చరిత్రకారుడు నశీర్ అహమ్మద్ కు ” జ్ఞాన జ్యోతి ” పురస్కారం

ప్రముఖ చరిత్రకారుడు, బహుగ్రంధ రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ కు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ” జ్ఞాన జ్యోతి ” పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రతి ఏటా ప్రకటించే ఈ పురస్కారం 2021 ఏడాదికి నశీర్ అహమ్మద్ కు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ముస్లిం యోధుల మహత్తర పాత్రను వివరిస్తూ ఇంత వరకు నశీర్ 23 పరిశోధనాత్మక గ్రంధాలు రాసి ప్రచురించారని ఆయన చెప్పారు. ఈ గ్రంథాలలో కొన్ని ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం భాషల్లో అనువాదమయ్యాయిని, మరికొన్ని భాషల్లో వెలువడనున్నాయి ఆయన పేర్కొన్నారు. చరిత్రకారులు నశీర్ కేవలం గ్రంథ రచన చేసి సరిపెట్టు కోవడం మాత్రమే కాకుండా విస్మరణకు గురైన స్వాతంత్ర్య సమర యోధుల సాహసోపేత చరిత్రలను ప్రజలకు పరిచయం చేస్తూ గత 23 ఎండ్లుగా వేలాది ప్రసంగాలు చేస్తున్నారని, దేశం అంతటా ప్రదర్శనలు నిర్వహిస్తు వివిధ రకాల ప్రచార కార్యక్రమములు దేశం అంతటా చేపడుతున్నారని ఆయన వివరించారు.
ఈమేరకు రచన, ప్రచురణ, పంపిణీ, ప్రచారం నశీర్ గ్రంథ రచన, ప్రచురణ వ్యాపార దృష్టితో కాకుండా కుటుంబం, మిత్రులు, వదాన్యుల సహకారంతో పుస్తక ప్రచురణ చేసి ఎంపిక చేసిన గ్రంధాలయాలు, సంస్థలు, వ్యక్తులకు వితరణశీలుర చిరుకానుకగా వేలాది గ్రంథాలను పంపిణీ చేస్తున్నారని చలపాక పేర్కొన్నారు. జాతీయంగా – అంతర్జాతీయంగా చరిత్ర పండితుల ప్రశంసలు అందుకుంటున్న తెలుగు రచయిత, సుప్రసిద్ధ పరిశోధకుడు, చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ ను “జ్ఞాన జ్యోతి” పురస్కారంతో తమ ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ నెల 15 సాయంత్రం విజయవాడ లోని ఠాగూరు గ్రంధాలయంలో జరుగు కార్యక్రమంలో అధికార – అనధికార ప్రముఖుల సమక్షంలో నశీర్ అహమ్మద్ కు ” జ్ఞాన జ్యోతి ” అవార్డు క్రింద మూడు వేల రూపాయల నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపిక, దుస్సాలువతో ఘనంగా సత్కరించడం జరుగుతుందని చలపాక ప్రకాష్ వెల్లడించారు.

Leave a Reply