– సీజీఎఫ్ నిధులు పారదర్శకంగా వినియోగం
– రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెంపుల్ టూరిజాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎండోమెంటు డిపార్టుమెంటు అధికారులు ప్రధానంగా ఈ అంశంపైనే ఫోకస్ పెట్టాల్సిన అనివార్యత ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ఆషాఢ బోనాలు ఈ దఫా వరంగల్ భద్రాకాళి టెంపుల్ లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి పండగను, సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నదే తమ ఉద్దేశమన్నారు. మన రాష్ట్ర ప్రజలను ధార్మిక చింతన వైపు తీసుకెళ్ళడంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పారు. దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సీజీఎఫ్ నిధులను పారదర్శకంగా వినియోగించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం ఎండోమెంటు డిపార్టుమెంటు సీజీఎఫ్ కమిటీ మీటింగ్ జరిగింది.
ఈ సమావేశం మంత్రి సురేఖ నేతృత్వంలో జరగ్గా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర ఉన్నతాధికారులు, ఈఓలు, సీజీఎఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అధికారు కృషి అవసరం
రాష్ట్రంలో చిన్న దేవాలయాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి ఈవోలు, ఆ శాఖ ఉన్నతాధికారుల కృషి అనివార్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. సీజీఎఫ్ లో భాగంగా, చిన్న దేవాలయాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులపై మంత్రి సురేఖకు అధికారులు వివరించారు. బడ్జెట్ అనుమతులు, సీజీఎఫ్ నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తుల మీద అధికారులతో మంత్రి సమగ్రంగా చర్చించారు. సమావేశంలో రూ. 72.47 కోట్ల విలువైన, మొత్తం 297 వర్కులు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఈవో పాటించాలని పేర్కొన్నారు. సీజీఎఫ్ పనులపై క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం సరికాదన్నారు. సీజీఎఫ్ పనుల మీద రెండు రెండు సార్లు పనుల ప్రపోజల్స్ తమకు పంపకూడదన్నారు. ఏదీ ఉన్న తమకు ఒకే సందర్భంలో తెలపాలన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎస్టిమేషన్స్ ఎంత వస్తే అంత తమకు పంపకూడదని, వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సరైన విధంగా అంచనాలు వేయాలని సూచించారు. ఈఓలు ఫీల్డ్ లో సమగ్రంగా పరిశీలించి తగిన మేరకు అంచనాలు రూపొందించాలన్నారు.
టెంపుల్ టూరిజం సర్క్యూట్లపై కసరత్తు
ఇక రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాల అభివృద్ధి, ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళికతో ముందుకెళ్ళాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెంపుల్ టూరిజం సర్క్యూట్లపై మరింత కసరత్తు చేయాలన్నారు. ఒక జిల్లాలోని మూడు ప్రధాన ఆలయాలను కలిపి ఒక సర్య్కూట్గా ప్రణాళికలను రూపొంది వెళ్తున్నామని, ఈ ప్రక్రియ మూడు విడతలుగా చేయాల్సి ఉంటుందన్నారు. ప్రముఖ ఆలయాలకు భక్తులు, పర్యాటకులను తీసుకెళ్లడంతో పాటు మార్గం మధ్యలో ఉన్న సందర్శక ప్రాంతాలు తిలకించేలా రూపొందిస్తున్నామన్నారు.