Suryaa.co.in

Family

ఆనందమె జీవిత మకరందం

ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.
మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ.
“ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు”అంది.
ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?
“ఎందుకు అలా అనిపిస్తోంది?” అని అడిగాను.
“అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని.. కానీ నాకు ఎందుకో సంతోషంగా మాత్రం లేదు” ఆమె జవాబు.
అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.
ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదుకానీ నేను కూడా సంతోషంగా లేను.
వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు.
చివరికి ఒక ఎండోక్రినాలోజిస్ట్ డాక్టరు మితృడు చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది.
ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది.
మీ కోసం ఆ వివరాలు :
మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు.

1. ఎండార్ఫిన్స్.. Endorphins,
2. డోపామిన్.. Dopamine,
3. సెరిటోనిన్.. Serotonin,
4. ఆక్సిటోసిన్.. Oxytocin.
ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది. ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం.

1.Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి.
మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins.
నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడుదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియను నిర్వచిస్తారు.
“నవ్వడం ఒక భోగం – నవ్వలేకపోవడం ఒక రోగం” అన్నారు జంధ్యాల.
ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, కామెడీ వీడియోలు లు చూస్తూ ఉండండి.

2. Dopamine: నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము.
భార్య ను విమర్శించకుండా, అర్థం చేసుకొని, పొగడటం / ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు.
ఆఫీసులో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది.
అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం.
కాబట్టి మమిత్రులారా…
షాపింగ్ బడ్జెట్ పెంచండి.
లేదా..!
పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు లేదు కదా..!

3. Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల అవుతుంది.
మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది.
ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?
1. స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం.
(వాళ్లకి ఆనందం కలగడం కోసం … ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా)
2. మొక్కలు నాటడం..
3. రోడ్ల గుంతలు పూడ్చడం..
4. రక్త దానం..
5. అనాధ ప్రేత సంస్కారం..
6. అనాధలకు సేవ..
7. యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.
8. మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం.
ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది.

4. Oxytocin: ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది.
స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది (ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది)
మున్నా భాయ్ లో ” జాదూ కి జప్పీ” లాగ..!
అలాగే కరచాలనం
సినిమా యాక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే..!
గుర్తుకు తెచ్చుకోండి… మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.
ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది
అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా..!

అందుచేత..మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము.
1. Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి వ్యాయామం చేద్దాము.
2. Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము.
మగవారికి ప్రత్యేకం
– వంటను రోజూ మెచ్చుకోండి.
– డ్రెస్ మెచ్చుకోండి.
– మేకప్ మెచ్చుకోండి.
ఆడవారికి ప్రత్యేకం
-గుర్రు పెట్టారని తిట్టకండి.
– కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి, టొమోటో కూర చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి.
మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి.
3. Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి.
ఏడాదికి ఒక మొక్కను నాటండి.
ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి.
పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి.
4. ఆక్సిటోసిన్ కోసం మీ భార్య/ భర్త ను హగ్ చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు హగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా..!
అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులను కూడా హగ్ చేసుకునే అలవాటు చేసుకోండి.
ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి.
పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం.
1. గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి-Endorphins.
2. వాళ్ళు సాధించిన దానికి పొగడండి-Dopamine.
3. పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి-Serotonin.
4. దగ్గరకు తీసుకోండి-Oxytocin.

– తీగల రవీంద్ర

LEAVE A RESPONSE