Suryaa.co.in

Andhra Pradesh

ఇంటి వద్దకే ఫించన్ ఇవ్వాలి

-వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి వీళ్లేదు
-సర్వే పల్లిలో దొరికిన 4500 మద్యం సీసాల ఘటనపై విచారణ జరిపి లిక్కర్ డాన్ కాకాణి గోవర్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి
-ఈసీకి వర్ల ఫిర్యాదు

వచ్చే నెల ఒకటవ తేదీనే ఇంటి వద్దకే వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈసీని కోరారు. వెలగపూడిలోని సచివాలయంలో ఈసీ ముకేశ్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….వాలంటీర్లను సంక్షేమ పధకాల అమలు బాధ్యత నుంచి తప్పించిందన్న వంకతో ఫించన్లు ఇంటివద్దకే అందించకుండా వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. ఫించన్లు సకాలనికి ఇవ్వకుండా వృద్దులను ఎండకు తిప్పి ఇబ్బందులకు గురి చేసి 31 మంది వృద్దుల్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. వచ్చే నెల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 1 తీదీనే ఇంటి వద్దకే ఫించన్లు అందించేలా చర్యలు చేపట్టాలని ఈసీని కోరాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై ఛీప్ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాస్తాం. ఇప్పటికే మా నాయకుడు చంద్రబాబు నాయుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారని వర్ల రామయ్య తెలిపారు.

వైసీపీకి చెందిన రామాల మన్విత్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి టీడీపీ లోగో, చంద్రబాబు పోటోలు పెట్టుకుని టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీలు, మైనార్టీల సంగతి చూస్తామంటూ టీడీపీపై ఆ వర్గాల్లో ద్వేషం పెంచేలా ప్రచారం చేస్తున్నాడు. ఇతనిపై గతంలో సీఐడీ అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇతినిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరాం.

జగన్ దొంగదారిన, దొడ్డిదారిన అధికారం నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతలు వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించి ప్రచారానికి, పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని కుట్ర పన్నారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఎలక్షన్ ఏజెంట్లుగా కూర్చోవడానికి వీళ్లేదు, వారు ఓటర్లను ప్రభావితం చేస్తారని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం. పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరాం.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్ది మంత్రి కాకాణి గోవర్దర్ రెడ్డి స్నేహితుని చేపల చెరువు దగ్గర 4,500 మద్యం సీసాలు పోలీసులకు దొరికాయి. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కాకాణిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరాం. వైసీపీ అధినేత జగన్ దగ్గర నుంచి ఆ పార్టీ నేతలంతా ఏదొక నేరాలు చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇలాంటి నేరస్తులు రాష్ట్ర ప్రజలకు అవసరమా?

వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఎన్డీయే కూటమిని గెలిపేంచేందుకు సిద్దంగా ఉన్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావాలన్న ముఖ్యమంత్రి జగన్ దింపుడు కళ్లెం ఆశలు కట్టిపెట్టి న్యాయబద్దంగా, ధర్మబద్దంగా ఎన్నికలు ఎదుర్కోవాలని వర్ల రామయ్య అన్నారు. ఈసీని కలిసిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేత ఆర్డీ విల్సన్, జనసేన నేత శివశంకర్, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE