-శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, స్పీకర్,డిప్యూటీ స్పీకర్‌కు అసెంబ్లీ ఉద్యోగుల అభ్యర్ధన
– వేధింపులపై విచారణ చేయించండి
– ప్రమోషన్లు త్వరగా ఇప్పించండి
– అసెంబ్లీలో స్వేచ్ఛగా పనిచేసుకునేలా చూడండి
– ఏడాది నుంచి ఐడి కార్డులకే దిక్కులేదు
– వేధింపులతో మృతి చెందిన యుగంధర్‌రావు కుటుంబాన్ని ఆదుకోండి
– ఇద్దరు ఆడపిల్లలతో రోడ్డున పడ్డ మృతుడి కుటుంబం
– గత ఎన్నికల్లో లోకేష్ గెలుపు కోసం ప్రచారం చేసిన మృతుని భార్య
– అమలాపురంలో వారి కుటుంబమూ టీడీపీనే
(మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రజాస్వామ్యయుత వాతావరణంలో చర్చలు జరిగే అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగులకు అలాంటి ప్రజాస్వామ్య-స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేలా చూడాలంటూ అసెంబ్లీ ఉద్యోగులు శాసనసభా వ్యవహారాల మంత్రి, స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ స్పీకర్‌కు మొరపెట్టుకుంటున్న విషాద వైనమది.
గత ఏడాదిన్నర నుంచి నిర్బంధ-వేధింపుల మధ్య.. తీవ్ర ఒత్తిళ్లతో పనిచేస్తున్న తమను, మానవతా దృక్ఫతంతో ఆదుకోవాలన్న అసెంబ్లీ ఉద్యోగుల ఆర్తనాదాలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ సెక్రటేరియేట్‌లో నెలకొన్న అప్రజాస్వామ్య వాతావరణం స్థానంలో, స్వేచ్ఛగా పనిచేసుకునే మునుపటి ఆత్మీయ వాతావరణం తీసుకువచ్చేలా చూడాలంటూ కోరుతున్న ఉద్యోగుల వేదన ఇది.
సహజంగా ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, ఏ సంస్థ యాజమాన్యం అయినా గుర్తింపు కార్డులు ఇస్తుంది. ఫలానా వ్యక్తిని పోలీసులు అడ్డగిస్తే, ఆ గుర్తింపు కార్డులు చూపిస్తారు. అలాంటిది.. అసెంబ్లీలో పనిచేసే ప్రైవేటు-కాంట్రాక్టు ఉద్యోగులకు ఏడాది నుంచి గుర్తింపుకార్డులు లేవంటే నోరెళ్లబెట్టక తప్పదు. నిజం!
అవుట్ సోర్సింగ్ నుంచి చౌకీదార్ల వరకూ అసెంబ్లీలో డజన్ల సంఖ్యలో పనిచేస్తున్నారు. వారికి ప్రతి ఏడాది గుర్తింపు కార్డులు ఇస్తుంటారు. ఇది కొత్తగా వచ్చిన సంప్రదాయేమీ కాదు. కానీ గత ఏడాది నుంచి వారికి గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం, బయట తిరిగే వారికి ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో, పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమవుతున్న పరిస్థితి.
‘‘ఈ సమస్యను సెక్రటరీ జనరల్ గారి దృష్టికి తీసుకువెళదామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు. పోనీ ఆయన కార్యాలయం కూడా స్పందించరు. ఆయన ఆఫీసు అనుమతిస్తే తప్ప మేం సార్‌ను కలవలేం. సూటిగా చెప్పాలంటే మా అసెంబ్లీలో రాజరిక వ్యవస్థ నడుస్తోంది. కానీ మేం సీఎం, మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌ల వద్దకు వెళితే వారు మాతో ఆత్మీయంగా మాట్లాడతారు. కానీ ఆయన మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఒకవేళ మొన్నటిమాదిరిగా ధైర్యం చేసి లోపలికి వెళితే, అపాయింట్మెంట్ లేకుండా ఎలా వచ్చారంటూ మండిపడతారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ వాటిని ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలో మాకు అర్ధం కావడం లేదు. శాసనసభా వ్యవహారాల మంత్రిగారేమైనా చొరవ తీసుకుని, మా సమస్యలు పరిష్కారనుకుంటే ఆయన కూడా పట్టించుకోర’’ని ఉద్యోగులు వాపోతున్నారు.
దశాబ్దాల నుంచి తక్కువ సిబ్బందితోనే పనిచేస్తున్నామని, దానితో తమపై పనిభారం పెరుగుతోందంటున్నారు. అంత పనిభారంతో పనిచేస్తున్న తమను అభినందించకపోయినా ఫర్వాలేదు. కానీ ఈ వేధింపులు ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన రామాచార్యుల వరకూ అసెంబ్లీలో స్వేచ్ఛాయుత వాతావరణ ఉండేదని, చివరకు సెక్రటరీ చాంబరుకు ఎప్పుడయినా వెళ్లి, తమ సమస్యలు వెళ్లబోసుకునే స్వేచ్ఛ ఉండేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
కానీ గత ఏడాదిన్నర నుంచి అసెంబ్లీలో నియంతృత్వ వాతావరణం కొనసాగుతోందని, దానితో ఆ వేధింపులకు తాళలేక తమకు సుగరు, బీపీలు వస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియంతృత్వ విధానాల వల్లే ఒక వికలాంగ ఉద్యోగి మృతి చెందగా, మరో ఉద్యోగి ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేస్తున్నారు.
అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారాలపై ఒక విచారణ కమిటీ వేస్తే, నిజానిజాలు తెలుస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ‘మేం ఎంతోమంది సెక్రటరీల వద్ద పనిచేశాం. వారి నుంచి పని నేర్చుకున్నాం. ఒక్కోసారి మేం తప్పు చేస్తే వాళ్లు మందలించినా మా మేలు కోసమే మందలించారనుకునే వాళ్లం. అలాంటి ఆత్మీయ వాతావరణ ఉండేది. కానీ ఇప్పటిలా నియంతృత్వ పరిస్థితి ఎప్పుడూ చూడలేద’ని సీనియర్ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక కొద్దిరోజుల క్రితం వేధింపులకు గురై, మెదడలో నరాలు చిట్లిపోయి.. బ్రెయిన్‌డెడ్‌తో మృతి చెందిన యుగంధర్‌రావు భార్య, గత ఎన్నికల్లో తాడేపల్లిలో యువనేత లోకేష్ కోసం ప్రచారం నిర్వహించారట. దానితో ఆమెను, లోకేష్ కూడా వెంటనే గుర్తుపడతారట. ఆమె భర్త ఎక్కడ కనిపించినా, మేడమ్ బాగున్నారా అంటూ క్షేమ సమాచారాలు అడుగుతారట. పైగా అమలాపురంలోని ఆమె కుటుంబం అంతా టీడీపీ సానుభూతిపరులేనట. మరి అలాంటి కుటుంబం బాసుల వేధింపులతో అనాధగా మారిన విషాదం.
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే!
– నాలుగు నెలల నుంచి నా భర్త కష్టాలు పెరిగాయి
– నన్ను వేధిస్తున్నారని నాతో చెప్పి బాధపడేవారు
– నా కుటుంబాన్ని అనాధను చేశారు
– నా భర్తను కాపాడుకునేందుకు లక్షలు అప్పు చేశా
– మణిపాల్ ఆసుపత్రి వాళ్లు డబ్బులు గుంజేశారు
– చికిత్స చేయకుండా రెండు లక్షలు తీసుకున్నారు
– లోకేష్ నన్ను అభిమానంగా పలకరిస్తారు
– ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు?
– వేధింపులతో మృతి చెందిన అసెంబ్లీ ఉద్యోగి భార్య నాగేశ్వరి ఆవేదన
‘‘ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే. ప్రభుత్వం వదిలిపెట్టవద్దు. మా పెళ్లి అయి 12 ఏళ్లయింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆయన మమ్మల్ని ఆప్యాయంగా చూసుకున్నారు. ఆయనకొచ్చే జీతంతో హైదరాబాద్, విజయవాడలోని చిగురు ఆశ్రమానికి ప్రతినెల ఎంతో కొంత ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మేం అనాధలయి రోడ్డున పడ్డాం. ఇద్దరి తలిదండ్రులు లేరు. ఎలా బతకాలో అర్ధంకావడం లేదు. ఇక బతుకుభయంతో ఇద్దరు ఆడపిల్లలను బతికించుకోవాలి. ఆయనను బతికించుకునేందుకు లక్షలు అప్పు చేశా. వాటిని ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదు. మా కష్టం తీర్చేదెవరు’’
– అసెంబ్లీ ఉద్యోగి యుగంధర్‌రావు భార్య నాగేశ్వరి కన్నీటి ప్రశ్న ఇది.
భర్తను కోల్పోయిన ఆమె.. 12వ రోజున అమరావతి లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తన ఇద్దరి ఆడపిల్లలతో నిద్ర చేయడానికి వచ్చిన సందర్భంగా గద్గద స్వరంతో చేసిన వ్యాఖ్యలివి.
ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. ‘‘ మా వారు 22 ఏళ్ల నుంచి అసెంబ్లీలో పనిచేస్తున్నారు. మా మామ గారు వీఆర్ఎస్ తీసుకుని ఆయనకు ఉద్యోగం ఇప్పించారు. మా మామగారు, మా నాన్నగారు అంతా టీడీపీ కోసం పనిచేశారు. నేను కూడా గత ఎన్నికల్లో లోకేష్ గెలుపు కోసం మా మంగళగిరి నియోజవర్గంలో ప్రచారం చేశా. నన్ను లోకేష్ బాబు గుర్తుపట్టి అభిమానంగా పలకరిస్తారు. మా వారు ఎక్కడ కనిపించినా మేడమ్ బాగున్నారా? అడిగినట్లు చెప్పండని చాలా అభిమానంతో పలకరిస్తారు. నేను పీజీ చేశా. కమర్షియల్ టాక్సులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా’’ అని చెప్పారు.
‘‘ మాకు ముందూ వెనకా ఎవరూ లేరు. ఆయన తలిదండ్రులు, మా తలిదండ్రులు లేరు. మొన్న కరోనాలో పోయారు. మేం ఇద్దరిమే. నన్ను ఆయన బాగా చూసుకునేవారు. ఆయన వికలాంగుడైనా ఇష్టపడి 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నా. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ల భవిష్యత్తు ఏమిటని ఆలోచించుకుంటేనే భయమేస్తుంది. ఫస్ట్ క్లాస్ చదువుతున్న మా చిన్న పాప.. అమ్మా నాన్న ఫంక్షన్ నుంచి ఎప్పుడొస్తారని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి శత్రువులకూ రాకూడదు. ఇకపై ఎలా బతకాలో అర్ధం కావడం లేద’’ని ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘ తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా కచ్చితంగా శిక్షపడాల్సిందే. లేకపోతే వాళ్లు ఇంకొకరి కుటుంబాన్ని నాశనం చేస్తారు. వాళ్ల వల్ల మరికొన్ని కుటుంబాలు నా మాదిరిగా రోడ్డునపడతాయి. కనీసం మా వారు వికలాంగుడన్న జాలి కూడా లేకుండా రాక్షసత్వంగా వేధించారు. ఇప్పుడు నాకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. నాలుగునెలల నుంచి తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన నాతో చెప్పి బాధపడేవారు. ఓర్పు వహించండి. మనకు ఉద్యోగం ముఖ్యం కదా అని సముదాయించేదాన్ని. ఆయనకు ఆరోగ్యం బాగుండదు. ఇప్పటికే స్టెంటు వేశారు. హైబీపీ కూడా ఉంది. ఆయనను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఉద్యోగులందరూ అండగా ఉన్నారు. మూడులక్షల వరకూ సాయం చేశారు. నేను నా నగలు అమ్ముకున్నా. అయినా ఆయన దక్కలేదు. నా కర్మ అలా కాలింది’’ అని కన్నీటి పర్యంతమయింది.
‘‘ అక్టోబర్ 7 ఉదయం ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. అడ్మిట్ చేసుకునే ముందు 2 లక్షల 40 వేలు డిపాజిట్‌గా కట్టించుకున్నారు. డబ్బులు పోయినా మనిషి బతుకుతారని అప్పు చేసి కట్టేశా. కానీ వాళ్లు ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదు. ఐసియులో పెట్టారు. ఎందుకో మాకు చెప్పలేదు. ఆయనను మాకు చూపించలేదు. కష్టాల్లో ఉన్న మాలాంటి వాళ్లను మణిపాల్ ఆసుపత్రి అలా దోచుకుంటోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను కాపాడుకునేందుకు ఆ విధంగా ఆసుపత్రులకు, 9 లక్షల 70 వేలు ఖర్చయిందని వెల్లడి ంచింది. ఆ సమయంలో తన భర్తకు మూడుసార్లు స్ట్రోక్ వచ్చిందని, దగ్గర అయినందుకే మణిపాల్‌కు తీసుకువెళ్లానని చెప్పారు.
శిలాఫలకంపై సీఎం పేరేదీ?
పార్లమెంటులో ఏదైనా భవన ప్రారంభోత్సవం జరిగితే దాని శిలాఫలకంపై ప్రధాని-స్పీకర్ పేరు ఉండటం సహజం. అలాగే రాష్ట్ర స్థాయిలో.. శాసనసభ-శాసనమండలిలో నూతన నిర్మాణాలకు సీఎం-స్పీకర్ పేరు చేర్చడం కూడా అంతే సహజం. మొన్నటి కొత్త లోక్‌సభ భవన ప్రారంభోత్సవ శిలాలకంపై కూడా ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా పేరుతో శిలాఫలకం ఏర్పాటుచేశారు. అక్కడ లోక్‌సభ సెక్రటరీ జనరల్ పేరు అందులో చేర్చలేదు. మరి ఆ ప్రకారంగా.. ఇటీవల అమరావతిలో నిర్మించిన శాసనమండలి భవన నిర్మాణ శిలాఫలకంపై కూడా సీఎం పేరు ఉండాలి కదా? కానీ విచిత్రంగా భూతద్దం పెట్టి వెతికినా, సీఎం పేరు ఆ శిలాఫలకంపై కనిపించలేదు. కేవలం స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మున్సిపల్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, సెక్రటరీ జనరల్ పేర్లు మాత్రమే దర్శనమిచ్చింది.
అసలు ఆ శిలాఫలకంపై సీఎం, శాసనమండలి చైర్మన్ పేరు లేకుండా, తన పేరు వేసుకోవడంపై సెక్రటరీ జనరల్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పోనీ ఆయన పూర్తి స్థాయి అసెంబ్లీ ఉద్యోగి కూడా కాదు. కేవలం కాంట్రాక్టు ఉద్యోగి. మరి దాన్ని అడిగేవారెవరు? దానిపై చర్య తీసుకునేదెవరు? స్వయంగా సీఎం పేరు లేకుండా శిలాఫలకం ఏర్పాటుచేయడమంటే, అందుకు ఎంత ధైర్యం ఉండాలి? తెరవెనుక ఎంత దన్ను లేకపోతే, ఒక అధికారి అంత సాహసం చేస్తారన్నది ప్రజాప్రతినిధుల ప్రశ్న.
మండలి చైర్మన్ వైసీపీకి చెందిన వారయినప్పటికీ, సంప్రదాయాలు- ప్రొటోకాల్ పాటించడం ధర్మం. అసలు ఎన్నిసార్లు తనను కలవాలని ఆదేశించినా సెక్రటరీ జనరల్ రాకపోవడం, శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తే, నిండు సభలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిన దుస్థితి. తప్పు ఒకరిదయితే, క్షమాపణ మరొకరిదా? అన్నది ఎమ్మెల్యేల ప్రశ్న. అంటే ప్రభుత్వంతో క్షమాపణ చెప్పించిన అధికారి పలుకుబడి ఏమిటన్నది అర్ధమవుతూనే ఉంది.
అంతేనా?.. ఇటీవలి శాసనసభ సమావేశాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి తన శాఖకు సంబంధించిన రెండు ప్రశ్నలు ఒకే సమయంలో అటు అసెంబ్లీ, ఇటు కౌన్సిల్‌కు అలాట్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఆ లెక్కన మంత్రి ఏ సభకు హాజరుకావాలి? అంతేనా? ఒకే శాఖకు సంబంధించి ఒకే ప్రశ్న రెండుసార్లు ఇవ్వడం మరో ఆశ్చర్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పేరు తొలగించి ఎన్టీఆర్ వైద్యసేవ ఏర్పాటుచేసింది. చివరకు దానికీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
కానీ ప్రశోత్తరాల్లో ఇంకా ఆరోగ్యశ్రీ అనే దర్శనమివ్వడం మరో విశేషం. నిజానికి ఇవన్నీ సెక్రటరీ జనరల్ తనిఖీ చేసి, ఆమోదించిన తర్వాతనే ప్రింటింగుకు ఇవ్వాలి. అందులో ఎన్ని తప్పులున్నా దానికి ఆయనే జవాబుదారీ. అయినా ఇన్ని తప్పులున్నాయంటే, వాటిని ఆయన ఎంత శ్రద్ధగా పరిశీలించారో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ అనేది పూర్తిగా ఎమ్మెల్యేలదే. సెక్రటరీ జనరల్ లేదా సెక్రటరీ నుంచి సెక్షనాఫీసర్ వరకూ అసెంబ్లీ చెప్పినట్లు చేయాల్సిందే. అంటే వారంతా ఎమ్మెల్యేల తర్వాతనే అన్నమాట. కానీ గత ఏడాదిన్నర నుంచి అసెంబ్లీలో, దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
సహజంగా అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు తిరుగుతుంటారు. గోడకు ఒకవైపున నిలబడి మీడియా ప్రతినిధులు మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ చేస్తారు. అంతేగానీ ఎమ్మెల్యేలకు ఎవరూ అడ్డురారు. వారిని పక్కకు వెళ్లమనే అధికారం ఎవరికీ ఉండదు. ఇటీవలి సమావేశాల్లో ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను మార్షల్స్ పక్కకు నెట్టివేయడం, అందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంపై పెద్ద చర్చ జరిగింది. దానికి కారణం సెక్రటరీ జనరల్ వస్తుండటమే.
నిజానికి అసెంబ్లీలో సెక్రటరీ జనరల్ కంటే ఎమ్మెల్యేలే ఎక్కువ. గతంలో సెక్రటరీలుగా పనిచేసిన వారికెవరికీ, లాబీలో మార్షల్స్ సెక్యూరిటీగా వచ్చేవారు కాదు. సెక్రటరీగా పనిచేసిన దివంగత సత్యనారాయణ, సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన రామాచార్యులు, బాలకృష్ణమాచార్యులు ఒక్కరే అసెంబ్లీలోని సీఎం ఆఫీసుకు వెళ్లేవారని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు.