Suryaa.co.in

Andhra Pradesh

క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి: డా.జాన్ వెస్లీ

అమరావతి,3మార్చి: రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు డా.జాన్ వెస్లీ స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లి లోని ఆ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమ శాఖ ఎండి డా.జిసి కిషోర్ కుమార్ తో కలిసి ఆసంస్థ డైరెక్టర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎపిఎస్సిఎఫ్సి అధ్యక్షులు డా.జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీలకు అమలు చేస్తున్న వివిధ పధకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగు పరచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా పాస్టర్లకు ప్రభుత్వం అందిస్తున్న పారితోషికంపై అందరిలోను అవగాహన పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు పెన్షన్ పొందుతున్న పాస్టర్లకు అదనంగా మరో 4వేల మంది పెన్షకు ఎంపికయ్యారని చెప్పారు.

అదే విధంగా జగనన్న విద్యా దీవెన పథకం కింద 35 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సంస్థ ద్వారా స్పాన్సర్ చేశామని చైర్మన్ డా.వెస్లీ పేర్కొన్నారు.కొత్తగా వివాహాలు చేసుకునే జంటలకు ప్రభుత్వం కణ్యామస్తు పధకం క్రింద అందిస్తున్న ప్రోత్సాహం పై మరింత అవగాహన పెంపొందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారులను ఆయన ఆదేశించారు.అంతేగాక ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో మరింత మంది జెరూసలేం యాత్రకు వెళ్ళే విధంగా ప్రోత్సాహించాలని చెప్పారు.జెరూసలేం యాత్రకు వెళ్లిన యాత్రికులు సురక్షితంగా తిరిగి రావాలని డా.వెస్లీ ఆకాంక్షించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి అమలు చేస్తున్న వివిధ పధకాలపై ప్రత్యేకంగా ఒక కరపత్రాన్ని ముద్రించి అన్ని జిల్లాల్లో క్రిస్టియన్ మైనార్టీల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సంస్థ ఎండి డా.కిషోర్ కుమార్ ను ఆయన కోరారు.కార్పొరేషన్ ద్వారా తగిన తోడ్పాటును అందించడం జరుగు తుందన్నారు.ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీలు సాధికారతకు జిల్లా స్థాయిలో అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని డా.జాన్ వెస్లీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు మరియు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి డా.జిసి.కిషోర్ కుమార్, డైరెక్టర్లు పి.జగదీశ్, జె.ఆనందబాబు, సుందర్ రాజు, సిహెచ్. మనోరంజని, వై.నలిని, కె.అనిత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE