-
క్యాన్సర్, గుండెపోటు వ్యాధులను తగ్గించడం, భవిష్యత్తులో నిరోధించే లక్ష్యంతో… ఢిల్లీలో 18వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్
-
ఆపి అధ్యక్షులు డాక్టర్ సతీష్ కత్తుల
హైదరాబాదు : భారతదేశంలో క్యాన్సర్ వ్యాప్తిని, గుండెపోటు వ్యాధులను తగ్గించే లక్ష్యంగా 18వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ న్యూఢిల్లీలో ఈనెల 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆపి ( అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) అధ్యక్షులు డాక్టర్ సతీష్ కత్తుల వెల్లడించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్ కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ప్రపంచవ్యాప్తంగా వివిధ వైద్య విభాగాల్లో నిష్ణాతులైన భారతీయ వైద్యనిపుణులు, వైద్య పరిశోధకులు, వందలాది మంది వైద్యవిద్యార్థులు హాజరవుతున్నారన్నారు.
గురువారం గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్లో అకడమిక్ సెషన్స్ ను నిర్వహిస్తున్నామని, ఈ సెషన్స్ లో వైద్యనిపుణులు, పరిశోధకుల తోపాటు పాలసీమేకర్స్ అందరూ హాజరవుతున్నారని వెల్లడించారు.
ఈ సదస్సులో ప్రధానంగా అనేక మంది పరిశోధకులు దేశంలో క్యాన్సర్, గుండెపోటు జబ్బులపై జన్యుపరమైన అంశాలు, వాతావరణ పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయన్న విషయమై తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్నారన్నారు. అదేవిధంగా ఈ వ్యాధులను నిరోధించే చర్యల్లో భాగంగా సరైన వ్యాయామం, సమతుల్యమైన ఆహారంతో కూడిన జీవనశైలిని ప్రజలు అలవర్చుకునేలా చెయ్యడం చాలా ముఖ్యమనన్నారు.
ఆరోగ్యవంతమైన ప్రజల జీవనశైలికి అనుగుణంగా ప్రభుత్వాలు విధాన నిర్ణయాలను తీసుకోవడం, కార్యక్రమాలను అమలు చేయడంతో వ్యాధినిరోధక చర్యలు సత్ఫలితాలను సాధిస్తాయన్నారు. అలాగే ఈ సదస్సు ద్వారా అనేక సంస్థల భాగస్వామ్యంతో కమ్యూనిటీ పరంగా సరైన ఆరోగ్య చైతన్యాన్ని తీసుకు వచ్చేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.