Suryaa.co.in

Telangana

మొహర్రం కు నిధులు విడుదల చేయాలి

– కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పైసా నిధులివ్వలేదు
– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం కు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం 2023లో మొహర్రం నిర్వహణకు నిధులు విడుదల చేసిందని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు.

మొహర్రం కు ఏనుగుపై ఊరేగింపు తీయడం షియా ముస్లింల సంప్రదాయమని గుర్తు చేశారు. 2024లో ఏనుగుపై ఊరేగింపు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని.. ఇది షియా ముస్లింల మనసులను గాయపరిచిందని వివరించారు. ప్రభుత్వం ఈసారి ఇలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా మొహర్రం ను నిర్వహించిందో కాంగ్రెస్ ప్రభుత్వం అంతే వైభవంగా మోహర్రం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందిస్తూ నిధుల విడుదల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, మోహర్రం ను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE