– చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి
అమరావతి: దేశంలోను, రాష్ట్రంలోను గ్రామీణ ఉపాధిలో వ్యవసాయం తర్వాత రెండో స్థానంలో చేనేత రంగం ఉంది.. రాష్ట్ర ఆర్థిక.. సాంస్కృతిక గుర్తింపును నిలబెట్టడంలో చేనేత రంగానిదే కీలక పాత్ర.. నేతన్నల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూనే… చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలపై మంత్రి శుక్రవారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే..
రాష్ట్రంలో 1,036 చేనేత సహకార సంఘాలున్నాయి… ఆ సంఘాల్లో 89 వేల మగ్గం నేత కార్మికులు ఉన్నారు.
సంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతన్నలకు ఆర్థికవృద్ధి కలిగేలా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచారు. వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో వేలాది మంది కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుంది. ఆప్కో కు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు (పీహెచ్‌డబ్ల్యుసీఎస్‌లు) కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ఛార్జీల పెంపు వర్తిస్తుంది.
బ్లీచింగ్ ఛార్జీలను బండిల్‌కు రూ.129 నుంచి రూ.148లకు పెంచాం… 15 % పెరిగింది… డైయింగ్ ఛార్జీలను బండిల్‌కు రూ.362 నుంచి రూ.434లకు పెంపు -20 % పెరిగింది… బెడ్‌షీట్ నేత మజూరి రూ.83 నుంచి రూ.100లకు పెంపు . 20% పెరిగింది… టవల్ నేత మజూరి రూ.31 నుంచి రూ.40లకు పెంచడం జరిగింది. – 30% పెరిగింది… ఒక్కో నేతన్నకు నెలకు అదనంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల ఆదాయం రానుంది. వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసా కలుగుతుంది… వేతనాలు, ఛార్జీల పెందపులతో నేతన్నల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది…
రూ.7 కోట్ల చేనేత ఉత్పత్తుల సేకరణ లక్ష్యం-షెడ్యూల్ రూపకల్పన
1976లో ఆప్కో స్థాపించినప్పటి నుంచి చేనేత కార్మికులకు అండగా ఉంటోంది… 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆప్కో ద్వారా రూ.6 నుంచి రూ.7 కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చేనేత ఉత్పత్తుల సేకరణకు 3 షెడ్యూళ్లను రూపొందించాం… ఒక్కో షెడ్యూల్ కాలపరిమితి 4 నెలలు. జూన్ 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు నాలుగు నెలల కాలానికి మొదటి దశగా గుర్తించాం. ఆప్కో, లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (ఐఐఎం-వి)తో ఒప్పందం చేసుకున్నాం.
ఈ ఒప్పందం ప్రకారం… ఆప్కో, లేపాక్షిలో జవాబుదారీతనం, పారదర్శకతను బలోపేతం చేయడం, లాభాల బాటలో పయనించేలా చేయడం ప్రధాన లక్ష్యం. పబ్లిక్-ప్రైవేటు- పార్టనర్ షిప్(పీపీపీ) మోడల్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి షోరూమ్ లను ఏర్పాటు చేయబోతున్నాం.
చేనేత, హస్తకళల నూతన డిజైన్ల పోటీలు…
రాష్ట్రంలోని నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నాం… నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఐడి-ఏపీ) సహకారంతో ఆప్కో, లేపాక్షి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు నూతన డిజైన్లను కళాకారుల నుంచి స్వీకరిస్తున్నాం. పలు కేటగిరీల్లో ఉత్తమ డిజైన్లను ఎంపిక చేసి విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నాం.