నేను హిందువుగా ఉంటేనే ‘నేనేమైనా కావచ్చు’

విజయవాడలో త్రిపురనేని వెంకటేశ్వరరావు అని ఒక పారిశ్రామికవేత్త ( స్పార్ టెక్ సిరామిక్ టైల్స్ ) ఉండేవారు. ఆయన కొంతకాలం శ్రీకాకుళం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా , హోల్ టైమర్ గా పనిచేశారు. ఆయన సాహిత్యరంగంలోనూ చాలా కృషి చేశారు. కవి కూడా.

త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో దగ్గరి బంధుత్వం కారణంగా వీరిపై నాస్తికత్వపు ప్రభావమూ ,ముద్ర ఉండేవి. 1983 లో స్వాతంత్ర్యవీర సావర్కర్ శత జయంతి వచ్చింది. అప్పటి బస్టాండు దగ్గరున్న హోటల్ దుర్గాభవన్ మీటింగ్ హాల్ లో శతజయంతి ఉత్సవ సభకు ఆయన అధ్యక్షులుగా వ్యవహరించారు. సావర్కర్ రచించిన ‘హిందుత్వ ‘ గ్రంథంపై ఒక సెమినార్ నిర్వహింపబడాలని అభిలషించారు. మీరు ఒకవైపు నాస్తికులు,మరోవైపు హిందుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.ఈ రెండూ ఎలా పొసగుతాయి అని ప్రశ్నించినవారికి ఆయన ఇలా వివరించారు:

” నేను హిందువుగా ఉన్నంతవరకు నాకు అన్ని రకాల స్వేచ్ఛలూ ఉంటాయి.దేవుడు లేడు అని చెప్పడానికి హిందుత్వం అనుమతిస్తుంది. నేను హిందువును కాను అనుకుంటే ఆ స్వేచ్ఛ నాకు అందుబాటులో ఉండదు. హిందువుగా ఉన్నంతవరకూ నా ఇష్టం వచ్చిన దుస్తులు ధరించవచ్చు. ఇష్టపడిన ఆహారం తినవచ్చు.ఇష్టపడిన దైవాన్ని కొలుచుకోవచ్చు. ఇష్టమైన రీతిలో పూజించవచ్చు, ప్రార్థించవచ్చు. లేదూ దేవుడే లేడనుకోవచ్చు. ఏ పూజలూ, ప్రార్థనలూ చేయకపోవచ్చు.ఇలా ఎన్నో విధాల స్వేచ్ఛలు నాకు ఉంటాయి.కానీ నేను హిందువును కాను,ఫలానా వేరే మతంవాడిని అనుకున్న రోజున నువ్వు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఆ మతమే నిర్ణయిస్తుంది.లుంగీ ధరించాలని చెప్పటమేకాదు, లుంగీని కట్టుకోవటం కాక ,తొడుక్కోవాలనీ నిర్దేశిస్తుంది. నువ్వు ఏమి తినాలో నిర్దేశిస్తుంది. నేను శాకాహారిగా ఉంటాను అంటే కుదరదు. చచ్చినట్లు గొడ్డుమాంసం తినాల్సిందే. నువ్వు ఏ భాషలో మాట్లాడాలో ఆర్డర్ వేస్తుంది. నీ తెలుగును వదిలేసి తురకం నేర్చుకోవాల్సిందే. దేవుడిని ఈ పేరుతోనే, ఈ పద్ధతిలోనే , ఈ చర్చికి వచ్చే ప్రార్థించాలి అంటే ఎదురుచెప్పకుండా అనుసరించాల్సిందే. అలాంటపుడు నాకు ఇంత స్వేచ్ఛ ఉన్న హిందూ సమాజాన్ని , తెలిసితెలిసి నేను ఎలా వదులుకోగలను ?”

జి.రామారావు

Leave a Reply