లకు అందుతోందన్నారు. దీని వలన పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. 70 నుంచి 90క్వింటాళ్ల వరకు కోత పడటం వలన పేదలకు రేషన్ అందడం లేదన్నారు.
అందుకే బఫర్ ని జీరో చేసి బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలన్నారు. గతంలో జరిగిన రేషన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రాప్తాడు సమీపంలో పరిశ్రమలు నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో వచ్చిన జాకీ లాంటి పరిశ్రమలను అప్పటి నాయకులు కమీషన్ల కోసం వెల్లగొట్టారన్నారు. ఇప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చి.. ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు అనంతపురం, రాప్తాడు, ఆత్మకూరు మండలాల త్రాగునీటి పథకం పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వలన పనులు నిలిచిపోయారన్నారు. బిల్లులు త్వరితగతిన చెల్లించి.. పథకం పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సునీత చెప్పిన అంశాల మీద కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కచ్చితంగా అన్ని అంశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి.. పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు…
జిల్లా ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తో ఎమ్మెల్యే పరిటాల సునీత మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఇటీవల ఎస్పీ ఛార్జ్ తీసుకున్న నేపథ్యంలో ఆమె ఎస్పీని జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు, ఇతర వాటి గురించి చర్చించారు. తమ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలని.. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తమ వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆమె చెప్పారు.
గతంలో నమోదు చేసిన అక్రమ కేసులు.. పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టిన అంశాలను కూడా సునీత ఎస్పీకి వివరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా పని చేసి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీటిపై ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకురావచ్చన్నారు.