-ఇసుక, భూబకాసురుడికి ఓటేస్తారా?
-బాపట్ల ప్రజలు ఆలోచించండి
-నల్లమడ వాగు ఆధునికీరణను గాలికొదిలిన జగన్
-మతోన్మాది మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంపారు?
-బాపట్ల బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు
పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బాపట్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ అభ్యర్థిపై మండిపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే పనికి వచ్చాడా? ప్రజల అవసరాలు తీర్చారా? మొత్తం ఇసుక మాఫియా అంట కదా.. టీడీపీ వాళ్లు కిటికీలు మాత్రమే దోచారు.. వైసీపీ మొత్తం గడపలే దోచేశారు.. భూ బకాసురుడు అంట కదా..తక్కువకు భూములు గుంజుకుని సర్కార్ దగ్గర ఎక్కువ ధర దోచాడు అంట కదా.. ఇలాంటి దొంగకు మళ్లీ దోచుకుతినమని సీట్ ఇచ్చాడా? ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఇదే బాపట్లలో నల్లమడ వాగు ప్రతి ఏటా ఉప్పొంగుతుంది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగుతుంది. ఆధునీకరణ చేయాలని వైఎస్‌ఆర్ అనుకున్నారు. ఈ కాలువను పట్టించుకోని జగన్ వైఎస్‌ఆర్ వారసుడు కాదు. ఐదేళ్లు గాడిదలు కాసి ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదని మండిపడ్డారు. ఐదేళ్లు కోటలు కట్టుకుని బతికాడని విమర్శించారు.
ప్రధాని మాట్లాడాల్సిన మాటలేనా?
కాంగ్రెస్‌పై మోదీ విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే మంగళసూత్రాలు తెంచుతామట. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా? గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు? మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళ సూత్రాలు తెంచారు? రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారు. ప్రధానికి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. ముస్లింలను కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మతతత్వ పార్టీతో బాబు, జగన్ కొంగుపట్టుకుని తిరుగుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు గాలికొదిలి ఆ పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు.