రీ సర్వే సరే…నీ బొమ్మ ఎందుకు?

-జగన్మోహన్ రెడ్డి ఏమైనా జాతీయ నాయకుడా? దేశాన్ని ఏమైనా ఉద్ధరించాడా?
-హృదయము లేని గాడిదలను చూసి ప్రజలు అసహ్యించుకుంటారు
-మీరు ఎంతైనా మొరగండి కానీ కరిచే ప్రయత్నం చేస్తే పల్లూడి పోతాయి జాగ్రత్త
-అల్లర్లతో రైతులపాదయాత్రను అడ్డుకోవాలనుకుంటే…రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖాయం
-నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు

న్యాయస్థానం అనుమతితో శాంతియుతంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అల్లర్ల ద్వారా అడ్డుకోవాలని చూస్తే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. రాష్ట్రంలో భూములను రీ సర్వే చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై రఘురామకృష్ణం రాజు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

రీ సర్వే ఎవరు కోరుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రీ సర్వే ద్వారా ఎక్కువ భూములు ఉన్న వారి వద్ద నుంచి భూములను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు ఈ పథకాన్ని వేసి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. రీసర్వే సరే కానీ, ప్రజల భూములకు సంబంధించిన పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడం ఎందుకు అంటూ ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ఏమైనా జాతీయ నాయకుడా అంటూ ప్రశ్నించిన ఆయన, దేశాన్ని ఏమైనా ఉద్ధరించాడా అంటూ నిలదీశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అని, 20 24 లో మరొకరు ముఖ్యమంత్రి కావచ్చు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తనకు తాత, తండ్రుల నుంచి సంక్రమించిన భూముల పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడాన్ని తాను ససేమిరా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు.

అమరావతి రైతుల పాదయాత్ర ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక దాడులకు దిగితే పోలీసు వ్యవస్థపై, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఈ దాడులను స్టేట్ స్పాన్సర్డ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పాన్సర్డ్ దాడులు గానే ప్రజలు పరిగణిస్తారన్నారు . కాబట్టి పిచ్చి ప్రయత్నాలను మానుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించాలని మీరు కోరుకుంటే, పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాన్ని చేయాలంటూ సూచించారు.

రాష్ట్రంలో రైతులు చేస్తున్న పాదయాత్రను న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి భవన్ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉన్నాయని, రైతుల పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు కలిగించిన తమ ప్రభుత్వానికి తిప్పలు తప్పవన్నారు. అమరావతి రైతుల పాదయాత్రగుంటూరు, కృష్ణాజిల్లాలలో అద్భుతంగా కొనసాగిందని, ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ, కృష్ణాజిల్లా గుడివాడ లోను రైతుల పాదయాత్రకు ఆటంకాలు కలిగించాలని చూశారని పేర్కొన్నారు.

అయినా రైతు పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పారు. ఆదివారం భీమడోలు రైతు పాదయాత్ర అద్భుతంగా సాగిందని, తాడేపల్లిగూడెం లోను రైతు పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు స్థానికులు చేస్తున్నారన్నారు. రైతుల బాధలు చూసి ప్రజలు చెలించిపోతున్నారని, హృదయము లేని గాడిదలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో వికేంద్రీకరణ గురించి ఎన్ని వార్తలు రాసుకున్నా, ఎంపీలు మోర్గాని భరత్ రామ్, వంగా గీత, మంత్రి దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణతో వికేంద్రీకరణ గురించి మాట్లాడించినంత మాత్రాన అవి మీ మాటలేనని ప్రజలందరికీ తెలుసునని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మీరు ఎంతైనా మొరగండి కానీ కరిచే ప్రయత్నం చేస్తే పల్లూడి పోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

మంత్రులు మాట్లాడొద్దు… మాట్లాడేవారు బుద్ధిలేని వారై ఉంటారు
మంత్రివర్గం ఆమోదించిన రాజధానిని హైకోర్టు తిరస్కరించిన తర్వాత, తిరిగి సుప్రీంకోర్టులో స్టే కూడా రాలేదని, కేసు అసలు లిస్టే కాలేదని అటువంటప్పుడు మంత్రులు మాట్లాడకూడదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మాట్లాడేవారు బుద్ధి జ్ఞానం లేని వారై ఉండాలి అని విమర్శించారు. మంత్రులు అంటే పాలకులని, న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినప్పుడు, ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఏకచిత్ర నటుడు, ఎంపీ మోర్గాని భరత్ మాట్లాడవచ్చునని, కానీ మంత్రులు నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు. రేపు ఒకవేళ కోర్టు ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధం లేదని అంటారని, మంత్రులు మాత్రం చిక్కుల్లో పడవలసి వస్తుందని హెచ్చరించారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కుహనా మేధావులకు రెండు గంటలు ప్రయాణం చేసి చేరుకునే అమరావతిలో కాకుండా, కర్నూల్లో హైకోర్టు కావాలట… విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉండాలట అంటూ ఎద్దేవా చేశారు.

మూడు రాజధానుల కాన్సెప్ట్ అద్భుతం… కానీ ఏ రాష్ట్రంలో లేదు
మూడు రాజధానుల కాన్సెప్ట్ అద్భుతమని, కానీ దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ విధానం అమలులో లేదని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఒక్క దక్షిణాఫ్రికా దేశంలో మాత్రమే మూడు రాజధానుల విధానం అమల్లో ఉన్నదని, ఆ దేశంలోనూ ఇప్పుడు ఒకే రాజధానిని కోరుకుంటున్నారని చెప్పారు.
మూడు ప్రాంతాలు కలిసి ఒక దేశంగా ఏర్పడినప్పుడు మూడు రాజధానుల విధానాన్ని దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టారన్న ఆయన, అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా దేశాలలో కూడా ఒకే రాజధాని విధానం అమల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశానికి ప్రధానమంత్రి అయితే దక్షిణాది ప్రాంతానికి దేశ రాజధానిగా విశాఖపట్నం, ఉత్తరాది ప్రాంతానికి ఢిల్లీని రాజధానిగా కొనసాగిస్తారేమోనని అంటూ అపహాస్యం చేశారు.

వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపితే… అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు
పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అవకతవకలు అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఏప్రిల్ 15వ తేదీన తాను ఒక లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తాను రాసిన లేఖకు సెప్టెంబర్ 28 కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుంచి సమాధానంగా తనకు ఒక లేఖ అందినట్లు తెలిపారు . పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వాన్నిసమాధానం కోరామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇవని ఆ లేఖలో పేర్కొన్నారు.

తాను కేంద్ర ప్రభుత్వాన్ని విచారించమని కోరగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్నే సమాధానం అడగడం… రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలను చెప్పి, తప్పించుకునే ప్రయత్నాన్ని చేసిందని విమర్శించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ( డి బి టి ) విధానము ద్వారా లబ్ధిదారులకు నగదును బదిలీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్న విషయాన్ని తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. కిలోకు 12 నుంచి 15 రూపాయల చొప్పున నగదును నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తామని, టీబీటీ విధానానికి పైలెట్ ప్రాజెక్టులుగా గాజువాక, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసినట్లు ఆయన గతంలో ప్రకటించారని తాను తెలియజేశానని అన్నారు.

అయితే డిబిటి విధానాన్ని గతంలో అమలు చేద్దామని అనుకున్నామని, కానీ ఇప్పుడు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి నివేదించిందని తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినట్లు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసిందని చెప్పారు. అయితే ఈ విధానం పెద్ద కుంభకోణం అని ప్రజలు తిప్పి కొట్టడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం తోక ముడిచిన విషయాన్ని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.

ఇక నేరుగా ఇంటి ఇంటికి పౌర సరఫరాల శాఖ ద్వారా సరుకులను సరఫరా చేస్తామని చెప్పి, సరఫరా చేయడం లేదని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తాను తీసుకురాగా, ఈ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలనే చెప్పిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీలను గుర్తించి వారికి సబ్సిడీపై వాహనాలను సమకూర్చి, ఇంటింటికి సరుకులను సరఫరా చేస్తున్నామని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఇంటింటికి సరుకులు సరఫరా చేస్తున్నారా?, ఒక వీధిలో వాహనాన్ని నిలిపి అక్కడికి లబ్ధిదారులను పిలిచి సరుకులను సరఫరా చేస్తున్నారా? అన్నది ప్రజలే చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

గడపగడపకు తమ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు, ఇంటింటికి తిరిగి సరుకులను సరఫరా చేస్తున్నామని చెప్పారట కదా?, దయచేసి ఇంటింటికి సరుకులను సరఫరా చేయమని అడగండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. లేకపోతే వీధుల్లో వాహనాలను నిలిపి సరుకులు సరఫరా చేస్తున్న వీడియోలను తీసి తనకు పంపితే, తాను ప్రధానమంత్రి కార్యాలయానికి వాటిని పంపుతానన్నారు .