Suryaa.co.in

Telangana

ఫ్రశ్నపత్రాలు బజార్లో.. పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం

ఇదేనా దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్
బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ చేయడమేనా బంగారు తెలంగాణ అంటే
30 శాతం కమీషన్లు తీసుకునే ప్రభుత్వం అవసరమా
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
– జేఏసీ అంటే జానా యాక్షన్ కమిటీ
– తెలంగాణ రావడానికి ప్రధాన కారణం జైపాల్ రెడ్డి
– దొరగారి సారాలో సోడా పోసేవారు ఈ జిల్లా నుంచి మంత్రి అయిండు
– 30 శాతం కమీషన్ తీసుకునే సర్కారు మనకు అవసరమా?
కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితుంటే.. నిరుద్యోగులు అడ్డా మీద కూలీల్లా బతకాల్సిందేనా?
నల్లగొండ నిరుద్యోగ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

“ కేసీఆర్.. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ, కొడుకును టాటాను చేసి నువ్వు చార్లెస్ శోభరాజ్ గా మారడమేనా బంగారు తెలంగాణ? ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో మర్రిగూడ క్రాస్ రోడ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం అక్కడే జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

“ ఈ రోజు ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇంటర్ పరీక్ష పత్రాలను సరిగ్గా దిద్దికుంటే 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు బస్టాండులలో, జీరాక్స్ సెంటర్లలో దొరుకుతున్నాయి. లక్షలాది బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నపత్రాలను వందలాది కోట్లకు కేసీఆర్, అతని కుటుంబం అమ్ముకుంది. తెలంగాణలో పరీక్షలు రాయించలేని స్థితిలో రాష్ట్రంలోని ప్రభుత్వం ఉంది. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఇదేనా కేసీఆర్ దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్? ” అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నల్లగొండ జిల్లా అంటే రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, పాల్వాయి, ఆరుట్ల కమలాదేవి, చకిలం శ్రీనివాసరావు లాంటి నాయకులు గుర్తొస్తారు. బండినక బండి కట్టి అని నైజాం సర్కారు దుర్మార్గాలను ప్రశ్నించిన బండి యాదగిరిది ఈ జిల్లా బిడ్డే. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ఈ నల్లగొండ బిడ్డ అని రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న తర్వాత కేసీఆర్, ఇంకా నేను ఉద్యమం చేయలేను చేతులెత్తేసి అండ కోసం జానారెడ్డి ఇంటికొచ్చి 7-8 గంటలు చర్చలు జరిపింది నిజం కదా అని రేవంత్ ప్రశ్నించారు. అనాటి చర్చల ఫలితంగావే జేఏసీ పుట్టుకొచ్చిందన్నారు. దొరగారు వస్తే జెండాలు కట్టింది మనం, రాష్ట్రం ఏర్పాటు అవుతుంటే ప్రాణాలు తీసుకుంది మనమని ఆయన వ్యాఖ్యానించారు. జేఏసీ అంటే జానా యాక్షన్ కమిటీ అని ఇక్కడి ప్రజలకి నేను గుర్తు చేయదలచుకున్న అన్నారు.

ఉద్యమ సమయంలో పదవులను ఎడమ కాలి చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నాడు. కానీ ఆ సన్నాసి తాను రాజీనామా చేసిన స్థానంలో సెలక్షన్లు, కలెక్షన్లు అంటూ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు అని కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1969 తెలంగాణ ఉద్యమంలో మంత్రిపదవికి రాజీనామా చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ..మలి దశ ఉద్యమంలో అటువంటి త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రేవంత్ అన్నారు. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి వ్యూహంతోనే తెలంగాణ వచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో రాసిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి ఈ జిల్లాలో చదువుకున్నారు. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పని చేశారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.

అలాంటి నేతలు ఉన్న నల్లగొండలో ఇప్పుడు ఎలాంటి నాయకులను చూస్తున్నాం? దొరగారి సారాలో సోడా పోసేవారు ఈ జిల్లా నుంచి మంత్రి అయిండు. నల్లగొండ జిల్లాకు గౌరవం ఉంటుందా…నల్లగొండ జిల్లాలో ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. జానారెడ్డి లాంటి పెద్దలను ఓడించారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ మందులోకి సోడా పోసే వాడిని గెలిపించారని, ఇది నల్లగొండ జిల్లాకు గౌరవమా..? అని ప్రశ్నించారు. ఇక్కడి నకిరేకల్, మిర్యాలగుడ ఎమ్మేల్యేలు అమ్ముడు పోయిన దళారులు అని ఆయన వ్యాఖ్యానించారు. కోదాడ, హుజుర్ నగర్ ఎమ్మేల్యేలు గుంట జాగా కనిపించిన మాయం చేస్తున్నారు. ఇంకోడు ఇసుక దందా. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అంతా ఈ దొంగలే. ఇలాంటి నేతలు అవసరమా నల్లగొండ జిల్లా ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు.

బీఆరెస్ ఎమ్మేల్యేలు దళిత బంధు పథకంలో లంచాలు తీసుకుంటున్నారని మేం చెబితే ఖండించారు. నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ లంచాలు తీసుకున్న వారి చిట్టా తన దగ్గర ఉందన్నారు. ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటుందన్నారు. కర్ణాటక 40 శాతం కమీషన్లు తీసుకుంటున్న బీజేపీ సర్కారును అక్కడి ప్రజలు ఇంటికిపంపేందుకు సిద్ధంగా ఉన్నారు. మరీ 30 శాతం కమీషన్ తీసుకునే సర్కారు మనకు అవసరమా? అని రేవంత్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. అటువంటి తెలంగాణలో పేదలు పెదలుగానే బతకాలా? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “ కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితుంటే.. పేదల బిడ్డలు కుల వృత్తులు చేసుకుని బతకాలా? నిరుద్యోగులు అడ్డా మీద కూలీల్లా బతకాల్సిందేనా? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది” అని రేవంత్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

తెలంగాణలో పరీక్షలు నిర్వహించాల్సిన సీఎం.. పార్టీ విస్తరణ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నారు అని రేవంత్ విమర్శించారు. బీఆరెస్ ఆత్మీయ సమ్మేళనాలు జనతా బార్ లో పర్మిట్ రూమ్ అడ్డాల్లా మారాయి అన్నారు. “ పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే… బీఆరెస్ నేతలు ఆత్మీయ సమ్మేళనలంటూ తాగి చిందులు వేస్తున్నారు. అలాంటి కేసీఆర్ సర్కారును 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి” అని రేవంత్ అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అది జరగాలంటే నల్లగొండలో 12కు 12 గెలిపించాలి. మీరు 12కు 12 గెలిపించండి అని రేవంత్ పిలుపునిచ్చారు. అదే జరిగితే రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిరుద్యోగులకు అండగా నిలవడానికి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ, ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీ మే మొదటివారంలో ఈ గడ్డకు రాబోతున్నారు. సరూర్ నగర్ సభకు వేలాదిగా తరలిరండి. ఆ సభను విజయవంతం చేయాలన్నారు. కొత్త సంవత్సంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రాగానే2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మహాత్మా గాంధీ వర్సిటీ వద్ద అమరులకు నివాళి
నిరుద్యోగుల నిరసన ర్యాలీ ప్రారంభానికి ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమరుల చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తమ సమస్యలపై యూనివర్సిటీ విద్యార్ధులు రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

శ్రీకాంతా చారికి నివాళి
నల్లగొండ నిరుద్యోగ ర్యాలీకి వెళ్తూన్న క్రమంలో ఎల్బీనగర్ లోని మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

LEAVE A RESPONSE