ఆ నరుడు నవ్వితే నక్షత్రాలు
చిన్నబోతాయి..
అదే అందమైన మోము
కోపం వచ్చినప్పుడు
మండేసూర్యుడు లా
రుధిరవర్ణం దాలుస్తుంది..
సమాజంలోని మంచిని
వర్ణించే వేళ స్వర్ణహంస వోలె
నర్తించే శేషేంద్రుని కలం
అదే సమాజంలోని అవకరాలపై గొరిల్లా దాడి
చేసి ఎరుపు రంగు
నీరై పారిపోయింది కదా..
మబ్బుల్లో దర్బార్
ఏర్పాటు చేసుకున్న
ఆ కవిసేన మేనిఫెస్టో నుండి
ఎంత రుతుఘోష..
ఎన్నెన్ని ప్రేమలేఖలు..
కాలరేఖ ను అనుసరించి
జనవంశం కోసం
ఆయన సాగించిన రచనలు
కుళ్లిన వర్తమాన సమాజ
నుదుటిపై ఎప్పటికీ
చెరగని రక్తరేఖ లు..
నిరంతరం మండే ఆగ్నిశిఖ లు..!
గుంటూరు శేషేంద్ర శర్మ..
ఆయన రూపం సుందరం
మాట మధురం..
కవిత్వం రసభరితం..
వచనం
ఆధునిక మహాభారతం..
ప్రతి రచనలో శేషేంద్ర ముద్ర
అక్షరం అక్షరంలో అనుక్షణం ఆయన ఆవేదన..
భారతీయ సాహిత్యం
కరతలామలకం..
రుధిరాక్షరమే
నుదుటి తిలకం..
పానపీన ఆహార విహారాల్లో
నిత్యనైమిత్తిక కార్యాచరణ
అక్షరాల వితరణ..
రచనలు సంప్రదాయ..
ఆధునిక తత్వాల మేళవింపు!
ప్రతి రచనలో పరిపుష్టి..
విశ్వమానవ దృష్టి .
సర్వేజనా సుఖినోభవంతు..
అందుకు కవితలే
ఆయన వంతు..
విలక్షణ ఊహ
ఆయన తరహా..
వచనం..పద్యం..
సమాజానికే నైవేద్యం..
కొన్ని రచనలు
శేషేంద్రకే సాధ్యం..!
వచన కవితకు శర్మ తెరిచిన కొత్త వాకిలి..
ఎందరో నవ్య కవుల
విహారానికి లోగిలి..
సంస్కృత..ఆంధ్ర..ఆంగ్ల
భాషల్లో పాండిత్యం..
భారతీయ సాహిత్యంపై
సాధికార పరిచయమే
శేషేంద్రుని సమగ్ర పరిచయం!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286