Suryaa.co.in

National Telangana

పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తం సీఆర్పీఎఫ్!

– బలగాల త్యాగాలు, సేవలను మరువలేం
– ఉగ్రవాద, మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పాత్ర కీలకం
– అత్యాధునిక ఆయుధాలను అందిస్తాం
– జంషేడ్ పూర్ లో సీఆర్పీఎఫ్ నూతన భవనాల ప్రారంభోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

జంషేడ్ పూర్: జమ్మూ కాశ్మీర్‌ సహా దేశంలోని ఉగ్రవాదం, వేర్పాటువాదం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదంతోపాటు మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్ బలగాలు చూపుతున్న తెగువ అద్బుతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలోని అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఆర్పీఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను వెలకట్టలేనివని అభివర్ణించారు.

రాంచిలోని బిర్సాముండా శుక్రవారం విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి నుండి బీఎస్‌ఎఫ్‌ హెలికాప్టర్ (ఎంఐ-17) లో జంషేడ్ పూర్ వెళ్లారు. విప్లవ వీరుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి సీఆర్పీఎఫ్ కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్ నూతనంగా నిర్మించిన పలు సీఆర్పీఎఫ్ భవనాలను ప్రారంభించారు. అందులో 480 టైప్-2 మరియు 24 టైప్-3 కుటుంబ నివాస గృహాలు, 20 పడకల ఆసుపత్రి, స్టోర్ బిల్డింగ్, ట్రేడ్స్‌మెన్ షాప్, 180 మందికి గల మెన్ బ్యారక్ లు ఉన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎంపీ విద్యుత్ బరణ్ మహతో, అదనపు డీజీ అమిత్ కుమార్, ఐపీఎస్ అధికారులు శాలినీ, సాకేత్ కుమార్ తోపాటు పలువురు పోలీసు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైనవారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ పారామిలిటరీ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఒకటి. జంషెడ్ పూర్ లోని సీఆర్పీఎఫ్ కేంద్ర నూతన భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు అందిస్తున్న సేవలు, త్యాగం అమూల్యమైనవి. దేశంలో అనేక విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న సంస్థ సీఆర్పీఎఫ్ అని మంత్రి పేర్కొన్నారు.

సీఆర్పీఎఫ్ బలగాల నిష్కల్మషమైన నిబద్ధత, నిస్వార్థ సేవ ప్రశంసనీయం. సీఆర్పీఎఫ్ బలగాల అచంచల ధైర్యం, సహనం, వృత్తిపరమైన నైపుణ్యం వంటి అంశాలే దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ కు ప్రశంసలు పొందేలా చేశాయి. సీఆర్పీఎఫ్ వీర జవాన్ల ధైర్య సాహసాలను, మాతృభూమి కోసం చేసే త్యాగాలను స్మరించకుండా ఉండలేమన్నారు.

సి.ఆర్.పీ.ఎఫ్. జవాన్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ భద్రత కోసం, ప్రత్యేకించి తీవ్రమైన దుర్భర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ మాతృభూమికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారి సేవలను ద్రుష్టిలో ఉంచుకుని జవాన్లకు, అధికారులకు వారి కుటుంబాలతో నివసించేందుకు వీలుగా గృహ నిర్మాణాల్ని నిర్మిస్తున్నాం. ఈ గ్రుహ నిర్మాణాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే జంషేడ్ పూర్ లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ కేంద్రంలో 165 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన 480 టైప్-2, 24 టైప్-3 కుటుంబ ఆవాసాలతోపాటు భండార్ భవనం, ట్రేడ్స్‌మెన్ షాప్, 20 బెడ్ల ఆసుపత్రి, అధికారుల మెస్, 180 మందికి సరిపడా మెయిన్ బ్యారక్ లను నిర్మించడంతోపాటు నా చేతుల ద్వారా వాటిని ప్రారంభించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులు తమ కుటుంబాలను సురక్షిత వాతావరణంలో ఉంచి, పిల్లలకు మంచి విద్య అందించడంలో వీలు కల్పించి, ఎటువంటి ఆందోళన లేకుండా దేశ సేవలో మునిగిపోవడానికి ఈ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE