Suryaa.co.in

Political News

ప్రియమైన మోడీజీ..!

ఈరోజు
మీ పుట్టినరోజంట..
మంచిది..
అందుకోండి శుభాకాంక్షలు..
పండిట్ నెహ్రూ..
ఇందిరా గాంధీ..
మన్మోహన్ సింగ్..
తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన,నిర్వర్తిస్తున్న
మీకు అభినందనలు..
ఎక్కువ కాలం పాటు అతున్నత పీఠంపై కూర్చున్న కాంగ్రెసేతర ప్రధాని కూడా మీరే కావడం హర్షణీయం..కోవిడ్ ఉత్పాతం సమయంలో ముందుండి
మీరు జాతిని నడిపించిన తీరు ప్రశంసనీయం.
కాకపోతే మొదటి వేవ్ లో దేశం పెద్దగా ఇబ్బంది పడకపోవడం వల్ల
మీ వైఫల్యాలు..
తప్పిదాలు జనాలకు పెద్దగా కనిపించలేదు..అంతర్జాతీయ రవాణాపై ఆంక్షలు విధించడంలో..
లాక్డౌన్ అమలులో జరిగిన జాప్యం…ముందూ వెనకా ఆలోచించకుండా
లాక్డౌన్ నిబంధనల సడలింపు..
ఇత్యాది నిర్ణయాల కారణంగా
తర్వాతి రోజుల్లో
ఎంత మూల్యం చెల్లించుకున్నామో,
రెండో దశలో ఎంతగా ఇబ్బంది పడ్డామో ప్రపంచం మొత్తానికి తెలుసు..అయినా తొలి దశ సమయంలో మీరు ప్రపంచ నాయకుడిగా వెలిగిపోయారు.
ఇక ప్రధానిగా
మీ ప్రస్థానంపై
నా శైలిలో ఓ అవలోకనం..!

పదేళ్ల మన్మోహన్ ఏలుబడి
తర్వాత బిజెపి బడి నుంచి వచ్చిన సమ్మోహనుడివి..
గుజరాత్ కీ బారాత్..
మార్చేస్తావనుకుంటే
మా తలరాత..
పెట్టేస్తున్నావు కీలెరిగి వాత
ధరల మోత!

నీ రాకతో పొడుస్తుంది తొలిపొద్దు అని తలపోస్తే
పొద్దు పొద్దున్నే
వద్దు వద్దు అనిపించే
నోట్ల రద్దు..
ఆర్థిక వ్యవస్థపై
కోలుకోలేని పిడిగుద్దు!

విదేశాల నుంచి నల్లధనం వెనక్కి అన్న మాటే మరచి
నల్లకుబేరులను
ఇతర దేశాలకు
ఎగుమతి చేస్తూ దేశాన్ని
ఆర్థిక నేరస్థుల
నందనవనం గా మార్చేసి..
కేసులను నీరుగార్చేసి..
నిజాయితీ పాలన అంటూ
జనాల్ని ఏమార్చేసి..
మొత్తానికి వ్యవస్థనే పరిమార్చేసి పేదోడి
బతుకు చిత్రాన్నే మార్చేసావు..
నీ పాలనలో
ఆల్ మోడీస్ హేపీస్..
పేదోడి బతుకే పీస్ పీస్..!

మెరిసే తల..నెరిసే గడ్డం..
మురిసే అమ్మ..
తిరిగే అద్వానీ వంటి పెద్ద తలకాయల దిమ్మ..
ఖరీదైన షేర్వాని..కోటుతో
నీ బొమ్మ..
ఇదే కదా ఏడేళ్లుగా
ఎన్డీఏ బైస్కోపులో
నీ ఏలుబడి పేరిట చూపిస్తున్న
70 ఎమ్మెమ్ బొమ్మ..!
ఎన్నో ఏళ్లుగా దేశాన్ని
పట్టి పీడించిన
కాంగిరేసును కాదని సాధించింది ఏమిటని…
స్కాముల్లేవేమో.. స్కీములున్నాయిగా..!?
కుంభకోణాలు కనుమరుగైనా
పంబరేగే అవినీతి కథలు
వెలుగు చూడట్లేదా..
టైటిల్ మారిందేమో..
మా తెలుగు సినిమాల్లా
అవే కథలు..అవే వ్యధలు..
హీరోగా మీరు సెహెన్షా..
స్క్రీన్ ప్లే..దర్శకత్వం
అమిత్ షా!

సరే..ఏవి ఎలా ఉన్నా
ఎంతగా సరిపెట్టుకుంటున్నా
నమ్మకంగా
ఈ అమ్మకాలేంటి స్వామీ..
అంబానీ అదానీల సునామీ…
వీటి ఎనకాల
ఎవరయ్యా బినామీ?
ఇదిగో ఓ మాట..
నీ ఏలుబడిలో
వికటించిన పంట
పెట్రో మంట..
పన్ను కడితే పన్ను
కన్ను పడితే అమ్మకం..
ఏందో మీ వాలకం!
పవర్ ప్లాంట్లు..స్టీల్ ప్లాంట్లు
అన్నీ మీ ఇద్దరి ప్లాట్లు..
దేశానికేంటో
ఈ బీదలపాట్లు..!

పుట్టినరోజున మంచివి..
కొత్తవి నిర్ణయాలు పరిపాటి..
ఇన్నాళ్లు..ఇన్నేళ్ళు
ప్రేమిస్తూ ప్రైవేటు..
మా నమ్మకంపై వేస్తూ వేటు
ఇకనైనా మానేసి
మార్చవయ్యా నీ రూటు..
తగ్గిస్తూ బడ్జెట్ లోటు..
నీ చుట్టూ తుడిచేస్తే కచ్చా..
నీ నేతృత్వంలో
భారత్ సారే జహాసే అచ్ఛా..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE