ఆమె..
ఖరీదైన జరీచీర కట్టి
భుజాన శాలువా చుట్టి..
చలువ కళ్లద్దాలు పెట్టి
రాజభవంతి మెట్లు
దర్జాగా దిగుతుంటే
అచ్చెరువొందిన జనం
ఆహా..రాణీ మాలినీదేవి
అని మురిసిపోయారు…
ఆ దర్పం..పొగరు..
జమునకే చెల్లు..!
అదే జమున…
అలిగి శయ్యపై పరుండి
శ్రీకృష్ణుడు ఎన్టీఆర్
కిరీటంపై తంతే
సత్యభామకు ఇంత టెక్కా
అని ముక్కున వేలేసుకున్నారు…
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్..
జమునకే ఒప్పినభంగిమన్..!
అదే అభినేత్రి..
అమ్మా కాఫీ అంటూ
గారాలు పోతూ..
పెళ్ళిచూపులకి వచ్చిన
రామబ్రహ్మం ఎస్వీఆర్ కి
సరోజ అని పుల్ల విరుపుగా
చెబితే గుండమ్మ కూతురు
ఇలాగే ఉండాలని
తెగ నచ్చేసారు..
నందమూరే విస్తుపోయేలా
ఎవడమ్మా వీడు అంటూ అంజిగాడిని గురించి అడిగితే
ఆశ్చర్యపోయినా
డాబాపై తిష్టవేసిన రాజాకి
అమృతాంజనం రాసి సిగ్గుపడితే పెద్దింటి పిల్ల
సొగసుగా సిగ్గుపడిందనుకుని
ముచ్చటపడ్డారు నాటి తెలుగింటి అమ్మలక్కలు..!
కైకమ్మ కులుకు..
తాసిల్దార్ గారమ్మాయి తళుకు
ఉండమ్మా బొట్టు పెడతా
అంటూ లచ్చిమి తల్లినే ఆపేసిన అణకువ..
ఏ పాత్రకు ఏ అభినయం
అవసరమో..అందమో
ప్రదర్శించే మెలకువ..
మంగమ్మ శపథం..
శబరి భక్తి..
ద్రౌపది పంతం..
జమునకే నప్పిన నటన..
ఆమెకే ఒప్పుననే
అభిమాన భావన..!
అంతటి అందాలరాశి
అనారోగ్యంతో
మూగనోము పట్టినా..
నేనోడిపోయి గెలుపొందినాను
అంటూ ఇప్పటికీ పరిశ్రమతో
చెక్కుచెదరని బంధం..
ఒకనాటి ఆమె సౌందర్యం
అక్కలు సావిత్రి..అంజలి..
భానుమతి వెళ్ళినా
హుషారుగా కళ్ళముందు
తిరుగాడుతున్న
ఆరోగ్య రహస్యం..
అదే అదే వింత నేను తెలుసుకున్నది..
అంటుందా..
లేక మాను మాకును కాను
రాయి రప్పను కానేకాను
మామూలు మనిషిని నేను..
మీ జమునను నేను..
అంటుందా మన
అచ్చ తెలుగు గౌరమ్మ!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286