మాజీ వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి
హైదరాబాద్: విద్యావంతులైన యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడం పై నేడు మనందరం దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డి సూచించారు. లేకపోతే భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండకపోవడం వల్లనే రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారని.. ఆ సంక్షోభ నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిష్కారాలు సూచించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండు రోజులపాటు నిర్వహించిన వజ్రోత్సవ ఉత్సవాల ధన్యవాదాల సమావేశం రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా డాక్టర్ రఘువీరారెడ్డి హాజరై ప్రసంగించారు. 50 ఏళ్ల క్రితం తాను ఇదే విశ్వవిద్యాలయంలో BSC లో చేరుదామనుకున్నప్పటికీ, ఇంటర్ మార్కులు తక్కువ రావడం వల్ల చదవలేకపోయానని కానీ తర్వాత సుమారు 11 సంవత్సరాలు పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా రైతాంగానికి సేవలు అందించే అవకాశం చిక్కిందన్నారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకువచ్చామన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంశాలకి సంబంధించి తాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక ఇస్తానని.. హామీ ఇచ్చారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అత్యున్నత స్థానాలకి ఎదిగినప్పుడు, రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కలుగుతాయని రఘువీరారెడ్డి అన్నారు.
2004 – 2014 మధ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక వెలుగు వెలిగిందని తర్వాత ఆ వెలుగులు మసక బారిపోయాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్) హర్కర వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తమ ప్రభుత్వానికి వ్యవసాయం, విద్య అత్యంత ప్రాధాన్యత అంశాలు అన్నారు. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపకులపతుల నియామకాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశామన్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ పురోగతి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హర్కర వేణుగోపాల్ స్పష్టం చేశారు. అందరి సహకారంతో వజ్రోత్సవ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. గత చరిత్రని స్మరించుకుంటూ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు ఈ వజ్రోత్సవాలు ఉపకరిస్తాయన్నారు.
అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ఉపకులపతులు, పూర్వ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కృషితో విశ్వవిద్యాలయ అభివృద్ధికి పాటుపడతానని అల్దాస్ జానయ్య హామీ ఇచ్చారు. వజ్రోత్సవాలు తమకు స్ఫూర్తినిచ్చాయని బోధన, బోధనేతల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.