వర్జీనియా, వాషింగ్టన్ డీసీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు అమెరికాలోని వర్జీనియాలో ఉత్సాహంగా జరిగాయి. రెండురోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ,రాజకీయ ప్రముఖలతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన సావనీర్ ను అతిథులు ఆవిష్కరించారు.
గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ను విజయవంతంగా నడిపిస్తున్న డోనర్లను ప్రత్యేకంగా అభినందించిన నిర్వాహకులు వారి సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐకమత్యంతో ఉండాలని కోరారు. వివిధ ప్రాంతాల సభ్యులను ఒకచోట చేర్చి సహకార స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమన్నారు. మున్నూరుకాపు కుటుంబాలను అనుసంధానించి, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రోత్సహించడమే సంఘం ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాసభలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్లలో ఒకటిగా ఉన్న వేదిక్ మ్యాథ్య్ యాప్ యాజమాన్యానికి గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. క్లిష్టమైన గణిత సమస్యలకు గత కొన్నేళ్ళుగా వేదిక్ మ్యాథ్స్ యాప్ చక్కని పరిష్కారాలు చూపిస్తూ ఆదరణ పొందింది. ఇదిలా ఉంటే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ గాయనీగాయకులు ఆలపించిన తెలంగాణ జానపదాల పాటలు అందరినీ ఉర్రూతలూగించాయి.