పెదకొండూరు శ్రీ కనక పుట్లమ్మ ఆలయంలో మంత్రి లోకేష్ పూజలు
దుగ్గిరాల: శ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనక పుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో లోకేష్ మాట్లాడుతూ… అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని అన్నారు. నియోజక ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు.