– ఉన్నత విద్యారంగానికి బడ్జెట్లో రూ.23 26 కోట్లు
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.
రామచంద్రపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ, ఉన్నత విద్యకు బడ్జెట్లో రూ.2,326 కోట్లు కేటాయించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురంలో చింతపల్లి సూరన్న నగర్ లోని శ్రీమతి ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ను మంత్రి సుభాష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ హైస్కూల్ ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పరిశీలించి, ఆహారాన్ని తిని రుచి చూశారు.
ఈ సందర్భంగా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాబోధన ఉండాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అన్నారు. ముఖ్యంగా హైస్కూల్లో పచ్చదనం,పరిశుభ్రత, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులకు సత్పరివర్తన, మంచి అలవాట్లు వచ్చేలా ఉపాధ్యాయులంతా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్ వారి తల్లిదండ్రులకు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణానికి, వంటశాల ఆధునీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యా సంవత్సరంలో 75% హాజరు ఉన్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలవుతుందని అన్నారు.
విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా, వారి మానసిక ఉల్లాసానికి వ్యాయామం, ధ్యానం, మానసిక ప్రశాంతత దిశగా విద్యాబోధన ఉండాలన్నారు. సమాజం పట్ల విద్యార్థులు సత్ ప్రవర్తన, బాధ్యతతో మెలిగేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన, వారి తల్లిదండ్రుల పైన ఉందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను మంత్రి సుభాష్ సమస్యలు అడిగి, వారితో సంభాషించారు. విద్యా పరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు.