Suryaa.co.in

Editorial

లిక్కర్ వాసుదేవరెడ్డి.. పీఛేముడ్!

  • లిక్కర్ వాసుదేవరెడ్డికి సర్కారు రిలీఫ్

  • రైల్వే శాఖకు సగౌరంగా సాగనంపుతూ ఉత్తర్వులు

  • ఫలించిన వాసుదేవరెడ్డి పైరవీలు

  • భగ్గుమన్న తమ్ముళ్లు

  • రాజీ రాజకీయాలేమిటని ఫైర్

  • జగన్ ఇలాగే చేశాడా అంటూ ప్రశ్నల వర్షం

  • ఏబీని ఎంత వేధించారో గుర్తులేదా అని నిలదీత

  • జగన్ పాటి పట్టుదల ఏదని ఆగ్రహం

  • మొన్న గనుల వెంకటరెడ్డి, ధర్మారెడ్డి, విజయకుమార్‌రెడ్డి

  • ఇప్పుడు వాసుదేవరెడ్డిని వదిలేస్తారా?

  • మా పోరాటాలు, త్యాగాలు ఇందుకోసమేనా?

  • సోషల్‌మీడియాలో పసుపు సైనికుల ఆగ్రహజ్వాల

( మార్తి సుబ్రహ్మణ్యం)

లిక్కర్ వాసుదేవరెడ్డి గుర్తున్నారా? అదేనండి.. జగన్ జమానాలో వేలకోట్లరూపాయల లిక్కర్ స్కాంకు పాల్పడ్డారంటూ కూటమి సర్కారు వేటు వేసిన అధికారి వాసుదేవరెడ్డి. యస్. ఆయనే.. ఈయన! కూటమి వచ్చిన తర్వాత వేటు వేసి, విచారణ నిర్వహిస్తున్న ఏపిఎస్‌బిసీఎల్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని, కూటమి సర్కారు ఎట్టకేలకు ‘ఆయన కోరుకున్నట్లు’ రిలీవ్ చేయడం వివాదంగా మారింది.

2019 ఆగస్టులో రైల్వే శాఖ నుంచి ఏపికి డెప్యుటేషన్‌పై వచ్చిన వాసుదేవరెడ్డికి, గత ఆగస్టు 25తో డెప్యుటేషన్ గడువు ముగిసింది. అయితే ఆయనపై మద్యం కుంభకోణంలో ఈయన ప్రధాన నిందితుడన్న ఆరోపణలు రావడంతో, ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేయలేదు. తర్వాత రైల్వే బోర్డు అంగీకారంతో ఫిబ్రవరి 25 వరకూ డెప్యుటేషన్ పొడిగించింది. మరోసారి డెప్యుటేషన్ పొడిగించేందుకు రైల్వే శాఖ నిరాకరిచడంతో, ఆయనను రిలీవ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ జమానాలో లిక్కర్ వ్యవహారంలో కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలున్న వాసుదేవరెడ్డిపై, విచారణ పూర్తి కాకుండానే ఎలా రిలీవ్ చేశారంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు సోషల్‌మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు.

దానితో వాసుదేవరెడ్డిని తన మాతృశాఖ అయిన రైల్వేకి పంపించటం వివాదంగా మారింది. నిజానికి తనపై ఉన్న కేసులు అలాగే కొనసాగించినప్పటికీ.. తనను రిలీవ్ చేయాలంటూ వాసుదేవరెడ్డి.. ఇదే కేసులో చక్రం తిప్పిన కసిరెడ్డి ద్వారా లాబీయింగ్ చేస్తున్నారన్న చర్చ- దానివెనుక జరుగుతున్న తెరవెనుక కథలపై చాలాకాలం నుంచి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు వాసుదేవరెడ్డి, ఆయన సమీప బంధువు టీడీపీలోకి కీలక వ్యక్తులతో రాయబారం పంపిస్తున్నారన్న ప్రచారం కూడా బహిరంగంగానే జరుగుతోంది.

ఈ క్రమంలో వాటిని నిజం చేస్తూ.. వాసుదేవరెడ్డిని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత టీటీడీ ఏఈఓగా చేసిన ధర్మారెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, గనులు కొల్లగొట్టిన వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోకుండా.. ఇలాగే సగౌరవంగా సాగనంపిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌లో ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసుదేవరెడ్డిని కూడా.. అంతే సాదరంగా సాగనంపడాన్ని కార్యకర్తలు, సోషల్‌మీడియా సైనికులు సహించలేకపోతున్నారు.

దానితో వారు పార్టీలో-ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? మా త్యాగాలకు అర్ధం ఏమిటి? వీళ్లను వదిలేస్తున్నారంటే ఏం అర్ధం చేసుకోవాలి? ప్రజల్లోకి ఎన్ని తప్పుడు సంకేతాలు వెళతాయి? ఇలాంటి అవినీతిపరులను వదిలేసే మీరు ఇక ఎవరిని శిక్షిస్తారు? ఎన్నికల ముందు మీరు చేసిన ఆరోపణలలో నిజాయితీ ఏముంది? అంటూ పోస్టులతో విరుచుకుపడుతున్నారు.

‘‘ జగన్ జమానాలో ఎలాంటి తప్పు చేయకపోయినా మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఐదేళ్లు సస్పెండ్ చేసిన జగన్ ఎలాంటి రాజీ పడలేదు. చాలా కఠినంగా వ్యవహరించారు. ఏబీ కూడా ఎవరి కాళ్లు పట్టుకోకుండా న్యాయపోరాటం చేశారు. టీడీపీ ముద్ర ఉన్న అధికారులందరినీ జగన్ దూరం పెట్టారు. ఎవరు చెప్పినా వినలేదు. మరి అలాంటి పట్టుదల మన పార్టీ నాయకత్వానికి ఏదీ? ఏమిటీ రాజీ రాజకీయాలు? ఇలాగైతే కొత్త తరం కార్యకర్తలు భవిష్యత్తులో పార్టీ జెండా మోసేందుకు, స్థానికంగా ప్రత్యర్ధులతో పోరాడేందుకు ముందుకు వస్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకీ రాజీ రాజకీయాలు? వీటిని చూసే కార్యకర్తలకు జగనే మొనగాడు అన్న భావన రాదా?’’ అంటూ సుదీర్ఘ పోస్టింగులు పెడుతున్నారు.

కేంద్రంలో చక్రం తిప్పుతున్న మనకు అక్కడి నుంచి డెప్యుటేషన్‌పై వచ్చిన ఇలాంటి వారిని ఇక్కడే ఉంచే శక్తి లేదా? మనసుంటే మార్గం లేదా? అన్ని విషయాల్లో ఇలాగే వ్యవహరిస్తున్నారా అని మరికొందరు నిప్పులు చెరుగుతున్నారు.

LEAVE A RESPONSE